దళిత రైతులకు చేయూతే లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-26T06:54:00+05:30 IST

దళిత సామాజిక వర్గానికి చెందిన రైతులకు 2020-21 కార్యాచరణ ప్రణాళిక కింద పాడి గేదె ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్‌ (ఎస్సీ కార్పొరేషన్‌) ద్వారా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి సబ్సిడీ కింద గేదెలు ఇవ్వనున్నారు. అందుకు తొలుత ఎస్సీ రిజర్వ్డ్‌ అసెంబ్లీ నియోజకవర్గాలను ఎంపిక చేశారు.

దళిత రైతులకు చేయూతే లక్ష్యం

నకిరేకల్‌, తుంగతుర్తి నియోజకవర్గాలు ఎంపిక

రూ.4.20కోట్లతో 210 యూనిట్లు

70 శాతం సబ్సిడీ


నార్కట్‌పల్లి: దళిత సామాజిక వర్గానికి చెందిన రైతులకు 2020-21 కార్యాచరణ ప్రణాళిక కింద పాడి గేదె ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్‌ (ఎస్సీ కార్పొరేషన్‌) ద్వారా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి సబ్సిడీ కింద గేదెలు  ఇవ్వనున్నారు. అందుకు తొలుత ఎస్సీ రిజర్వ్డ్‌ అసెంబ్లీ నియోజకవర్గాలను ఎంపిక చేశారు. 


పాడి గేదెల పథకానికి ఉమ్మడి జిల్లాలో ఆరు మండలాలను ఎంపిక చేశారు. నల్లగొండ జిల్లాలో నకిరేకల్‌ నియోజకవర్గంలో రామన్నపేట మినహా అన్ని మండలాలు, తుంగతుర్తి నియోజవర్గంలోని శాలిగౌరారం మండలాల్లో మిల్క్‌ రూట్లు, మిల్క్‌ కలెక్షన్‌ సెంటర్లు ఉన్న పంచాయతీల్లో అర్హులను ఎంపిక చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక అనంతరం డెయిరీ యూనిట్‌ (పాడి పశువులు 1+1)ను మంజూరు చేస్తారు. యూనిట్‌కు రూ.2లక్షల వ్యయం అవుతుండగా, ఈ మొత్తంలో 70శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది. మితగా 30శాతం బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యాన్ని కల్పిస్తారు.


210 యూనిట్లు

నకిరేకల్‌, తుంగతుర్తి రెండు నియోజకవర్గాల్లో కలిపి ఆరు మండలాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జనాభా 58,956 వరకు ఉంది. జనాభా ప్రాతిపదికన నకిరేకల్‌ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు మొత్తం 168యూనిట్లు, శాలిగౌరారం మండలానికి 42 కలిపి మొ త్తం 210 యూనిట్లు కేటాయించారు. చిట్యాల మండలానికి 25యూనిట్లు, కట్టంగూర్‌కు 39, కేతేపల్లికి 37, నకిరేకల్‌కు 26, నార్కట్‌పల్లి మండలానికి 41, శాలిగౌరారం మండలానికి 42యూనిట్లు మంజూరు చేశారు. మొత్తం యూనిట్‌ వ్యయం రూ.4.20కోట్లు అవుతుండగా, 70శాతం సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.2.94కోట్లు ఇవ్వనుండగా, రూ.1.26కోట్లు బ్యాంకుల ద్వారా రుణంగా ఇస్తారు.


దరఖాస్తుకు ఆగస్టు 3 చివరి తేదీ

ఈ పథకం కింద లబ్ధిపొందేందుకు అర్హులైన దళిత రైతులు ఈనెల 28నుంచి ఆగస్టు 3 వరకు వారి పరిధిలో ని మండల పరిషత్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను పరిశీలించి ఆగస్టు 4న ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికైన లబ్ధిదారుల జాబితాను ఆగస్టు 8 నాటికి ఎస్పీ కార్పొరేషన్‌ కా ర్యాలయానికి పంపుతారు. లబ్దిదారుల ఎం పికకు కలెక్టర్‌ మార్గదర్శకాలు విడుదల చేశారు. మంజూర య్యే మొత్తం యూనిట్లలో 33.3శాతం మహిళలు, 5శాతం వికలాంగులకు కేటాయించారు. ఒంటరి మహిళలు, వితం తు, వెట్టిచాకిరీ కార్మికులు, కరోనా వైర్‌సతో ఇంటి యజమాని మృతిచెందిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. దరఖాస్తుదారులు 21-50ఏళ్ల లోపు వారై ఉండాలి. దరఖాస్తుకు కచ్చితంగా కుల ధ్రువీకరణ పత్రం జతపర్చడంతోపాటు, గతంలో ఎస్సీ కా ర్పొరేషన్‌ద్వారా రుణాలు పొందని వారు మాత్రమే అర్హులు.


గ్రామాల ఎంపిక

జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ ఆమోదం, నార్ముల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, పశుసంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 57 గ్రామాలను ఈ పథకం కింద గుర్తించారు. దీని ప్రకారం చిట్యాల మండలంలో 9 గ్రామాలు, నార్కట్‌పల్లి మండలంలో 10, కట్టంగూర్‌ మండలంలో 11, నకిరేకల్‌ మండల పరిధిలో 11, కేతేపల్లి మండలంలో 5 గ్రామాలున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని శాలిగౌరారం మండలంలో 11 గ్రామాల్లో దళిత రైతులకు పాడి గేదెల పథకాన్ని అమలుచేయనున్నారు.


దళితుల జీవన ప్రమాణాలు పెంచేందుకు గేదెల పథకం : మర్రి వెంకటేశం, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ

దళితుల్లో జీవన ప్రమాణాల పెంపుకోసం పాడిగేదెల పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దళితులు కేవలం పాడి కూలీలుగానే మిగలకుండా పాడి రైతులుగా ఎదగాలన్నదే  లక్ష్యం. నకిరేకల్‌, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని ఆరు మండలాలను ఎంపిక చేసి మొత్తం 210డెయిరీ యూనిట్లను కేటాయించారు. దరఖాస్తుదారులకు కాల్‌ లెటర్‌ పంపించి ఇంటర్వ్యూ నిర్వహిస్తాం. ఎంపిక ప్రక్రి య పూర్తి పారదర్శకతతో నిర్వహించి అర్హులైనవారిని లబ్ధిదారులుగా గుర్తిస్తాం. ఎంపికైన వారికి నేరు గా వారి బ్యాంకు అకౌంట్లలో సబ్సిడీ మొత్తం జమచేస్తాం.


Updated Date - 2021-07-26T06:54:00+05:30 IST