కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-05-09T05:25:37+05:30 IST

కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతులెత్తేశారని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు.

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం
టీడీపీ కార్యాలయ ప్రాంగణంలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు

  1. సలహా ఇస్తే.. కేసులు పెడతారా..?   
  2. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకుల నిరసన

    కర్నూలు(అగ్రికల్చర్‌)/కల్లూరు, మే 8:
    కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతులెత్తేశారని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనకున్న అనుభవంతో సూచనలు ఇస్తే అక్రమ కేసులు బనాయిస్తారా? అని మండిపడ్డారు. ప్రభుత్వం తీరుపై టీడీపీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. జిల్లా పార్టీ కార్యాలయంలో కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, మాధవీనగర్‌లోని తమ స్వగృహంలో నంద్యాల లోక్‌సభ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ప్లకార్డులను ప్రదర్శించారు.
     

సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా బాధితులకు కనీసం వైద్యం కూడా అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ఆసుపత్రుల్లో కరోనా వైద్యానికి అవసరమైన సదుపాయాలు లేవని, ఆక్సిజన్‌ లేక ప్రజలు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో బాధితులను దోచుకుంటున్నా ప్రభుత్వం మిన్నకుండి పోతోందని ఆరోపించారు. తమ నాయకుడిపై అక్రమ కేసులు బనాయిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నంద్యాల నాగేంద్రకుమార్‌, హనుమంతరావు చౌదరి, సత్రం రామక్రిష్ణుడు, అబ్బాస్‌, కొరకంచి రవికుమార్‌, నారాయణ రెడ్డి, పాల్‌రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 

నంద్యాల లోక్‌సభ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పూనుకోవడం దారుణమన్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన చంద్రబాబుపై కేసు నమోదు దుర్మార్గమన్నారు. కరోనా దాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని, ఈ విషయాన్ని సాక్షాత్తు వైసీపీ ఎంపీలే రాజమండ్రిలో బహిర్గతం చేశారని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్ధత వల్లే ప్రజలు కరోనా బారిన పడి విలవిల్లాడుతున్నారన్నారు. బాధితులకు సరైన వైద్యం అందడం లేదని, ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్‌ అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.



Updated Date - 2021-05-09T05:25:37+05:30 IST