గ్యాస్ పైప్‌లైన్ అలైన్‌మెంట్ మార్చాలి

ABN , First Publish Date - 2022-02-03T06:14:14+05:30 IST

కర్ణాటకలోని హస్సన్ నుండి హైద్రాబాద్‌లోని చర్లపల్లి వరకు హెచ్‌పిసిఎల్ కంపెనీ గ్యాస్ పైప్‌లైన్ నిర్మిస్తోంది. వనపర్తి మున్సిపాలిటీకి దగ్గర రాజపేట శివారులో శాటిలైట్ సర్వే పేరు చెప్పి...

గ్యాస్ పైప్‌లైన్ అలైన్‌మెంట్ మార్చాలి

కర్ణాటకలోని హస్సన్ నుండి హైద్రాబాద్‌లోని చర్లపల్లి వరకు హెచ్‌పిసిఎల్ కంపెనీ గ్యాస్ పైప్‌లైన్ నిర్మిస్తోంది. వనపర్తి మున్సిపాలిటీకి దగ్గర రాజపేట శివారులో శాటిలైట్ సర్వే పేరు చెప్పి అయినవారి భూములు తాకకుండా గిరిజనుల భూముల లోంచి ఈ పైప్‌లైన్ నిర్మిస్తున్నారు. దీంతో గిరిజనులు తమ భూములను కోల్పోతున్నారు. ఇప్పటికే యాభై ఫీట్ల వెడల్పుతో ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ వల్ల వీరు కొంత భూమి కోల్పోయారు. ప్రజలను కాపాడవలసిన ప్రభుత్వ యంత్రాంగం కూడా కంపెనీకి వత్తాసు పలుకుతోంది. గత డిసెంబర్ 23న తమ భూముల్లో గ్యాస్ పైప్‌లైన్ వేయవద్దని గిరిజనులు అడ్డుకుంటే హెచ్‌పిసిఎల్ యాజమాన్యం పోలీసులను మోహరించి బలవంతంగా గిరిజనులను పోలీస్ స్టేషన్‌కు తరలించి కోతకు రాని పంటను జెసిబిలతో తొలగించే ప్రయత్నం చేసింది. 


హై టెన్షన్ విద్యుత్ లైన్ కింద నుంచి గ్యాస్ పైప్‌లైన్ వెళ్లడానికి రైతులు ఒప్పుకున్నారు. అంతేగాక ప్రతిపాదిత గ్యాస్ పైప్‌లైన్ పక్కనే 60 అడుగుల వెడల్పుతో నిరుపయోగంగా పాత కాలువ (వాగు) ఉంది, దాని గుండా పైప్‌లైన్ నిర్మించవచ్చు. ప్రస్తుత 33 ఫీట్ల వైటిసి బిల్డింగ్ రోడ్డు గుండా పైప్‌లైన్ వెళ్లే అవకాశం ఉన్నా ఈ ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. వెంటనే గ్యాస్ పైప్‌లైన్ అలైన్‌మెంట్ మార్చాలి. తప్పనిసరి పరిస్థితుల్లో గ్యాస్ పైప్‌లైన్ ప్లాట్ల గుండానే తీసుకెళ్లదలిస్తే ప్లాట్లు కోల్పోతున్న వారికి మార్కెట్లో అదే విలువ గల వేరే ప్రాంతంలో ప్లాట్లు కేటాయించాలి.

ఎమ్.డి జబ్బార్

సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి, వనపర్తి

Updated Date - 2022-02-03T06:14:14+05:30 IST