ltrScrptTheme3

‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’ మూవీ రివ్యూ

Apr 15 2021 @ 18:20PM

మన చుట్టూ ఉన్న సమాజంలో పురుషాధిక్యత కొంత ప్రత్యక్షంగా.. మరి కొంత పరోక్షంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక కుటుంబంలో మహిళల పాత్ర ఎంత వరకూ అనే విషయంపై కొన్ని శతాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. ఒకప్పుడు ఉండే ఆడపని.. మగపని అనే విభజన క్రమంగా చెరిగిపోతూ వచ్చింది. ప్రస్తుతం ఆడపనితో పాటుగా మగపని కూడా మహిళపైనే పడుతోంది. జనాభాలో సగం ఉన్న మహిళలు తమ అస్థిత్వం కోసం.. సాధికారత కోసం చేసిన.. చేస్తున్న ప్రయత్నాలకు పురుష ప్రపంచం నుంచి ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. పైకి అంతా మంచిగానే కనిపిస్తూ ఉండచ్చు. కానీ బయటకు తెలియని ఒక ఆధిపత్యపు పోరు జరుగుతూనే ఉంటోంది. ఈ సున్నితమైన సమస్యను అత్యద్భుతంగా మలచిన మళయాళ చిత్రం ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’.


వంటిల్లు ఎవరి చేతిలో ఉంటే వారిదే ఇంటి ఆధిపత్యం అనే భావన ఒకప్పుడు ఉండేది. ఘనత వహించిన అక్బర్‌ నుంచి తాజా మాజీ మహారాజుల జనానాల వరకూ రాణులు వంటింటి ఆధిపత్యం కోసం పోరాటం చేస్తూ ఉండేవారు. కానీ కాలంతో పాటుగా మహిళలు ఈ సమాజంలో పోషించాల్సిన పాత్రలలో కూడా మార్పు వచ్చింది. అయితే మన చుట్టూ ఉన్న పురుషులు దీనిని పట్టించుకోనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. పదో తరగతి చదివిన వారు కావచ్చు.. పీహెచ్‌డీ చేసిన వారు కావచ్చు. ఆకాశమంత మేధ, సముద్రమంత తెలివితేటలు ఉండిఉండచ్చు. కానీ తమ సొంత ఇంటి విషయానికి వచ్చే సరికి ఏ మగవాడైనా పురుషాహంకారాన్ని ప్రదర్శిస్తాడు.. దానిని థిక్కరిస్తే ఊరుకోడనే విషయాన్ని ఈ చిత్రం చెప్పకనే చెబుతుంది. 


ఇక కథ విషయానికి వస్తే.. 

ఒక సగటు మధ్యతరగతి అమ్మాయి.. బాగా చదువుకొని.. ఉద్యోగం చేయాలనే ఆశతో అత్తవారింటికి వస్తుంది. ఆహారం విషయంలో ఏ రెండు విషయాలకు సారూప్యత ఉండదు కాబట్టి వంట వండే విషయంలో ఆమె రకరకాలైన కష్టాలకు గురికావాల్సి వస్తుంది. ఇడ్లీలలోకి రోటి పచ్చడి చేయలా? గ్రైండర్‌లోనే రుబ్బాలా అనే సమస్య దగ్గర నుంచి అన్నం కుక్కర్‌లో వండాలా వద్దా అనే విషయం దాకా రకరకాల సమస్యలు ఎదురవుతాయి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే- దర్శకుడు- ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా సున్నితంగా మహిళలపై పురుషులు చూపించే ఆధిపత్య ధోరణికి నిదర్శనంగా చిత్రీకరించటం. బయట నుంచి చూస్తే చాలా చిన్నగా కనిపించే సమస్యలు.. ఒక మహిళ మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి.. ఆమె అస్థిత్వాన్ని ఎలా సవాలు చేస్తాయనే విషయం మనకు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. కథ ఇలా నడుస్తున్న సమయంలో- అత్తగారు అమెరికా వెళ్లటంతో మొత్తం కుటుంబ ‘ఆహార’ భారం ఆమెపైనే పడుతుంది. అప్పటి దాకా అత్తగారు పోషించిన పాత్రను ఆమె పోషించాల్సి వస్తుంది. కష్టాలు మరింత పెరుగుతాయి. 


తన భార్య అంటే ఎంతో ప్రేమ కురిపించే భర్త.. వంటింట్లో సింక్‌ పాడైపోయిదంటే - తర్వాత చూద్దాంలే అని వెళ్లిపోతాడు. వాస్తవానికి అది ఆమెకు ఆ క్షణంలో అతి పెద్ద సమస్య. వంటింట్లో అస్సలు అడుగుపెట్టని భర్తకు - భార్యను లొంగదీయటానికి దొరికిన ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని తాను ఉపయోగించి ఆమెను లొంగదీయటానికి ప్రయత్నిస్తున్నానని కూడా అతనికి తెలియకపోవచ్చు. కానీ తన తండ్రిని చూసి.. చుట్టూ ఉన్న పురుష సమాజాన్ని చూసి అతను నేర్చుకున్న పాఠమది. ఒకవైపు కుటుంబం ఇలా నడుస్తున్న సమయంలో ఆమె డ్యాన్సు టీచర్‌ పోస్టులు పడితే రహస్యంగా అప్లై చేస్తుంది. డ్యాన్సర్‌ టీచర్‌ ఉద్యోగం తమ కుటుంబ స్థాయికి తగదని నచ్చచెప్పటానికి మామగారు, భర్త ప్రయత్నిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో భర్త అయ్యప్ప మాల వేసుకుంటాడు. మహిళలు అయ్యప్ప స్వామి కోవెలలోకి ప్రవేశించాలా లేదా అనే విషయంపై తీవ్రమైన వివాదం జరుగుతున్న సమయంలో- మహిళలకు హక్కు ఉందనే ఒక పోస్టును ఫేస్‌బుక్‌లో ఫార్వర్డ్‌ చేస్తుంది. దీనితో ఆ గ్రామంలో తీవ్ర సంచలనం చెలరేగుతుంది. ఆ పోస్టును తొలగించమని భర్త ఒత్తిడి చేస్తాడు. ఆమె వినదు. ఒక రోజు భర్త ఉద్యోగానికి బయలుదేరుతూ స్కూటర్‌ మీద నుంచి జారి పడిపోతాడు. వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి లేవదీయబోతుంది.


భర్త తనను ముట్టుకున్నందుకు తిట్టేసి వెళ్లిపోతాడు. ప్రాయశ్చిత్తం కూడా చేసుకుంటాడు. అప్పటికే తన చుట్టూ ఉన్న పరిస్థితులపై విసిగిపోయిన ఆమె- తన భర్త, మామగారి మొహాల మీద సింక్‌ నుంచి కారుతున్న నీళ్లను పోసి వెళ్లిపోతుంది. ఒక డ్యాన్స్‌ టీచర్‌గా జీవితాన్ని మళ్లీ ప్రారంభిస్తుంది. ఒక వైపు ఆమె ఆధునికతను అద్దం పట్టే బాలేకు రూపకల్పన చేస్తుంటే.. మరో వైపు భర్త మళ్లీ పెళ్లి చేసుకుంటాడు. టీ తాగి సింగ్‌ మీద పెడతాడు. రెండో భార్య కడుగుతూ ఉంటుంది. ఈ షాట్‌ ద్వారా ఒక వర్గం మారటం అంత సులభం కాదని దర్శకుడు చెప్పకనే చెబుతాడు. 


మన చుట్టూనే..

జాగ్రత్తగా గమనిస్తే ఈ సినిమాలో పాత్రలు మన చుట్టూనే కనిపిస్తాయి. తమ్ముడి కోసం అక్కను నీళ్లు తీసుకురమ్మనే అమ్మలు.. ‘నా ఇల్లు.. నా ఇష్టం వచ్చినట్లు ఉంటా’ అనే భర్తలు.. ‘అన్నం కుక్కర్‌లో వండద్దు.. పొయ్యి మీదే వండు’ అని నవ్వుతూ చెప్పే మామలు మన చుట్టూ ఎంతో మంది. వారి దృష్టిలో వారు చేస్తున్నది తప్పు కాదు. తరతరాలుగా జరుగుతున్న ఒక సహజమైన ప్రక్రియ. దీనిలో వారికి సౌఖ్యం ఉంది కాబట్టి వదులుకోవటానికి వారు సిద్ధపడరు. కొద్ది మంది తప్ప ఎక్కువ మంది మహిళలు ఈ పరిస్థితులకు సద్దుకుపోతారు. కానీ పరిస్థితులు మారుతున్నాయి.. పురుషులు తమ పద్ధతులను మార్చుకోపోతే ఇబ్బందులు తప్పవని ఈ సినిమా హెచ్చరిస్తుంది. మారుతున్న పరిస్థితులను గమనించాలనే జిజ్ఞాస ఉన్నవారందరూ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది. 


(అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదలయిన చిత్రం)


సీవీఎల్ఎన్


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.