బాలికలదే పైచేయి

ABN , First Publish Date - 2022-06-29T05:51:09+05:30 IST

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే టాప్‌గా నిలిచారు. సంగారెడ్డి జిల్లాలో గతం కంటే ఫలితాలు మెరుగుపడ్డాయి.

బాలికలదే పైచేయి

ఇంటర్‌ ఫలితాల్లో ఫస్టియర్‌లో సంగారెడ్డి జిల్లాకు 

12వ స్థానం, సెకండ్‌ ఇయర్‌లో 21వ స్థానం

అట్టడుగున నిలిచిన మెదక్‌ జిల్లా 

కేజీబీవీ విద్యార్థినికి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌


 సంగారెడ్డిఅర్బన్‌/మెదక్‌అర్బన్‌,జూన్‌28: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే టాప్‌గా నిలిచారు. సంగారెడ్డి జిల్లాలో గతం కంటే ఫలితాలు మెరుగుపడ్డాయి. మెదక్‌ మాత్రం ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో అట్టడుగున నిలిచింది.

 సంగారెడ్డి జిల్లా ఫస్టియర్‌లో 12వ స్థానం, సెకండియర్‌ 21వ స్థానంలో నిలిచింది. గతంలో కంటే ఈ సారి ఫలితాలు మెరుగయ్యాయి. ఫస్టియర్‌లో 15,777మంది పరీక్షలు రాయగా 9,239 మంది విద్యార్థులు పాసయ్యారు. 58 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండియర్‌లో 14,251 మంది పరీక్షలు రాయగా, 9,251 మంది ఉత్తీర్ణలు కాగా, 64 శాతం మేర ఉత్తీర్ణత సాధించారు. 


ఒకేషనల్‌లోనూ..

ఇక ఒకేషన్‌ ఫలితాల్లో గతేడాదితో పోల్చితే ఈ సారి జిల్లా ర్యాంకు మెరుగుపడింది. ఫస్టియర్‌లో 1416 మంది పరీక్షలు రాయగా 849 మంది పాసై 59 శాతం మేర ఉత్తీర్ణత సాధించారు. ఇందులో జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 1211 మంది పరీక్షలు రాయగా 808 మంది పాసై 66 శాతం మేర ఉత్తీర్ణత సాధించి జిల్లా తొమ్మిదవ స్థానం సాధించింది. ఒకేషనల్‌ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. 


చివరిస్థానంలో మెదక్‌ జిల్లా

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో మెదక్‌ జిల్లా అట్టడుగున నిలిచింది. ఇంటర్‌ ప్రథ మ, ద్వితీయ సంవత్సర ఫలితాలకు సంబంధించి రాష్ట్రంలోనే జిల్లా చిట్టచివరి స్ధానంలో నిలిచింది. జిల్లా ఫస్టియర్‌ 40 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 47 శాతం ఉత్తీర్ణత సాధించారు. బా లుర కంటే బాలికలే మెరుగైన ఫలితాలు సాఽధించారు. 


ప్రథమ సంవత్సరంలో

ఇంటర్‌ ఫస్టియర్‌ జనరల్‌ విభాగంలో మొత్తం 6,621 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,683 మంది(40శాతం), ఉత్తీర్ణత సాధించారు. 3,554 మంది బాలికల్లో 1796 మంది(50శాతం), 3,067 మంది బాలురలో 887 మంది(28శాతం) ఉత్తీర్ణులయ్యారు.


ఒకేషనల్‌ విభాగంలో

ఇంటర్‌ ఒకేషనల్‌ విభాగంలో మొత్తం 641 మంది పరీక్షలు రాయగా... 311 మంది(48శాతం) ఉత్తీర్ణత  సాధించారు. ఇందులో 376 మంది బాలురకు 115 మంది(30శాతం), పాస్‌ అయ్యారు. 265 మంది బాలికలకు 196 మంది(73శాతం) ఉత్తీర్ణులయ్యారు.


ద్వితీయ సంవత్సరంలో

ఇంటర్‌ ద్వితీయ సంవత్సర జనరల్‌ విభాగంలో మొత్తం 5,906 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకాగా.. 2,823 మంది(47శాతం) ఉత్తీర్ణత సాధించారు. 3,109 మంది బాలికల్లో 1797 మంది(57శాతం), 2,797 మంది బాలురలో 1,026 మంది(36శాతం) ఉత్తీర్ణులయ్యారు.


ఒకేషనల్‌ విభాగంలో

సెకండ్‌ ఇయర్‌ ఒకేషనల్‌ విభాగంలో మొత్తం 484 మంది పరీక్షలు రాయగా 276 మంది(56శాతం) ఉత్తీర్ణత  సాధించారు. ఇందులో 300 మంది బాలురకు 128 మంది (42శాతం), పాస్‌ అయ్యారు. 184 మంది బాలికలకు 146 మంది(79శాతం) ఉత్తీర్ణులయ్యారు.

ఉత్తీర్ణత శాతం ఇలా

మూడేళ్ల ఇంటర్‌ ఫలితాలను పరిశీలిస్తే మెదక్‌ జిల్లా ప్రదర్శన ప్రతి ఏడాది దిగజారుతోంది. ఈ ఫలితాల్లో కూడా చివరిస్ధానంలో నిలిచింది. 2019-20 విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో 7,700 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా... 2,753 మంది(36శాతం) ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రస్ధాయిలో 33 స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో 6,040 మంది పరీక్షలు రాయగా... 2,818(47శాతం) మంది ఉత్తీర్ణత సాఽధించి, రాష్ట్రస్థాయిలో చివరిస్థానంలో నిలిచింది. 2020-21 విద్యా సంవత్సరంలో కరోనా కారణంగా నిర్వహించిన ఫస్టయర్‌ పరీక్షలకు మొత్తం 6,626 మంది హాజరుకాగా 1,325 మంది విద్యార్థులు(20 శాతం) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది నిర్వహించిన ప్రథమ సంవత్సర పరీక్షలకు 6,621 మంది విద్యార్థులు హాజరుకాగా.. 2,683 మంది (40శాతం), ద్వితీయ సంవత్సరంలో 5,906 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 2823 మంది(47శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కాస్త ఉత్తీర్ణత శాతం పెరిగిన మెదక్‌ జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగున నిలిచింది. 


కేజీబీవీలో సిర్గాపూర్‌ విద్యార్థిని సంజనకు స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

కల్హేర్‌, జూన్‌ 28: సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన సిర్గాపూర్‌లోని కేజీబీవీ జూనియర్‌ కళాశాలకు చెందిన సీహెచ్‌.సంజన ఇంటర్‌ ఫస్ట్‌ఇయర్‌లో బైపీసీలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకును సాధించింది. 440 మార్కులకు 435 మార్కులు సాధించి కేజీబీవీ కళాశాల స్థాయిలో మొదటిర్యాంకు సాధించినట్లు సిర్గాపూర్‌ కేజీబీవీ ఎస్‌వో లలిత తెలిపారు. కాగా సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండల పరిధిలోని కారముంగి గ్రామానికి చెందిన సంజన పదో తరగతి వరకు కన్నడ మీడియంలో విద్యనభ్యసించింది. 

Updated Date - 2022-06-29T05:51:09+05:30 IST