గ్యాస్‌ సిలెండర్‌ పేలి రెండు ఇళ్లు ధ్వంసం

ABN , First Publish Date - 2022-05-29T09:06:28+05:30 IST

గ్యాస్‌ సిలెండర్‌ పేలి రెండు ఇళ్లు ధ్వంసం

గ్యాస్‌ సిలెండర్‌ పేలి రెండు ఇళ్లు ధ్వంసం

నలుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

శెట్టూరు, మే 28: గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఓ కుటుంబంల్చో నలుగురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు, గ్రామానికి చెందిన కొలిమి రజాక్‌, అతని కుమారుడు అబ్దుల్లా కమ్మరి పనులు చేస్తుంటారు. రజాక్‌ భార్య రజియాబీ కొన్నేళ్ల క్రితం మృతిచెందింది. కుమారుడు అబ్దుల్లా భార్య కౌషన్‌ బాను తన కూతురు జైబాతో కలిసి మూడు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. దీంతో తండ్రి, కొడుకు శుక్రవారం రాత్రి ఇంట్లో వంట చేసుకుని భోజనం చేశారు. కానీ గ్యాస్‌ స్టవ్‌ ఆఫ్‌ చేయడం మరిచిపోవడంతో లీకైన గ్యాస్‌ ఇల్లంతా వ్యాపించింది. నమాజుకు వెళ్లేందుకు రజాక్‌ వేకువజామున నిద్రలేచి.. వంటగదిలో స్విచ్‌ వేయడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో రజాక్‌ ఉంటున్న ఇంటితో పాటు పక్కనే ఉన్న అతని తమ్ముడు సదుద్దీన్‌ ఇల్లు కూడా ధ్వంసమైంది. ఆ ఇంట్లో నిద్రిస్తున్న సదుద్దీన్‌ భార్య జైనూబీ(60), కుమారుడు దాదాపీర్‌ (35), కోడలు షర్ఫన (30), మనవరాలు ఫీరూబీ (5) నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. రజాక్‌, అబ్దుల్లా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దం విన్న స్థానికులు.. రజాక్‌ ఇంటివద్దకు పరుగులు తీశారు. రెండు ఇళ్లు కూలిపోవడం గమనించి, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని కళ్యాణదుర్గం ఆసుపత్రికి, మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అగ్నిమాపక, పోలీస్‌, రెవెన్యూ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.  

Updated Date - 2022-05-29T09:06:28+05:30 IST