వృత్తి ఏదైనా ఆదాయం పెంచటమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-07-05T08:14:58+05:30 IST

వ్యాపారం, వ్యవసాయం, ఆర్థిక వ్యవహారాలు.. వృత్తి ఏదైనా రెట్టింపు ఆదాయం కల్పించాలన్నదే ఎఫ్‌-ఫ్రీడమ్‌ ఆశయమని సంస్థ ఫౌండర్‌, సీఈఓ సీఎస్‌ సుధీర్‌ వెల్లడించారు.

వృత్తి ఏదైనా ఆదాయం పెంచటమే లక్ష్యం

ఎఫ్‌-ఫ్రీడమ్‌ ఆశయమిదే

సంస్థ ఫౌండర్‌ సుధీర్‌ వెల్లడి 

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): వ్యాపారం, వ్యవసాయం, ఆర్థిక వ్యవహారాలు.. వృత్తి ఏదైనా రెట్టింపు ఆదాయం కల్పించాలన్నదే ఎఫ్‌-ఫ్రీడమ్‌ ఆశయమని సంస్థ ఫౌండర్‌, సీఈఓ సీఎస్‌ సుధీర్‌ వెల్లడించారు. ఫైనాన్స్‌ ఫ్రీడమ్‌ ద్వారా అన్ని వర్గాల ఆదాయాన్ని పెంచే దిశగా యాప్‌ ద్వారా అనుసంధానం చేస్తున్నామన్నారు. బెంగళూరు కేంద్రంగా  కార్యకలాపాలు సాగిస్తున్న ఫ్రీడమ్‌ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు సేవలందిస్తోందన్నారు. అంతేకాకుండా 820 కోర్సుల ద్వారా 76 లక్షల మంది వినియోగదారులకు ఫ్రీడమ్‌ చేరువైందని అన్నారు. రానున్న కొద్ది నెలల్లో కోటి మంది వినియోగదారులకు చేరువ కావాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సుధీర్‌ తెలిపారు. ఫ్రీడమ్‌ యాప్‌ సేవల గురించి సోమవారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.


ఇండియన్‌ మనీ డాట్‌కామ్‌తో ప్రారంభం: కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా తీర్థహళ్లికి చెందిన సుధీర్‌..  ఇన్సూరెన్స్‌ కంపెనీలో కొంతకాలం పనిచేసిన తర్వాత సొంతంగా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ప్రజలకు ఆర్థికపరమైన అంశాలపై అవగాహన కల్పించటంతో పాటు సలహాలు ఇచ్చేందుకు గాను 2008లో ఇండియన్‌ మనీ డాట్‌కామ్‌ సంస్థను ప్రారంభించినట్లు సుధీర్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ సంస్థ ద్వారా 9 భాషల్లో పది లక్షల మందికి పైగా వినియోగదారులకు ఆర్థిక సలహా సేవలను అందించినట్లు చెప్పారు. అయితే కేవలం ఆర్థిక సలహాలకు మాత్రమే పరిమితం కాకుండా జీవనోపాధి మార్గాల పెంపు, ఆర్థిక అంశాలపై మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఓ యాప్‌ను రూపొందించాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే 2020 మార్చి 20న ఫ్రీడమ్‌ యాప్‌ను లాంఛనంగా ప్రారంభించినట్లు సుధీర్‌ తెలిపారు. ప్రస్తుతం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సంస్థకు పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్నారన్నారు. ప్రతి వ్యాపారానికి ప్రస్తుత సామాజిక పరిస్థితులు, సాంకేతికతతో పాటు మార్కెటింగ్‌ను పరిచయం చేయడమే తమ యాప్‌ ఉద్దేశమన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, చిన్న వ్యాపారాలు, షేర్‌ మార్కెట్‌తో పాటు ఇలా అన్ని విభాగాల్లోనూ 820 కోర్సులు ఫ్రీడమ్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతానికి నెలకు అదనంగా 50 కొత్త కోర్సులు చేరుస్తున్నామన్నారు.


కొవిడ్‌ కాలంలో అపార ఆదరణ: కొవిడ్‌ సమయంలో ఫ్రీడమ్‌కు అద్భుతమైన ఆదరణ లభించిందని సుధీర్‌ అన్నారు. కొవిడ్‌ కారణంగా ఇంటి పట్టునే ఉంటూ ఆదాయం పెంచుకోవాలనుకున్న వారు నిత్యం వేలాది మంది ఫ్రీడమ్‌ సలహాలు పొందారన్నారు. ఇప్పటివరకు 76 లక్షల మంది ఫ్రీడమ్‌ కోర్సుల పట్ల అవగాహన పొందారన్నారు. ఎటువంటి అంశంపైన అయినా ప్రాంతీయ భాషల్లో వారం రోజుల పాటు జూమ్‌ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. ప్రస్తుతానికి 1.80 లక్షల మంది ఫ్రీడమ్‌ సబ్‌స్ర్కైబర్లుగా ఉన్నారని తెలిపారు. మూడు నెలల సబ్‌స్ర్కిప్షన్‌కు రూ.5,000, ఏడాదికి రూ.10,000 ఫీజు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఏడాది పాటు సబ్‌స్ర్కిప్షన్‌ తీసుకుంటే అన్ని కోర్సుల్లోనూ శిక్షణ పొందవచ్చన్నారు.  

Updated Date - 2022-07-05T08:14:58+05:30 IST