ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు

ABN , First Publish Date - 2022-01-29T04:49:59+05:30 IST

రివర్స్‌ పీఆర్సీ జీవోలను రద్దుచేసి పాత పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు హెచ్చరించారు. రివర్స్‌ పీఆర్సీ జీవోలను రద్దుచేసిన తర్వాతనే ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద జరిగిన రిలే దీక్షలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు
కలెక్టరేట్‌ వద్ద జరిగిన రిలే దీక్షలను ప్రారంభించి మాట్లాడుతున్న బండి శ్రీనివాసరావు

ఉద్యోగులపై వ్యవహరిస్తున్న తీరు దారుణం

ఆ జీవోలు రద్దు చేసిన తర్వాతే చర్చలకు..

ఉద్యమంపై తప్పుడు ప్రచారాలను మానుకోవాలి

కలెక్టర్లు, ట్రెజరీ డైరెక్టర్లు ఒత్తిడి పెంచడం మంచిది కాదు

ఏపీ ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు

ఒంగోలు(కలెక్టరేట్‌), జనవరి 28: రివర్స్‌ పీఆర్సీ జీవోలను రద్దుచేసి పాత పీఆర్సీ  ప్రకారం వేతనాలు ఇవ్వకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు హెచ్చరించారు. రివర్స్‌ పీఆర్సీ జీవోలను రద్దుచేసిన తర్వాతనే ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద జరిగిన రిలే దీక్షలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దారుణంగా ఉన్నాయన్నారు. చర్చల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. ఇది మంచిది కాదని హితవు పలికారు. ప్రభుత్వ ఉద్యోగులు తగ్గిన వేతనాలు తీసుకునేందుకు సిద్ధంగా లేరన్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన 27శాతం ఐఆర్‌ తగ్గించి ఇవ్వడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో 20శాతం ఉన్న హెచ్‌ఆర్‌ఏను 8 శాతానికి తగ్గించడం దారుణంగా ఉందన్నారు. కొత్త పీఆర్సీతో వేతనాలు ఇవ్వాలని కొంతమంది కలెక్టర్లు, ట్రెజరీ డైరెక్టర్లు డీడీవోలపై ఒత్తిళ్లు తెస్తున్నారని తెలిపారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర నాయకుడు కాజా రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వవిధానాలతోనే ఉద్యోగులు రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మరో నాయకుడు అరవ పాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఇదేవిధంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. పీఆర్సీ సాధన సమితి నాయకులు కూచిపూడి శరత్‌బాబు, ఆర్‌వీఎస్‌ కృష్ణమోహన్‌, చిన్నపురెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎండ్లూరి చిట్టిబాబుల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేవీజీ కీర్తి, కె.శ్రీనివాసరావ, గురునాథశర్మ, ఎం.అయ్యపురెడ్డి ఉన్నారు. 

Updated Date - 2022-01-29T04:49:59+05:30 IST