హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-06-30T05:13:01+05:30 IST

హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని, గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీహర్ష

- అధికారులకు కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశం

గద్వాల క్రైం, జూన్‌ 29 : హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని, గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఎంపీడీవోలతో కలెక్టరేట్‌ సమావేశపు హాలులో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్ధలాన్ని గుర్తించి, పనులను పూర్తి చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులతో సమావేశాలు నిర్వహించి హరితహారం, క్రీడా ప్రాంగణాల ఏర్పాట్లపై అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు గుంతలు తీసిన కూలీలకు డబ్బులు చెల్లించి, బిల్లులు పంపించాలని ఆదేశించారు. నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో జవహర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌, జూరాల ప్రాజెక్ట్‌ కాలువల పొడవునా పెద్ద మొక్కలు నాటి, వాటికి కంచెలు ఏర్పాటు చేయా లని సూచించారు. పల్లె ప్రకృతి వనాల్లో పనులు చేసిన ఉపాధి హామీ కూలీలకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలన్నారు. జిల్లాలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా పెద్ద మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశం లో జడ్జి సీఈవో విజయనాయక్‌, డిప్యూటీ డీఆర్డీఏ నాగేంద్రం, డీఎల్‌పీవో వెంకట్‌రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


జిల్లా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం కలెక్టర్‌ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో డైట్‌ను పరిశీలించేందుకు వచ్చిన ఆయన, రోగులకు ఇచ్చే ఆహారంలో మెనూ, నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. అయితే అప్పటికి ఇంకా భోజనం ప్రారంభం కాకపోవడంతో  వెళ్ళిపోయారు. మొదటిరోజు మెనూ ప్రకారం అన్నం, గుడ్డు, అరటిపండు, కర్రీ, రసం ఉందని, కానీ పెరుగు ఇవ్వలేదని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిశోర్‌కుమార్‌ కలెక్టర్‌కు వివరించారు. 


కార్యాచరణ ప్రణాళిక ఆవిష్కరణ

జిల్లాలోని విద్యార్థుల కనీస అభ్యసన సామర్థ్యాల పెంపునకు రూపొందించబడిన భూమిక-2 సంసిద్ధతా కార్యాచరణ ప్రణాళిక పత్రాలను బుధవారం కలెక్టర్‌ శ్రీహర్ష ఆవిష్కరించారు. ఈ ప్రణాళికలను అమలు చేస్తూ విద్యార్థుల ప్రగతికి తోడ్పడాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో డీఈవో సిరాజుద్దీన్‌, జిల్లా సమన్వయ అధికారులు ఎస్తేర్‌రాణి, హంపయ్య, జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T05:13:01+05:30 IST