ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-03-02T06:29:24+05:30 IST

నిత్యావసర వస్తువులు, గృహ నిర్మాణ సామగ్రి, పెట్రోల్‌, డీజిల్‌ ధరల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సిహెచ్‌.అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం
మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు

 జగన్‌ పాలనలో విచ్చలవిడిగా దోపిడీ 

 చౌకదు కాణాల్లో ధరలూ పెంచేశారు 

 మునిసిపల్‌ ఎన్నికల్లో బుద్ధి చెప్పండి

మాజీ మంత్రి అయ్యన్న 

నర్సీపట్నం, మార్చి 1 : నిత్యావసర వస్తువులు, గృహ నిర్మాణ సామగ్రి, పెట్రోల్‌, డీజిల్‌ ధరల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సిహెచ్‌.అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. సోమవారం ఆయన స్థానిక విలేఖరులకు వీడియో సందే శాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా దోపిడీ పెరిగిపోయిందని విమర్శించారు. చేతకాని ప్రభుత్వం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వాలు పేదవారికి నిత్యావసర ఽసరుకులు రాయితీపై ఇవ్వాలని భావించి రేషన్‌ డిపోలు పెడితే.. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చౌకదుకాణాల్లో ధరలు కూడా పెంచేసిందని ఎద్దేవా చేశారు. వంట నూనె డబ్బా గతంలో రూ.1250 ఉంటే, ఇప్పుడు రూ.2400కు పెరిగిందన్నారు. గ్యాస్‌, డీజీల్‌ పెట్రోల్‌ ధరలు పెరిగిపోయాయన్నారు. సిమెంటు, స్టీల్‌, ఇసుక ధరలు పెరిగిపోవడంతో నిర్మాణ రంగం కుదేలైపోయిందని, కూలీలకు పనులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని పేర్కొన్నారు.  ఆర్టీసీ చార్జీలు నాలుగైదు సార్లు పెంచేశారని విమర్శించారు. రాష్ట్రంలో మిగులు కరెంటు ఉన్నా విద్యుత్‌ చార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చిందని ప్రశ్నించారు. రూ.80 విస్కీ సీసాను రూ.200కు పెంచేసి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రతి పేదవాడికి రూ.5కు అన్నం పెట్టాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబునాయుడు అన్నక్యాంటీన్‌లు ప్రారంభిస్తే ఎందుకు తీసేశారని నిలదీశారు. ధరల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ప్రజలు ఆలోచన చేసి వచ్చే మునిసిపల్‌ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అయ్యన్న పిలుపునిచ్చారు.

Updated Date - 2021-03-02T06:29:24+05:30 IST