‘పది’ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ABN , First Publish Date - 2022-07-01T06:56:21+05:30 IST

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో జిల్లా 93.34 శాతం ఉత్తీర్ణతతో 15వ స్థానంలో నిలిచింది.

‘పది’ ఫలితాల్లో బాలికలదే పైచేయి

- 93.34 శాతం మంది ఉత్తీర్ణత 

- రాష్ట్రంలో జిల్లాకు 15వ స్థానం

- తగ్గిన పాస్‌ పర్సంటేజ్‌  

 కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 30: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో జిల్లా 93.34 శాతం ఉత్తీర్ణతతో 15వ స్థానంలో నిలిచింది. గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదో తరగతి పరీక్షా ఫలితాలను ప్రకటించారు. జిల్లాలో మొత్తం 12,695 మంది విద్యార్థుల పరీక్షలు రాయగా వారిలో 11,849 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 6,778 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 6,209 మంది పాస్‌ అయ్యారు. 5,917 మంది బాలికలు పరీక్షలు రాయగా వారిలో 5,640 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 95.32 శాతం మంది బాలికలు, 91.61 శాతం బాలురు పాస్‌ అయ్యారు. గత రెండేళ్లలో కొవిడ్‌ కారణంగా పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులందరిని పాస్‌ చేయడంతో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 2018-19 విద్యాసంవత్సరంలో 98.38 శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకుని రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే ఈ ఫలితాల్లో బాలురకంటే బాలికలదే పైచేయిగా నిలిచింది. 

మోడల్‌ స్కూల్‌, కేజీబీవీ, సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల్లో అద్భుత ఫలితాలు 

పదో తరగతి ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలతోపాటు మోడల్‌, కేజీబీవీ, సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభతో ప్రభంజనం సృష్టించారు. జిల్లాలో 11 మోడల్‌ స్కూల్స్‌ ఉండగా గంగాధర, ఎలగందల్‌, సైదాపూర్‌, శంకరపట్నం, వీణవంక పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోని 11 కేజీబీవీ పాఠశాలలకుగాను ఇల్లందకుంట, సైదాపూర్‌, వీణవంక పాఠశాలల్లో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 98.21 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఎస్సీ గురుకులాల్లో 2,014 విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1978 మంది ఉత్తీర్ణత సాధించారు. 42 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించడం గమనార్హం. గంగాధర మోడల్‌ స్కూల్‌లో 20 మంది 10 జీపీఏ సాధించారు. 

తగ్గిన ఉత్తీర్ణత శాతం: 

జిల్లాలో ఈయేడాది ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడం నిరాశను కలిగించింది. 2017 విద్యాసంవత్సరంలో 93.73 శాతం ఉత్తీర్ణతతో, 2018లో 94.03శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో, 2019లో 98.38శాతం ఉత్తీర్ణతతో మూడవ స్థానంలో నిలిచింది. 2020, 2021 రెండు విద్యాసంవత్సరాలు కరోనాతో పరీక్షలు నిర్వహించకుండా అందరిని పాస్‌ చేయడంతో 100శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ యేడాది 93.34శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో 15వ స్థానంలో నిలిచింది. 


Updated Date - 2022-07-01T06:56:21+05:30 IST