కళ్లు మూసుకుని రైలు పట్టాలపై నిలుచున్న యువతి.. సరిగ్గా అదే సమయంలో అటుగా వచ్చాడో ఆటో డ్రైవర్.. ఆమెను చూసి..

Sep 28 2021 @ 08:45AM

మధ్యప్రదేశ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అత్యంత వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా ఒక యువతి ఆత్మహత్య చేసుకునేందుకు నిలుచుంది. ఆ  రైలు ఆమెను సమీపించేందుకు కొద్ది సెకెన్ల సమయం మాత్రమే ఉంది. ఇంతలో ఒక ఆటో డ్రైవర్ తన ప్రాణాలను లెక్కచేయకుండా ఆ యువతిని కాపాడాడు. ఈ ఘటన బైతూల్ పరిధిలోని సోనాఘాటీ రైల్వే క్రాసింగ్ దగ్గర చోటుచేసుకుంది. అక్కడ రైల్వే గేటు వేసి ఉన్నప్పటికీ, ట్రాక్‌ పక్కగా ఒక యువతి నిలుచుంది. తరచూ తన మొబైల్ ఫోనువైపు చూసుకుంటోంది. రైలు రాకకోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. 

ఇంతలో ఆమెను గమనించిన ఒక ఆటో డ్రైవర్‌కు సందేహం కలిగింది. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నదని అతను గ్రహించాడు. ఇంతలో ఒక రైలు వేగంగా వస్తోంది. ఆమె ఒక్క ఉదుటన పట్టాల మధ్యకు వెళ్లి నిలుచుంది. వెంటనే అప్రమత్తమైన ఆటో డ్రైవర్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమెను పట్టాల నుంచి పక్కకు లాగాడు. ఆటో డ్రైవర్ తన ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడాడు. ఈ ఘటన అనంతరం ఆమె రోదించసాగింది. ఆమెను గమనించిన రైల్వే గేటు సిబ్బంది కూడా అక్కడకు వచ్చారు. వారు వెంటనే ఆమె దగ్గరున్న మొబైల్ ఫోను తీసుకుని, ఆమె ఇంటిలోని వారికి ఫోనుచేసి, విషయమంతా చెప్పి వారిని పిలిపించారు. వారు వచ్చాక ఆమెను వారితో పంపించారు. కాగా ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆ యువతి వివరాలు వెల్లడికాలేదు. కాగా ఆమె ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్ మొహసిన్ ఆటో అంబులెన్స్ నడుపుతుంటాడు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారిని ఆసుపత్రులకు తరలిస్తుంటాడు. ఆ యువతిని అత్యంత చాకచక్యంతో కాపాడిన మొహసిన్‌ను అందరూ అభినందిస్తున్నారు.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.