మహా తిరుగుబాటు

ABN , First Publish Date - 2022-06-22T08:25:31+05:30 IST

మహారాష్ట్రలో మహా రాజకీయ సంక్షోభం మొదలైంది! శాసన మండలి ఎన్నికల్లో అనూహ్యంగా దెబ్బతిన్న మర్నాడే మహా వికాస్‌ అఘాడీ కూటమికి మరో షాక్‌ తగిలింది.

మహా తిరుగుబాటు

శివసేనలో అసమ్మతి.. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం

తిరుగుబావుటా ఎగరేసిన సేన కీలక నేత ఏక్‌నాథ్‌ షిండే


పలువురు రెబెల్‌ ఎమ్మెల్యేలతో సూరత్‌ హోటల్‌లో మకాం.. బీజేపీలో చేరితే పార్టీలో చీలిక ఉండదు

తర్వాత మీ ఇష్టం.. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేకు అల్టిమేటం జారీ చేసిన మంత్రి ఏక్‌నాథ్‌ షిండే 

తన వెంట 35 మంది ఎమ్మెల్యేలున్నట్టు స్పష్టీకరణ.. ఎన్సీపీ, కాంగ్రెస్‌, సేన కలయిక వారికిష్టం లేదని వెల్లడి

అధికారం కోసం మోసం చేయబోమంటూ ట్వీట్‌.. శాసనసభాపక్షనేత పదవి నుంచి షిండే తొలగింపు

తిరుగుబాటు వెనుక బీజేపీ: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌.. ఇది శివసేన అంతర్గత అంశం: శరద్‌ పవార్‌

షిండే తిరుగుబాటుతో మాకు సంబంధం లేదు.. ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదన వస్తే వదిలిపెట్టం: బీజేపీ

విశ్వాస పరీక్ష పెడితే నెగ్గడం కష్టమే!.. ‘మహా’ సంకీర్ణ సర్కారుకు గండమే

నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు క్యాబినెట్‌ భేటీ నిర్వహించనున్న ఠాక్రే


ముంబై, సూరత్‌, జూన్‌ 21: మహారాష్ట్రలో మహా రాజకీయ సంక్షోభం మొదలైంది! శాసన మండలి ఎన్నికల్లో అనూహ్యంగా దెబ్బతిన్న మర్నాడే మహా వికాస్‌ అఘాడీ కూటమికి మరో షాక్‌ తగిలింది. కూటమి సర్కారులో కీలక పార్టీ అయిన శివసేన సీనియర్‌ నేత, క్యాబినెట్‌ మంత్రి ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబావుటా ఎగరేశారు! తనతోపాటు పలువురు శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలను తీసుకెళ్లి.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో డైమండ్‌ సిటీగా పేరొందిన సూరత్‌లోని ‘లీ మెరిడియన్‌’ హోటల్‌లో మకాం వేశారు. ‘‘నాతో 35 మంది ఎమ్మెల్యేలున్నారు. బీజేపీతో కలవడానికి గనక మీరు సిద్ధమైతే పార్టీలో చీలిక ఉండదు’’ అని నేరుగా ఉద్ధవ్‌ ఠాక్రేకే అల్టిమేటం జారీచేశారు. ఈ పరిణామాలతో.. రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న మహావికాస్‌ అఘాడీ కూటమి ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది! మహారాష్ట్ర శాసన మండలిలో 10 స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వాటి ఫలితాలు సోమవారం రాత్రి వెలువడ్డాయి. కేవలం నలుగురు అభ్యర్థులను మాత్రమే గెలిపించుకోగలిగిన సంఖ్యా బలం ఉన్న ప్రతిపక్ష బీజేపీ ఐదుగురు అభ్యర్థులను బరిలోకి దింపి అందరినీ గెలిపించుకుంది. కొంతమంది శివసేన ఎమ్మెల్యేల క్రాస్‌ ఓటింగ్‌తోపాటు, మరికొంతమంది స్వతంత్య్ర అభ్యర్థులు, చిన్నపార్టీల ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ దీన్ని సాధించగలిగింది. క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు తేలిన నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే మంగళవారం మధ్యాహ్నం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పార్టీ ఎమ్మెల్యేలంతా దానికి హాజరు కావాలని ఆదేశించారు. ఈ సమాచారం చేరవేసేందుకు ఏక్‌నాథ్‌ షిండేను సంప్రదించే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు.


అప్పటికే ఆయన సూరత్‌కు చేరుకున్నట్టు సమాచారం. నిజానికి గత వారం రోజులుగా షిండే కొంత అసహనంతో ఉంటున్నారని.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి కూడా శివసేన వద్దే ఉండాలంటున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి (ప్రస్తుతం ఆ పదవిలో ఎన్సీపీ నేత అజిత్‌పవార్‌ ఉన్న సంగతి తెలిసిందే). ఇక, తనతో 35 మంది ఎమ్మెల్యేలున్నట్టు షిండే చెబుతున్నప్పటికీ.. ఆయనతో ఉన్నది 21 మంది ఎమ్మెల్యేలని విశ్వసనీయ వర్గాల సమాచారం. వారిలో ఐదుగురు మంత్రులు కాగా.. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సూరత్‌లో షిండేతో 14 నుంచి 15 మంది దాకా ఎమ్మెల్యేలున్నట్టు సేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చెబుతున్నారు. ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటుకు ఏక్‌నాథ్‌ షిండేపై కేంద్ర ఏజెన్సీల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిందంటూ బీజేపీపై ఆయన పరోక్షంగా మండిపడ్డారు. సూరత్‌లో షిండేతోపాటు ఉన్న ఇద్దరు సేన ఎమ్మెల్యేలను ‘ఆపరేషన్‌ కమల్‌’లో భాగంగా పోలీసులు, గూండాలు సోమవారం రాత్రి కొట్టారని రౌత్‌ ఆరోపించారు. ‘‘దేశ్‌ముఖ్‌ పారిపోవడానికి ప్రయత్నిస్తే పోలీసులు, గూండాలు ఆయన్ను, మరో ఎమ్మెల్యేను కొట్టారు.


దీంతో దేశ్‌ముఖ్‌కు గుండెపోటు వచ్చింది. తమను తప్పుదోవ పట్టించి గుజరాత్‌కు తరలించారని కొందరు ఎమ్మెల్యేలు మాకు చెప్పారు’’ అని ఆయన వివరించారు. తమను తప్పుదోవ పట్టించి, కిడ్నాప్‌ చేశారని.. కాపాడాలని ఆయా ఎమ్మెల్యేల నుంచి నాలుగైదు ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్టు వెల్లడించారు. ‘‘తమను ఠాణేలో రాత్రి భోజనానికి పిలిచి అక్కణ్నుంచీ తీసుకెళ్లిపోయారని వారు చెప్పారు. దీనిపై వారి కుటుంబసభ్యులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు’’ అని రౌత్‌ వివరించారు. ఈ తిరుగుబాటు వెనుక బీజేపీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ తరహాలోనే మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని కూడా కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. కాగా, ఉద్ధవ్‌ ఠాక్రేకు మద్దతుగా వేలాది మంది శివసైనికులు ముంబైలోని ఆయన నివాసం వద్దకు చేరుకుని సంఘీభావం తెలుపుతుండడం గమనార్హం. మరోవైపు.. సూరత్‌లో అసమ్మతి ఎమ్మెల్యేలున్న హోటల్‌ చుట్టూ 400 మంది పోలీసులు మోహరించి గస్తీ కాస్తున్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే క్యాబినెట్‌లో పట్టణాభివృద్ధి, ప్రజాపనుల శాఖల మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న ఏక్‌నాథ్‌ షిండే.. శివసేన శాసనసభాపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.


తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో అజయ్‌ చౌధురీని శివసేన ఎల్పీ నేతగా నియమించింది. ఈ సంక్షోభం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తుండడంతో దీన్నుంచి బయటపడే మార్గాలు అన్వేషించేందుకు కాంగ్రెస్‌ నేతలు, క్యాబినెట్‌ మంత్రులు అయిన బాలాసాహెబ్‌ థోరట్‌, అశోక్‌ చవాన్‌, మరో మంత్రి, మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌.. ఠాక్రేను ఆయన నివాసంలో కలిసి చర్చించారు. అలాగే.. అసమ్మతి నేత షిండేతో చర్చలు జరిపేందుకు మిలింద్‌ నర్వేకర్‌, రవీంద్ర పాఠక్‌లను మహావికాస్‌ అఘాడీ నియమించింది. వారు మంగళవారం షిండే, ఇతర అసమ్మతి నేతలతో భేటీ అయి రెండు గంటలు చర్చించినట్టు సమాచారం.


విశ్వాస పరీక్ష నెగ్గడం కష్టమే!

మహారాష్ట్రలోని మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) సంకీర్ణ సర్కారు సం క్షోభంలో పడింది. విశ్వాస పరీక్ష పెడితే గట్టెక్కడం కష్టమే! మహారాష్ట్ర అసెం బ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. బీజేపీకి 106 మంది, శివసేనకు 55, కాంగ్రెస్‌కు 44, ఎన్సీపీకి 54 మంది ఎమ్మెల్యేలున్నారు. స్వతంత్రులు, ఇతర పార్టీల సభ్యులు 29 మంది ఉన్నారు. ప్రస్తుతం ఎంవీఏ సర్కారుకు 152 మంది సభ్యుల బలం ఉంది. అయితే, శివసేన సీనియర్‌ నేత, మంత్రి ఏక్‌నాథ్‌ షిండే కొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి సూరత్‌కు వెళ్లిపోయారు. షిండేతో పాటు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఒక వార్తా సంస్థ, 22 మంది (ఒక స్వతంత్య్ర సభ్యుడు) ఉన్నారని మరో వార్తా సంస్థ పేర్కొన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో ఓ ఎమ్మెల్యే మరణించడంతో అసెంబ్లీలో సంఖ్యా బలం 287గా ఉంది. అంటే విశ్వాస పరీక్ష పెడితే 144 మంది సభ్యులు ఉం డాలి. తాజాగా 21 మంది సేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ఆ పార్టీ బలం 34కు పడిపోతుంది. ఫలితంగా సభలో సంకీర్ణ సర్కారు బలం 130కి తగ్గిపోతుంది. 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే సభలో కొత్త మెజా రిటీ మార్కు 133కు చేరుతుంది. సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు 134 ఓట్లు వచ్చాయని బీజేపీ నేత, మాజీ మంత్రి సుధీర్‌ ముంగంటివార్‌ గుర్తుచేశారు. ఎంవీఏ సర్కారుపై అనేక మంది శివసేన నేతలు అసంతృప్తితో ఉన్నారన్నది బహిరంగ రహస్యమేనన్నారు. మరోవైపు కొన్ని వార్తా సంస్థలు షిండేతో 35 మంది ఎమ్మెల్యేలున్నారని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రెబెల్స్‌ సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది.

Updated Date - 2022-06-22T08:25:31+05:30 IST