యజ్ఞాల లక్ష్యం... భగవదనుగ్రహమే!

Published: Fri, 17 Dec 2021 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
యజ్ఞాల లక్ష్యం... భగవదనుగ్రహమే!

‘బ్రహ్మ’ అనే శబ్దం ఆధ్యాత్మికమని, భగవంతుడు ఆధ్యాత్మకుడని పెద్దల మాట. భగవంతునిపై స్థిరమైన భక్తికలవాడు అశాశ్వతమైన భౌతిక ప్రయోజనాలనే కాలుష్యాలకు ఆకర్షితుడు కాడు. పరమాత్మ స్థితిని తెలుసుకొన్నవాడు కావడం వల్ల.. తాను చేసే కర్మల ప్రయోజనాలన్నీ పరమాత్మకే సమర్పిస్తాడు. అవన్నీ యజ ్ఞకార్యాలుగా పరిగణన పొంది, దివ్యత్వంలో లీనమౌతాయి. పాపభూయిష్టమైన కర్మల దుష్ఫలితంగా భౌతిక జీవితం ఏర్పడుతుంది. పాపమనే పంకిలానికి వశం కావడానికి అజ్ఞానమే కారణం. అయితే, యజ్ఞ విధానాలు వ్యక్తిలో ఆధ్యాత్మిక వికాసాన్ని కలుగజేస్తాయి. అజ్ఞానాన్ని తొలగిస్తాయి. నిరాకార బ్రహ్మంలో లీనం చేస్తాయి. అటువంటి యజ్ఞ విధులను శ్రీ కృష్ణుడు వివరించాడు. 


దైవ సంబంధమైన పూజాది కార్యాలు చిత్తశుద్ధితో నిర్వహించడం... ‘దైవరూప యజ్ఞం’. ఆ యజ్ఞానికి ఎంత ధనం వెచ్చించామన్నది ముఖ్యం కాదు. ఎంత నిష్ఠతో చేశామనేదే ముఖ్యం. ఫలమో, పత్రమో, పుష్పమో, తోయమో.. భక్తిప్రధానంగా సమర్పించాలి. అప్పుడు సర్వేశ్వరుని కరుణ తప్పకుండా ఉంటుంది. ఉదాహరణకు.. కుచేలుడు సభక్తితో సమర్పించిన అటుకులను ప్రేమతో భుజించిన శ్రీకృష్ణుడు... అతని దారిద్ర్యాన్ని రూపుమాపాడు. గోపికలు కూడా పరాభక్తితో పరమాత్మను చేరుకున్నారు. 


ఇక.. ఆత్మవిచారణతో చేసే యజ్ఞం... ‘ఆత్మరూప యజ్ఞం’. జ్ఞానయోగి అశాశ్వతమైన దేహాన్ని విశ్వసించడు. శాశ్వతమైన ఆత్మానందం కోసం మనసును నిర్మలం చేసుకొని, ఆత్మనిష్ఠుడై ఫలితాన్ని సాధిస్తాడు. మరో జన్మలేని మహత్తరమైన స్థితిని కరతలామలకం చేసుకుంటాడు. తనను ఆశ్రయించిన వారికి ఆత్మజ్ఞాన భిక్ష పెట్టగలుగుతాడు. ఆధ్యాత్మికాచార్యుని ఉపదేశంతో విద్యార్థులు ఇంద్రియతృప్తుల నుంచి విముక్తులవుతారు. మనస్సును నిగ్రహిస్తారు. ఆస్తిక సంబంధమైన అంశాలు అర్థం చేసుకోవడానికి శ్రవణం... వినడం మూలం. అలాగే కీర్తించడం ద్వారా కూడా దివ్యమైన ధ్వని ప్రకంపనాలు మానసిక నిర్మలత్వానికి దోహదపడతాయి. ఈ ప్రక్రియనే ‘శ్రోత్రాది యజ్ఞం’ అంటారు. ఈ విధానం గృహస్థులకు, వానప్రస్థులకు, సన్యాసులకు వర్తిస్తుంది. కొందరు తమకు ఉన్నదాన్ని దానధర్మాల రూపంలో ఇతరులకు ఇస్తారు. ధర్మశాలలు, అన్నదాన కేంద్రాలు, అనాథశరణాలయాలు, విద్యాపీఠాలు, సత్సంగ సాధనా కార్యాలు, వైద్యశాలలు, వృద్ధుల రక్షణాలయాలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి ధర్మకార్యాలను ‘ద్రవ్య రూప యజ్ఞాలు’ అంటారు.


నియమ నిష్ఠలకు ప్రాధాన్యతనిచ్చేవారు చాతుర్మాస్యవ్రతం వంటి వ్రతాలు ఆచరిస్తూ పరమాత్మకు చేరువవుతారు. వీటిని ‘తపోరూప యజ్ఞాలు’గా వ్యవహరిస్తారు. యోగానికి ప్రాధాన్యతనిచ్చే యజ్ఞాలను ‘యోగరూప యజ్ఞాలు’ అంటారు. ఈ యజ్ఞం చేసేవారు హఠయోగం, అష్ఠాంగయోగం వంటివి చేపట్టి కార్యసాఫల్యాన్ని సాధిస్తారు. యోగరూప యజ్ఞాలు మానసిక పరిపక్వతకు దోహదపడతాయి అలాగే, వేద వేదాంత సూత్రాల్లో నిమగ్నులై, వాటి అంతరార్థాలను అవగతం చేసుకొని, వాటికి అనుగుణంగా వర్తించడాన్ని ‘స్వాధ్యాయ రూప యజ్ఞం’గా చెబుతారు. ప్రాణాయామ సంబంధ సాధనలను ‘ప్రాణయామ రూప యజ్ఞం’ అని అంటారు. ఇలా ఎవరు ఏ యజ్ఞం చేసినా.. వాటన్నింటి ధ్యేయం, అందరి లక్ష్యం ఒక్కటే.. ఆ పరమాత్మ అనుగ్రహం పొందడమే!


 విద్వాన్‌ వల్లూరు చిన్నయ్య


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.