భూసేకరణపై కిరికిరి

ABN , First Publish Date - 2020-07-05T10:33:50+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ కళ్యాణదుర్గంలో అభాసుపాలవుతోంది.

భూసేకరణపై కిరికిరి

ప్రభుత్వ ఆశయం అభాసుపాలు చేసే యత్నం 

పేదల నోట్లో మట్టి కొట్టేందుకు ఓ ప్రతినిధి హైడ్రామా

లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశాక హైకోర్టు ద్వారా నోటీసు


 కళ్యాణదుర్గం, జూలై 4: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ కళ్యాణదుర్గంలో అభాసుపాలవుతోంది. ఓ ప్రజాప్రతినిధి కాసుల కోసం హైడ్రామా నడుపుతూ అధికారులను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపి స్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు రోడ్డులో పేదలకు ఇంటి పట్టాల కోసం ఏర్పాటుచేసిన లేఔట్‌ వివాదాస్పదంగా మారింది. ఆ భూమిలో హద్దులు ఏర్పాటుచేయడం, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులకు వారం రోజుల నుంచి తలనొప్పిగా మారింది. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ప్లాట్లు వేసే ప్రక్రియను అనేక సవాళ్ల మధ్య పూర్తి చేశారు.


తన పంతం నెగ్గలేదని భావించిన ఆ ప్రజాప్రతినిధి హైకోర్టును ఆశ్రయించి ఈనెల 8న జరిగే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పరోక్షంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అధికార పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ సాగుతోంది. సర్వేనెంబర్‌ 222-3 ఏ1 6.74, 223-5 ఏ2 1.24 సెంట్ల భూమిని రైతు పద్మావతితో ఎకరా రూ.20 లక్షల ప్రకారం కొనుగోలు చేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆ భూమి అన్నదమ్ముల మధ్య భాగ పరిష్కారాలు కాలేదనే నెపంతో కొందరు వైసీపీ నాయకులు సర్వేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పద్మావతి భర్త రమేష్‌ తమ్ముడు వెంకటేష్‌తో తాను భూమి కొనుగోలు చేశామని, ఇందుకు సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని నాయకులు అధికారులతో బుకాయించే ప్రయత్నం చేసి కాలయాపన చేశారు. రెండు రోజుల పాటు సర్వేను అడ్డుకోవడంతో పోలీస్‌ బందోబస్తు నడుమ సర్వే ప్రక్రియను పూర్తిచేసి ప్లాట్లకు హద్దులు ఏర్పాటుచేశారు.


భూమి కొనుగోలు ప్రక్రియ సాగిందిలా..

 జూలై 8న అర్హతగల పేదోడికి ఇంటి పట్టాలు ఇవ్వడంలో భాగంగా ఇదివరకు ఒంటిమిద్ది గ్రామ సమీపంలో సుమారు 30 ఎకరాల భూమిని సేకరించి 1701 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇంకా 406 మంది లబ్ధిదారులకు స్థలాలు గుర్తించాల్సి ఉంది. ఇందులో భాగంగా రెవెన్యూ, మున్సిపల్‌ అఽధికారులు పేదల ప్రయోజనాల కోసం ముదిగల్లు రైల్వే గేటు సమీపంలో సర్వేనెంబర్‌ 222-3 ఏ1 6.74, 223-5 ఏ2 1.24 సెంట్ల భూమిని గుర్తించారు. ఇందుకు సంబంధించిన రికార్డులు పరిశీలించి గెజిట్‌ నెంబర్‌ 84-2020 ప్రకారం జూన్‌ 1వ తేదీన జిల్లా కలెక్టర్‌కు భూసేకరణ నిమిత్తం నివేదిక పంపారు.


సాధ్యాసాధ్యాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ అదేరోజు ప్రభుత్వ నిబంధనల మేరకు భూసేకరణకు అంగీకార పత్రాన్ని విడుదల చేశారు. 5వ తేదీన 84/2020 జిల్లా గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఫారం-సీ ప్రకారం పబ్లిక్‌ నోటీస్‌ ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేసే ప్రక్రియను ప్రారంభించారు. 22న భూసేకరణ కమిటీ చైర్మన్‌  కలెక్టర్‌ గంధం చంద్రుడు రైతు జి పద్మావతితో సంప్రదింపులు చేసి ఎకరాకు రూ. 20లక్షల ప్రకారం మార్కెట్‌ ధర చెల్లించి భూమి కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి అగ్రిమెంట్‌ చేయించారు. ఫారం-3 ప్రకారం రైతుతో భూమిని స్వాధీనం చేసుకున్నట్లు పంచనామా నిర్వహించారు. ముందస్తుగా రైతుకు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా బిల్లు చెల్లించేందుకు అంగీకార పత్రాన్ని స్వీకరించారు. 


పంతం నెగ్గించుకునేందుకు ప్రజాప్రతినిధి పాట్లు

తన మార్గదర్శకాల మేరకు భూసేకరణ జరగలేదని స్థానిక ప్రజాప్రతినిధి పంతం నెగ్గించుకునేందుకు నానా పాట్లు పడుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి భూమి విక్రయించిన రైతులతో లోపాయికార ఒప్పందం కుదుర్చుకుని అన్నదమ్ముల మధ్య భాగ పరిష్కారాలు కాలేదనే నెపాన్ని ఎత్తిచూపుతూ ఆ భూమి లో ప్లాట్లు వేయరాదని అధికారులను నమ్మబలికించే ప్ర యత్నం చేస్తున్నట్లు తెలిసింది. పేదలకు పట్టాలు పంపిణీచేసే సమయం దగ్గర పడడంతో అధికారులు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు పోలీస్‌ బందోబస్తు మధ్య మూడు రోజుల కిందట సర్వే నిర్వహించి ప్లాట్లు వేశారు.


ఈ అంశాన్ని సవాల్‌గా తీసుకున్న ఆ ప్రజాప్రతినిధి శుక్రవారం ఆ రైతుతో హైకోర్టులో దావా వేయించినట్లు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. భూసేకరణ చట్ట ప్రకారం భూమిని కొనుగోలుచేయలేదని హైకోర్టు రెవెన్యూ శాఖకు నోటీసు జారీ చేసినట్లు తెలిసింది. ఇందుకు స్పందించిన తహసీల్దార్‌ గోపాల్‌రెడ్డి ప్రభుత్వ నిబంధనల మేరకే పేదలకు ఇంటి పట్టాలు అందించేందుకు భూసేకరణ చేసినట్లు వివరణ ఇస్తూ నివేదికను కోర్టుకు పంపినట్లు చెప్పారు.

Updated Date - 2020-07-05T10:33:50+05:30 IST