వైభవంగా మూలస్థాన ఎల్లమ్మ కొండచుట్టు

ABN , First Publish Date - 2021-01-17T04:31:51+05:30 IST

చంద్రగిరిలో శనివారం రాత్రి మూలస్థాన ఎల్లమ్మ కొండచుట్టు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

వైభవంగా మూలస్థాన ఎల్లమ్మ కొండచుట్టు
అశ్వవాహనంపై ఎల్లమ్మ

చంద్రగిరి, జనవరి 16: చంద్రగిరిలో శనివారం రాత్రి మూలస్థాన ఎల్లమ్మ కొండచుట్టు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారి మూలవిరాట్‌కి అభిషేకం చేసి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఉత్సవమూర్తిని ఆలయ ముఖ మండపానికి తీసుకొచ్చి అశ్వవాహనంపై అధిష్ఠింపజేశారు. అనంతరం మేళతాళాల నడుమ చంద్రగిరిలో ఊరేగించారు. రాత్రి.. అగరాల, కుప్పిరెడ్డిగారిపల్లె, పుల్లయ్యగారిపల్లె, పాండురంగయ్యగారిపల్లె, ఐతేపల్లె, కొటాల, నాగయ్యగారిపల్లె, రెడ్డివారిపల్లె మీదుగా ఆదివారం ఉదయానికి తిరిగి ఆలయానికి అమ్మవారు చేరుకునేలా ఊరేగింపు మొదలుపెట్టారు. ధర్మరాజుల ఆలయం నుంచి రాత్రి 8.30 గంటలకు జాతీయ రహదారిపైకి ఊరేగింపు బయల్దేరింది. ఈ సమయంలో ఉభయదారులుగా వ్యవహరించిన టీడీపీ సానుభూతిపరులు కొందరు వాహనం మోస్తున్నారు. దీన్ని గమనించిన వైసీపీ కార్యకర్తలు నరేంద్ర, కుమారరాజా, మరికొందరు కలిసి.. వాహనాన్ని మీరెలా మోస్తారంటూ దాడికి దిగారు. దీనివల్ల ఊరేగింపు కొంతసేపు ఆగింది. ఈ దాడిపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కాగా.. టీటీడీ తరఫున చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి దంపతులు, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతలు పట్టు వస్ర్తాలను అమ్మవారికి సమర్పించారు. అలాగే  చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పులివర్తి నాని కూడా స్థానిక టీడీపీ నాయకులతో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్‌ ఒంటి శివశంకర్‌రెడ్డి, ఈవో రామకృష్ణారెడ్డి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-01-17T04:31:51+05:30 IST