
లేదంటే బాధిత కుటుంబంతో కలిసి బీజేపీ ఉద్యమం
సీఎం మానవత్వం లేని మూర్ఖుడు: సంజయ్
వికారాబాద్/మర్పల్లి, మే 16 (ఆంధ్రజ్యోతి): మతాంతర వివాహం చేసుకున్న నాగరాజు హత్యపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించేవరకు బాధిత కుటుంబంతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. హత్య కేసులో నిందితులను శిక్షించడంతో పాటు దీని వెనక ఉన్న కుట్రను ఛేదించే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. హైదరాబాద్‌లో హత్యకు గురైన నాగరాజు కుటుంబ సభ్యులను ఆయన సోమవారం వికారాబాద్ జిల్లా మర్పల్లిలో పరామర్శించారు. ప్రేమ వివాహం, హత్యకు దారితీసిన సంఘటనల గురించి ఆయన నాగరాజు భార్య ఆశ్రీనా సుల్తానాను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో సంజయ్ మాట్లాడుతూ.. దళిత యువకుడు నాగరాజును నడిరోడ్డుపై హత్య చేసి 12 రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ మానవత్వం లేని మూర్ఖుడని విమర్శించారు. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నడా? అనే అనుమానం కలుగుతోందని, రాష్ట్రంలో పోలీసులకే హోంమంత్రి ఎవరో తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. ఎంఐఎంకు సీఎం కేసీఆర్ గజగజ వణికిపోతున్నారని, హత్య చేసిన వారిలో ఆ ఇద్దరినీ కాపాడేందుకే అరెస్టు చేశారని ఆరోపించారు. నిందితులకు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగరాజు హత్య కేసులో ఉగ్రవాద సంస్థలకు సంబంఽధాలున్నాయని, క్రిమినల్స్‌కు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటోందని ఆరోపించారు. మిర్యాలగూడలో ప్రేమపెళ్లి చేసుకున్న దళితుడిని హత్య చేస్తే గగ్గోలు పెట్టిన దళిత, సోకాల్డ్ ప్రొగ్రెసివ్ సంఘాలు ఇప్పుడు నాగరాజు హత్య విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. నడిరోడ్డుపై అమానుష ఘటనలు జరుగుతుంటే మొబైల్లో చిత్రీకరించడం కంటే ముందు ప్రాణాలు కాపాడేందుకు సాటివారు ప్రయత్నం చేయాలని, మానవత్వంతో వ్యవహరించాలని సోషల్ మీడియాకు, సమాజానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
వారికి ఉరిశిక్ష పడాలి: నాగరాజు తల్లి
తన కొడుకును చంపిన వాళ్లకు ఉరిశిక్ష వేయించేలా చూడాలని నాగరాజు తల్లి అనసూయ బండి సంజయ్‌తో మొరపెట్టుకుంది. లేకపోతే జైలు నుంచి వచ్చి తమనూ చంపుతారని వాపోయింది. నాగరాజు భార్య ఆశ్రీన్ మాట్లాడుతూ.. తన భర్తను హత్య చేసిన వారికి శిక్ష ఎప్పుడు పడుతుందని సంజయ్‌ని అడిగింది. హత్య చేసిన తన అన్నను కలిసే అవకాశం కల్పించాలని కోరింది. అధికారులతో మాట్లాడి అవకాశం ఉంటే అక్కడకు తీసుకువెళ్లి కలిపించే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా సంజయ్ ఆమెకు హామీ ఇచ్చారు.