ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలదే హవా! 73.8 శాతం మంది బాలికల ఉత్తీర్ణత

Published: Wed, 29 Jun 2022 14:57:18 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలదే హవా! 73.8 శాతం మంది బాలికల ఉత్తీర్ణత

అబ్బాయిల్లో ఉత్తీర్ణత 56.73 శాతమే

ఫస్టియర్‌లో 63.32%, 

సెకండియర్‌లో 67.24% ఉత్తీర్ణత

రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు 

దరఖాస్తు గడువు జూలై 6

ఆగస్టు 1 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు


హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం అధికంగా నమోదైంది. మొత్తం మీద ఫస్టియర్‌, సెకండియర్‌ కలిపి 65.24 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంతో పోలిస్తే... రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం కొంత ఎక్కువగా ఉంది. తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 9,07,787 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 5,91,836 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో 63.32శాతం, సెకండియర్‌లో 67.82 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం మీద బాలికల ఉత్తీర్ణత 73.80 శాతంగా నమోదు కాగా, బాలుర ఉత్తీర్ణత 56.73 శాతంగా నమోదైంది. సంవత్సరాల వారీగా చూస్తే... ఫస్టియర్‌లో బాలికల ఉత్తీర్ణత 72,33 శాతం ఉండగా, బాలుర ఉత్తీర్ణత 54.25 శాతంగా ఉంది. అలాగే సెకండియర్‌కు సంబంధించి... అమ్మాయిల ఉత్తీర్ణత 75.28 శాతం ఉండగా, అబ్బాయిల ఉత్తీర్ణత 59.21 శాతంగా నమోదైంది. ఫస్టియర్‌ పరీక్షలకు మొత్తం 4,64,892 మంది విద్యార్థులు హాజరవగా... అందులో 2,94,378 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే... సెకండియర్‌లో మొత్తం 4,42,895 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా... వారిలో 2,97,458 మంది పాసయ్యారు.  ఇంటర్‌ ఫలితాలను https://tsbie.cgg. gov.in, https://results. cgg.gov.in  వెబ్‌సైట్‌లలో చెక్‌ చేసుకోవచ్చు.


‘ఎ’ గ్రేడ్‌లతో సత్తాచాటిన విద్యార్థులు

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎక్కువమంది విద్యార్థులు ‘ఎ’ గ్రేడ్‌లోనే పాసయ్యారు. ఫస్టియర్‌ పరీక్షలకు 4,64,892 మంది హాజరవగా... 1,93,925 మంది విద్యార్థులు ‘ఎ’ గ్రేడ్‌ సాధించారు. ‘బి’ గ్రేడ్‌లో 63,501 మంది, ‘సి’ గ్రేడ్‌లో 24,747, ‘డి’ గ్రేడ్‌లో 12,205 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక సెకండియర్‌ పరీక్షలకు 4,42,895 మంది హాజరవగా... 1,59,432 మంది విద్యార్థులు ‘ఎ’ గ్రేడ్‌ తెచ్చుకున్నారు. ‘బి’  గ్రేడ్‌లో 82,501, ‘సి’ గ్రేడ్‌లో 35,829, ‘డి’ గ్రేడ్‌లో 18,243 మంది విద్యార్థులు పాసయ్యారని అధికారులు వెల్లడించారు. ఈ సంవత్సరం జరిగిన పరీక్షల్లో మొత్తం 75మంది విద్యార్థులు మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ అధికారులకు దొరికారు. కొన్ని కారణాల రీత్యా 62 మంది విద్యార్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టినట్టు స్పష్టం చేశారు. విద్యార్థులు తమ షార్ట్‌ మెమోలను ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. రీవెరిఫికేషన్‌, స్కాన్‌ చేసిన  కాపీల కోసం ఒక్కో పేపర్‌కు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రీకౌంటింగ్‌ కోసం ఒక్కో పేపర్‌కు రూ.600 ఫీజు చెల్లించాలి. వీటి కోసం ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థుల కోసం ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఆగస్టు చివరినాటికి ఈ పరీక్షల ఫలితాలను వెల్లడించనున్నట్లు ఆమె తెలిపారు. అడ్వాన్స్‌డ్‌   సప్లిమెంటరీ పరీక్షల ఫీజును ఈ నెల 30 నుంచి చెల్లించవచ్చు. అలాగే... ప్రాక్టికల్‌ పరీక్షలను జూలై 26 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు మంత్రి చెప్పారు. కాగా, ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఇంటర్‌లో మంచి ఫలితాలు వచ్చాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఫలితాలను ప్రకటించిన తర్వాత ఆమె మాట్లాడుతూ... విద్యార్థులు సులభంగా పరీక్షలను ఎదుర్కొనేందుకు బేసిక్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ మెటీరియల్‌ నుంచే సుమారు 80శాతం ప్రశ్నలు వచ్చాయని, దాంతో విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారని తెలిపారు. అలాగే... ఇంటర్‌లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆయా విద్యార్థులను గుర్తించి, తగు విధంగా ప్రోత్సహిస్తామన్నారు.


వీణ-వాణిలు పాసయ్యారు...

దంతాలపల్లి, జూన్‌ 28: అవిభక్త కవలలు వీణ-వాణిలు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులయ్యారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. సీఈసీ  గ్రూప్‌లో వాణి 707, వీణ 712 మార్కులను సాధించారు. కరోనా నేపథ్యంలో గతేడాది ఫస్టియర్‌ పరీక్షలు రాయలేదు. ఈసారి ఫస్టియర్‌తోపాటు సెకండియర్‌ పరీక్షలకు కూడా ఏకకాలంలో ప్రిపేరై ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యారు. అనంతరం సీఏ చదవాలని అనుకుంటున్నట్టు తెలిసింది. సఫియా, అనూషల గైడెన్స్‌లో వారిద్దరూ చదువుకున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ స్టేట్‌ హోంకు వెళ్లి వీణావాణీలను అభినందించారు. కవలల ఉన్నత చదువులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. కాగా... జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌.. వీణ-వాణిలను కలిసి అభినందించారు.


సమస్యలుంటే సంప్రదించాల్సిన నంబర్లు

ఫలితాల విషయంలో సందేహాల నివృత్తి, ఫిర్యాదుల కోసం ఇంటర్‌ బోర్డు హెల్ప్‌డెస్క్‌ నంబర్లను ఏర్పాటుచేసింది. విద్యార్థులు 040-24601010 / 24655027 నంబర్లకు కాల్‌ చేయవచ్చు. అలాగే ఒత్తిడి, ఇతరత్రా మానసిక ఇబ్బందులు ఉన్న విద్యార్థుల కోసం సైకాలజిస్టులను అందుబాటులో ఉంచారు.

ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలదే హవా! 73.8 శాతం మంది బాలికల ఉత్తీర్ణత


ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలదే హవా! 73.8 శాతం మంది బాలికల ఉత్తీర్ణతFollow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయం Latest News in Teluguమరిన్ని...

క్రీడాజ్యోతిLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.