అంతా అక్కడికే

ABN , First Publish Date - 2022-01-28T05:30:00+05:30 IST

మహా ప్రవక్త మహమ్మద్‌కు సహచరుడైన హజ్రత్‌ అబూదర్జా ఇంటికి ఒక రోజు కొందరు అతిథులు వచ్చారు. అది ఎముకలు కొరికే చలికాలం. అబూ దర్జా తన అతిథులకు వేడి వేడి భోజనమైతే పెట్టారు. కానీ... కప్పుకోవడానికి వెచ్చటి కంబళ్ళు ఇవ్వలేదు.

అంతా అక్కడికే

మహా ప్రవక్త మహమ్మద్‌కు సహచరుడైన హజ్రత్‌ అబూదర్జా ఇంటికి ఒక రోజు కొందరు అతిథులు వచ్చారు. అది ఎముకలు కొరికే చలికాలం. అబూ దర్జా తన అతిథులకు వేడి వేడి భోజనమైతే పెట్టారు. కానీ... కప్పుకోవడానికి వెచ్చటి కంబళ్ళు ఇవ్వలేదు. ఆ అతిథులు రాత్రి నిద్రపోవడానికి సిద్ధమవుతూ... తాము కప్పుకోవడానికి కంబళ్ళ గురించి అబూదర్జాను అడగాలనుకున్నారు. వారిలో ఒకరు అబూదర్జా గదిలోకి వెళ్ళి చూస్తే... ఆయన, ఆయన భార్య పల్చటి దుప్పటి కప్పుకొని, వణుకుతూ పడుకుని ఉండడం కనిపించింది. 


అలికిడికి అబూదర్జా లేచి, ఆ అతిథిని చూశారు. ‘‘మీరు కూడా మా మాదిరిగానే వణుకుతూ రాత్రి గడుపుతున్నారు. ఇంతకూ మీ సామగ్రి అంతా ఏమైపోయింది?’’ అని అడిగాడు ఆ అతిథి.

‘‘అక్కడ (పరలోకంలో) మా ఇల్లొకటి ఉంది. ఇక్కడ ఎప్పుడైనా, ఏదైనా సామగ్రి మా దగ్గరకు వస్తే దాన్ని మేము (దానం రూపంలో) ఆ ఇంటికే పంపిస్తూ ఉంటాం. మేము ఈ ఇంట్లో ఏదైనా మిగిల్చి పెడితే... దాన్ని మీకు తప్పకుండా ఇస్తాం. అదీకాక, పరలోక గృహానికి చేరుకొనే దారి చాలా కఠినంగా ఉంటుంది. తలకు మించిన సామగ్రిని మోసుకు వెళ్ళడం కన్నా వీలైనంత తక్కువ బరువుతో వెళ్ళడమే తేలికగా ఉంటుంది కదా! బహుశా మీకు నా మాటల్లోని అంతరార్థం పూర్తిగా అవగతమయిందనుకుంటాను’’ అన్నారు అబూదర్జా.


‘‘అర్థమయింది. దేవుడు మీ కృషికి తగిన సత్ఫలం ప్రసాదించుగాక!’’ అన్నాడు ఆ అతిథి.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2022-01-28T05:30:00+05:30 IST