గాంధీ నడయాడిన నేల..

ABN , First Publish Date - 2022-08-12T08:16:43+05:30 IST

భారత స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధి బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ, విదేశీ వస్త్ర బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, వ్యక్తి స్వాతంత్య్రం లాంటి ఉద్యమాలను నడిపించారు. క్విట్‌ ఇండియా పేరుతో బ్రిటీష్‌ పాలకులపై సమరశంఖం పూరించారు. ఈ

గాంధీ నడయాడిన నేల..
మహాత్మాగాంధీ కడపలో బసచేసిన దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి ఇల్లు

జిల్లాలో నాలుగుసార్లు పర్యటించిన బాపూజీ

దేవిరెడ్డి ఇంట బస

కడపలో దళితులతో.. ప్రొద్దుటూరులో ఆర్యవైశ్యులతో ఇష్టాగోష్టి

కడప మున్సిపల్‌ హైస్కూలు బహిరంగసభలో ప్రసంగం


జాతిపిత మహాత్మాగాంధికి కడప జిల్లాతో అపూర్వ అనుబంధం ఉంది. ఆ మహాత్ముడు జిల్లాలో నాలుగుసార్లు పర్యటించారు. ఆయన పర్యటనలో భాగంగా కడపలో దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి ఇంట బస చేశారు. దీంతో దేవిరెడ్డి రామసుబ్బారెడ్డికి కడప గాంధి అనే బిరుదు వచ్చింది. స్వాతంత్య్ర అవసరం, స్వేచ్ఛాజీవితంపై ఇక్కడి ప్రజలకు హితోపదేశం చేశారు.


(కడప-ఆంధ్రజ్యోతి): భారత స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధి బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ, విదేశీ వస్త్ర బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, వ్యక్తి స్వాతంత్య్రం లాంటి ఉద్యమాలను నడిపించారు. క్విట్‌ ఇండియా పేరుతో బ్రిటీష్‌ పాలకులపై సమరశంఖం పూరించారు. ఈ ఉద్యమాలను దేశంలో నలుదిక్కులా వ్యాప్తి చేసేందుకు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు దేశవ్యాప్త పర్యటన ప్రారంభించారు.


నాలుగుసార్లు జిల్లా పర్యటన

బాపూజీ జిల్లాలో నాలుగుసార్లు పర్యటించారు. సహాయ నిరాకరణ ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ, అంటరానితనం నిష్క్రమణ, హరిజనోద్ధరణ, సంక్షేమ నిఽధుల సేకరణ నిమిత్తం నాలుగుసార్లు పర్యటించారు. కడప మాసాపేటలో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడారు. కడప పర్యటనలో భాగంగా సహాయ నిరాకరణ, స్వదేశీ వస్తువుల దుకాణాలు (ఎంపోరియం)పై ప్రజలకు వివరించారు. చివరగా ఆయన మున్సిపల్‌ హైస్కూలు  మైదానంలో స్వాతంత్య్ర పోరాటం, అనుసరించాల్సిన విధానాలు, శాంతియుత మార్గంపై ప్రజలకు పలు సూచనలు చేశారు. ఆ సభకు తండోపతండాలుగా జనం రావడంతో బ్రిటీష్‌ పాలకులు విస్తుపోయారు. ప్రొద్దుటూరు పర్యటనలో భాగంగా ఆర్యవైశ్యులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. 


కడప గాంధీ దేవిరెడ్డి

పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం కొరగుంటపల్లెకు చెందిన దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి శ్రీమంతుడైనా నిరాడంబర జీవితం గడుపుతూ కడపలో వకీలుగా ప్రాక్టీసు చేసేవారు. ఆయనకు మహాత్ముడంటే ఎనలేని గౌరవం. ఆయన ఉద్యమానికి అన్ని విధాలా సహకరిస్తూ ముందుండేవారు. దీంతో జిల్లా పర్యటనలో భాగంగా మహాత్మాగాంధీ 1934లో కడపకు వచ్చిన సమయంలో ఆయన ఇంట బస చేశారు. గాంఽధీ బస చేసిన దేవిరెడ్డి ఇంటికి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. అప్పటి నుంచి దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి కడప గాంఽధీగా గుర్తింపు పొందారు. ఆయన ఇంటిపై కూడా ‘కడప గాంధీ’ అని ఉండడం విశేషం.


జిల్లాలో మహాత్ముని పర్యటన వివరాలు..

- సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా 1921 సెప్టెంబరు 28న రాజంపేట మీదుగా కడపకు వచ్చారు. అప్పుడు రాజంపేటలో జౌళి వర్తకులు మహాత్మాగాంధీని సన్మానిం చారు. అనంతరం కడపలో జరిగిన సభలో 40 వేలమంది హాజరయ్యారు. జిల్లాలో కరువుతో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాలని సన్మానసంఘం వారికి పిలుపుని చ్చారు. దీంతో కొందరు సభలోనే తమ బంగారు ఉంగరా లను గాంధీకి ఇచ్చారు. తర్వాత విదేశీ వస్ర్తాలను, టోపీల ను కుప్పలుగా పోసి తగులబెట్టారు. ఈ సందర్భంగా గాంధీ ఉర్దూలో, కాసేపు ఆంగ్లంలో ప్రసంగించారు. వెంట ఉన్న గాడిచెర్ల హరిపురుషోత్తమరావు గాంధీ ప్రసంగాలను తెలుగులోకి అనువదించారు. ఆ సభలో స్వరాజ్యనిధికోసం 1,116 రూపాయలను కడపవాసులు ఇచ్చారు.

- విదేశీవస్తు బహిష్కరణ, అంటరానితనం నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాంఽధీ తన భార్య కస్తూరిబాగాంఽధీతో కలిసి కొండాపురం, మంగపట్నం, ముద్దనూరు, చిలంకూరు, నిడుజువ్వి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరులలో 1929 మే 17 నుంచి  మూడు రోజుల పాటు పర్యటించారు.

- హరిజనోద్ధరణ, హరిజనుల సంక్షేమం కోసం నిధుల సేకరణలో భాగంగా 1933 డిసెంబరు 31న కడపలో పర్యటించారు.

- స్వదేశీ వస్తు దుకాణాలు (ఎంపోరియం) ఏర్పాటుపై 1934 జనవరి 2న కడపకు వచ్చారు. చర్చల అనంతరం అప్పటి మున్సిపల్‌ పాకీ కాలనీకి వెళ్లి వారి స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌ హైస్కూలులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.

Updated Date - 2022-08-12T08:16:43+05:30 IST