Advertisement

స్విజ్జర్లాండ్‌లో ఘనంగా పీవీ శతజయంతి ఉత్సవాల ప్రారంభోత్సవం

Oct 26 2020 @ 15:38PM

పీవీ నిరంతర సంస్కరణశీలి, ఆయన ఖ్యాతిని చాటిచెప్పడమే ప్రభుత్వ లక్ష్యం: శతజయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్ కె.కేశవరావు

పీవీ స్ఫూర్తిని తీసుకోవడమే నిజమైన నివాళి: పీవీ తనయుడు ప్రభాకర్ రావు

ఏడాది పాటు యజ్ఞంలా ఉత్సవాలు: మహేశ్ బిగాల, పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు

పీవీఎన్ఆర్ కమిటీ, ఎన్నారై సంఘం ప్రతినిధుల ఆధ్వర్యంలో సదస్సు: గందే శ్రీధర్, దుద్దిళ్ల పవన్ 

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణశీలి అని పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. ఏ మంత్రిత్వశాఖ ఇచ్చినా సంస్కరణలు చేపట్టడం పీవీ శైలి అని తెలిపారు. కమిటీ ఆధ్వర్యంలో స్విజ్జర్లాండ్‌లో పీవీ శత జయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో కేశవరావు జూమ్ ద్వారా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మార్పు అనేది నిరంతర ప్రక్రియ అని పీవీ విశ్వసించేవారని ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా గురుకుల విద్యాలయాలు, వైద్యశాఖ మంత్రిగా ఆరోగ్యకార్యకర్తల విధానం, ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత పీవీకే దక్కుతుందని చెప్పారు. తెలంగాణలో 95 శాతం చిన్న కమతాలే ఉండటానికి కారణం పీవీ చేపట్టిన భూసంస్కరణలే అని కొనియాడారు. ఏ సంస్కరణ చేపట్టినా మానవీయ కోణాన్ని ఏనాడూ విస్మరించలేదని తెలిపారు. నిర్ణయాలు తీసుకున్నప్పుడు పేదలపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్తలు పాటించాలని వివరించారు. పీవీ ఖ్యాతికి రావాల్సినంత గుర్తింపు రాలేదని అన్నారు. 

 

మైనారిటీ ప్రభుత్వానికి ప్రధానిగా ఐదేళ్ల పాటు విజయవంతంగా పనిచేసిన చాణక్యుడని అభివర్ణించారు. కర్తవ్య నిర్వహణకే అంకితమయ్యారు తప్ప... ఏనాడూ సొంత గొప్పదనం చాటుకోలేదని చెప్పారు. వివిధ రకాల పదవులు విజయవంతంగా నిర్వర్తించి... ఢీల్లీ నుంచి హైదరాబాద్ వెనుదిరిగే సమయంలో ప్రధానిగా అవకాశం లభించిందని అన్నారు. ఆ అవకాశాన్ని దేశం కోసం వినియోగించారని గుర్తు చేశారు. పంజాబ్, కశ్మీర్, అసోం వంటి రాష్ట్రాల్లో శాంతిని నెలకొల్పారని, అంతర్జాతీయ సంబంధాల విషయంలోనూ పీవీ వ్యూహాత్మకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఆర్థికవేత్త, తత్వవేత్త, విద్యావేత్త, సామాజికవేత్త, ప్రగతీశీల వ్యక్తిగా... మొత్తంగా స్థితప్రజ్ఞుడిగా పీవీ బహుముఖ ప్రతిభ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. 


స్ఫూర్తిపొందడమే నిజమైన నివాళి: పీవీ ప్రభాకర్ రావు

పీవీ బహుముఖ ప్రతిభ నుంచి స్ఫూర్తిపొంది... ఒక్క విషయం అలవర్చుకున్నా అదే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పీవీ తనయుడు, శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు పీవీ ప్రభాకర్ రావు అన్నారు. భారత దేశ ఆర్థిక ప్రస్థానంలో స్విజ్జర్లాండ్‌కు చాలా ప్రాముఖ్యత ఉందని తెలిపారు. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న మొదటి భారత ప్రధాని పీవీ అని చెప్పారు. దావోస్ సదస్సుకు హజరై.. భారత్‌లో పెట్టుబడులకు అనువైన పరిస్థితులు, అవకాశాలపై సుధీర్ఘంగా ప్రసంగించారని తెలిపారు. ఈ సందర్భంగా పీవీ హయాంలో చేపట్టిన సంస్కరణలు... నేడు దైనందిన జీవితంలో ఎలాంటి మెరుగైన మార్పులకు కారణమయ్యాయో వివరించారు. పరిశ్రమలు, టెలికాం, బ్యాంకింగ్, ఎయిర్ లైన్స్, సాఫ్ట్ వేర్ సహా అనేక రంగాల్లో పీవీ సంస్కరణలు చేపట్టారని గుర్తు చేశారు. పీవీ భారత న్యూక్లియర్ టెక్నాలజీకి పితామహుడిగా నిలిచారని పేర్కొన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి సాయం చేయాలని తపించిన వ్యక్తిగా  కొనియాడారు. రాజనీతిజ్ఞుడు, సంస్కరణలశీలి, సాహితీవేత్తగా బహుముఖ ప్రతిభ కలిగిన పీవీ గారిది... 360 డిగ్రీల వ్యక్తిత్వం అని సీఎం కేసీఆర్ అభివర్ణించడం సముచితమని ఈ సందర్భంగా ప్రభాకర్ రావు తెలిపారు. ఆ విధంగా పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా అన్ని కోణాల్ని ఆవిష్కరించేందుకు కృషి జరుగుతోందని చెప్పారు. పీవీ నిరంతర విద్యార్థి అని ప్రభాకర్ రావు చెప్పారు. 65 ఏళ్ల వయసులో కంప్యూటర్ నేర్చుకున్నారని గుర్తు చేశారు. సంక్షోభంలో అవకాశం వెతుక్కోవడం పీవీ శైలి అని తెలిపారు. ఒకసారి చేతి వేళ్లకు సమస్య వచ్చినప్పుడు ఎక్సర్ సైజ్ కోసం డాక్టర్ సూచించిన సాఫ్ట్ బాల్‌కు బదులుగా ఎలక్ట్రానిక్ కీ బోర్డ్ వాయించారని... అందులోనూ నైపుణ్యం సాధించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో పాల్గొన్న వారికి ప్రభాకర్ రావు బతుకమ్మ, దసరా, శుభాకాంక్షలు తెలిపారు. 

ఏడాది పాటు యజ్ఞంలా ఉత్సవాలు: మహేశ్ బిగాల, పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు, టీఆర్ఎస్ ఎన్నారై విభాగం కోఆర్డినేటర్

పీవీ శతజయంతి ఉత్సవాలు ఏడాది పాటు యజ్ఞంలా నిర్వహిస్తున్నామని టీఆర్ఎస్ ఎన్నారై విభాగం కోఆర్డినేటర్, పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల అన్నారు. పీవీ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రణాళిక యుతంగా వెళ్తున్నామని పేర్కొన్నారు. స్విజ్జర్లాండ్, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో పీవీ గారి విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అమెరికాలో బిల్ క్లింటన్‌ను ఆహ్వానించి... ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు. పీవీకి భారతరత్న అవార్డు ప్రదానమే సముచిత గౌరవమని ఈ సందర్భంగా మహేశ్ బిగాల అభిప్రాయపడ్డారు. 


పీవీ తెలుగు వాడు కావడం గర్వకారణం: శ్రీధర్ గందె, స్విజ్జర్లాండ్ ఎన్నారై సంఘం ప్రతినిధి

పీవీ నరసింహారావు తెలుగు వాడు కావడం గర్వకారణమని స్విజ్జర్లాండ్‌లోని ఎన్నారై సంఘం ప్రతినిధి శ్రీధర్ గందె అన్నారు. దేశం ఆర్థికంగా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంక్షోభం నుంచి బయటపడేసిన ఘనత పీవీ సొంతమని కొనియాడారు. నేటికీ ఆర్థిక సంస్కరణల విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు మొదటగా వినిపించే పేరు పీవీదని చెప్పారు. దృఢమైన చిత్తంతో మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపించారని గుర్తు చేశారు. 


పీవీ మాటలు ముత్యాలు: పవన్ దుద్దిళ్ల 

పీవీ బహుభాషా కోవిదుడైనా మితభాషి అని స్విజ్జర్లాండ్‌లోని ఎన్నారై సంఘం ప్రతినిధి పవన్ దుద్దిళ్ల అన్నారు. తక్కువ మాట్లాడినా.. ఆయన మాటలు ముత్యాల్లా ఉండేవని చెప్పారు. వర్తమన సమాజంలోని సమస్యలకు కూడా పీవీ ఎలాంటి పరిష్కారాలు చూపేవారు అని ఆలోచన కలుగుతూ ఉంటుందని తెలిపారు. భారతరత్న పురస్కారం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని అన్నారు. జూమ్ సమావేశంలో కిశోర్ కుమార్ తాటికొండ, కృష్ణారెడ్డి సహా పలువురు స్విజ్జర్లాండ్ ఎన్నారై సంఘం ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.