ఆర్బీకేల బలోపేతమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-27T07:44:37+05:30 IST

వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, వాటి బలోపేతానికి చేపడుతున్న కీలక ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలోగా పూర్తి కావాలని, పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం

ఆర్బీకేల బలోపేతమే లక్ష్యం

మహిళలకు ఆవులు, గేదెలు

సెప్టెంబరులో ‘ఆసరా’ నిధులు విడుదల

‘అగ్రి ఇన్‌ఫ్రా’పై సమీక్షలో సీఎం జగన్‌ 


అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, వాటి బలోపేతానికి చేపడుతున్న కీలక ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలోగా పూర్తి కావాలని, పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం జగన్‌ నిర్దేశించారు. సోమవారం తాడేపల్లిక్యాంప్‌ కార్యాలయంలో వ్యవసాయ, అనుబంధశాఖల్లో అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌తో చేపట్టే ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాల బలోపేతానికి కృషి చేయాలన్నారు. ‘‘మల్టీపర్పస్‌ ఫెసిలిటీ, కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు, ఫుడ్‌ ప్రొసెసింగ్‌ యూనిట్లు, ఫిషింగ్‌ హార్బర్లు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు, ఇతర మౌలిక సదుపాయాలన్నింటికీ రూ. 16,236 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఆర్బీకేల వద్ద 15రకాల మౌలిక సదుపాయాలు, మార్కెట్‌ యార్డుల్లో నాడు-నేడు కింద పనులకు రూ.2,930 కోట్లు వ్యయమవుతాయని అంచనా వేశాం. ఆర్బీకేల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు, నియోజకవర్గస్థాయిలో హైటెక్‌ హైవాల్యూ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. తొలిదశలో 3,250 సీహెచ్‌సీలు ఏర్పాటు చేయగా, రెండోదశలో మరో 3,250 సీహెచ్‌సీలు సెప్టెంబరులోగా, మూడో దశ డిసెంబరు నాటికి పూర్తి కావాలి. వ్యవసాయ పరికరాలు సీహెచ్‌సీల్లో రైతులకు అందుబాటులో ఉంటే, కూలీల కొరత తగ్గుతుంది. పరికరాల వినియోగంపై రైతుల్లో నైపుణ్యం పెంచాలి. దీనికిగాను ఐటీఐ, పాలిటెక్నిక్‌ విద్యలో వ్యవసాయ యాంత్రీకరణ కోర్సులను ప్రవేశపెట్టాలి. అద్దె యంత్రాలు ఎంతకు లభ్యమవుతాయో ఆర్బీకేల్లో బోర్డులుపెట్టాలి. సీహెచ్‌సీల విషయంలో రైతు సలహా మండళ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. పాల ఉత్పత్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో సీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలి. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఒకటి ఉండేలా రాష్ట్రంలో 33చోట్ల ‘సీడ్‌ కం మిల్లెట్‌’ ప్రొసెసింగ్‌ యూనిట్లు పెట్టాలి. ‘జగనన్న పాల వెల్లువ’లో భాగంగా రూ.4,190 కోట్లతో ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్లు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. చేయూత కింద డబ్బులిచ్చాం. సెప్టెంబరులో ‘ఆసరా’ ఇవ్వబోతున్నాం. ఈ డబ్బుతో కోరుకున్న మహిళలకు ఆవులు, గేదెలు ఇవ్వాలి’’ అని సీఎం ఆదేశించారు. 


ఆక్వా రంగానికి 3,997 కోట్లు

సముద్ర తీర ప్రాంతంలో భారీగా ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ల్యాండ్‌ సెంటర్లు, ఆక్వాహబ్‌లు, చేపలు, రొయ్యల ప్రొసెసింగ్‌ యూనిట్లకు రూ.3,997 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం జగన్‌ చెప్పారు. ఆక్వాలో 10 ప్రొసెసింగ్‌ యూనిట్లు, 23ప్రీ ప్రొసెసింగ్‌ యూనిట్లు, 100 ఆక్వా హబ్‌లు 2022సెప్టెంబరు నాటికి ప్రారంభం కావాలన్నారు. ఎనిమిది ఫిషింగ్‌ హార్బర్లలో 4 చోట్ల పనులు జరుగుతుండగా, మిగిలినవి కూడా పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఫుడ్‌ ప్రొసెసింగ్‌ విధానాన్ని బలోపేతం చేయడం ద్వారా రైతులకు అండగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో దేశీయ ఆవుల ఫారాలు, ఆర్గానిక్‌ డెయిరీలు ఏర్పాటు చేయాలని, రూ.22.25 కోట్లతో ఆర్బీకేల్లో వెటర్నరీ కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల పనులను సెప్టెంబరు నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. 

Updated Date - 2021-07-27T07:44:37+05:30 IST