మాన్సాస్‌పై పట్టు సాధించడం కోసం.. ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్!

ABN , First Publish Date - 2021-09-13T04:26:21+05:30 IST

మాన్సాస్‌పై..

మాన్సాస్‌పై పట్టు సాధించడం కోసం.. ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్!
ఎంఆర్‌ కాలేజీ

ఎయి‘డెడ్’ దిశగా!

18 మంది అధ్యాపక, 21 అధ్యాపకేతర సిబ్బంది సరెండర్‌

ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నియామకానికి సన్నాహాలు

‘మాన్సాస్‌’ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న ప్రభుత్వం


(విజయనగరం-ఆంధ్రజ్యోతి): మాన్సాస్‌పై పట్టు సాధించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ట్రస్ట్‌ పెత్తనానికి చెక్‌ చెప్పాలని భావిస్తోంది. ఎయిడెడ్‌ కాలేజీలను అప్పగించాలన్న ఆదేశాలను బేఖాతరు చేసిన నేపథ్యంలో ఎలా దారికి తెచ్చుకోవాలో అన్న ఆలోచనలను పదునుపెట్టింది. వ్యూహాత్మకంగా అడుగులేస్తూ ముందుగా సాయాన్ని (ఎయిడ్‌) నిలిపివేసింది. తరువాత కాలేజీలోని ఎయిడెడ్‌ సెక్షన్లను ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో విలీనం చేసింది. అనంతరం ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని సరెండర్‌ చేసుకుంది. జీవో 224 ప్రకారం 21 మంది బోధన, 18 మంది బోధనేతర సిబ్బంది ఆర్జేడీకి సరెండ్‌ చేశారు. వీరికి కౌన్సెలింగ్‌ నిర్వహించి ప్రభుత్వ కళాశాలల్లో నియమించనున్నారు. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయడానికి ఉన్నత విద్యామండలి సన్నాహాలు చేస్తోంది.   


మాన్సాస్‌ ట్రస్ట్‌ పరిధిలో కొనసాగుతున్న విద్యాసంస్థలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఎమ్మార్‌ కళాశాల, కోటలోని కళాశాల, ఉన్నత, మోడల్‌ పాఠశాలలు ఎయిడెడ్‌ విద్యా సంస్థలుగా ఉన్నాయి. ఏటా వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్‌లో ఎయిడెడ్‌ సెక్షన్లను ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో విలీనం చేశారు. డిగ్రీ కాలేజీ మాత్రం ఎయిడెడ్‌లో కొనసాగుతోంది. ఇక్కడ అడ్మిషన్లకు విపరీతమైన పోటీ. ఉత్తరాంధ్ర నుంచే కాక సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు డిగ్రీ కాలేజీలో చేరుతుంటారు. కానీ ప్రభుత్వం ఎయిడెడ్‌ కాలేజీలకు సాయం నిలిపివేయడం, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని సరెండర్‌ చేయడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. 21 మంది బోధనా సిబ్బందిని వెనక్కి తీసుకోవడంతో విద్యాబోధనపై తప్పకుండా ప్రభావం చూపుతుంది. లక్షలాది రూపాయల వేతనాలతో బోధనా సిబ్బందిని నియమించడం యాజమాన్యానికి ఇబ్బందే. ఈ పరిణామాల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు.  


మాన్సాస్‌ విషయంలో ప్రభుత్వం అందివచ్చిన ఏ అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదు. తాజాగా దేవదాయ శాఖ ద్వారా ప్రయత్నాలు ప్రారంభించింది. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రెండు కాలేజీలు, మూడు ఉన్నత పాఠశాలలు నడుస్తున్నాయి. దేవదాయ శాఖ పర్యవేక్షణలో ఉన్నాయి. ట్రస్ట్‌ ఆస్తులుగా ఉన్నా...సంరక్షణ బాధ్యతలను మాత్రం దేవదాయ శాఖ చూస్తోంది. ఈ నేపథ్యంలో కళాశాల భవనాలు, ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించేందుకు మీ సమ్మతిని తెలియజేయాలంటూ దేవదాయ శాఖ మాన్సాస్‌ ట్రస్ట్‌ ఈవోను సూచించింది. ఈ మేరకు ఈ నెల 10న జీవో 50ను విడుదల చేసింది. ఈ పరిస్థితుల్లో ఈవో నిర్ణయంపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


మాన్సాస్‌ ట్రస్ట్‌ను ప్రభుత్వం అష్ట దిగ్బంధం చేస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా ఉన్న అశోక్‌ గజపతి, ఈవో వెంకటేశ్వరరావుకు మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. ఇంతవరకూ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అశోక్‌ను గౌరవ పూర్వకంగానైనా ఈవో కలవలేదు. ఇదే విషయాన్ని అశోక్‌ పదేపదే చెపుతున్న విషయం తెలిసిందే. వీరి మధ్య సఖ్యత లేని కారణంగా కళాశాల భవనాలు, ఆస్తులను ప్రభుత్వ పరం చేసేలా ఎటువంటి నివేదిక దేవాదాయ శాఖకు పంపిస్తారు అన్నది ఆసక్తిగా మారింది. 

Updated Date - 2021-09-13T04:26:21+05:30 IST