ఎదిగే పిల్లల కోసం..!

ABN , First Publish Date - 2021-04-21T05:30:00+05:30 IST

లాయర్‌గా కొంత కాలం ప్రాక్టీస్‌ చేశారు. కానీ తల్లి అయ్యాక అనుకోకుండా వ్యాపారవేత్తగా మారారు. ‘ది గ్రోయింగ్‌ జిరాఫీ’ పేరుతో ఆరోగ్యకరమైన స్నాక్స్‌ తయారుచేసే వ్యాపారాన్ని ప్రారంభించి విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు కోల్‌కతాకు చెందిన రుక్మిణీ బెనర్జీ...

ఎదిగే పిల్లల కోసం..!

లాయర్‌గా కొంత కాలం ప్రాక్టీస్‌ చేశారు. కానీ తల్లి అయ్యాక అనుకోకుండా వ్యాపారవేత్తగా మారారు. ‘ది గ్రోయింగ్‌ జిరాఫీ’ పేరుతో ఆరోగ్యకరమైన స్నాక్స్‌ తయారుచేసే వ్యాపారాన్ని ప్రారంభించి విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు కోల్‌కతాకు చెందిన రుక్మిణీ బెనర్జీ. ఆ విశేషాలు ఇవి...


జీవితంలో అనుకున్నవన్నీ జరగవు. పరిస్థితులకు అనుగుణంగా మారి, పోరాడినప్పుడే విజయతీరాలకు చేరుకోగలం. ఇందుకు మంచి ఉదాహరణ రుక్మిణి బెనర్జీ జీవితం. కోల్‌కతాకు చెందిన రుక్మిణి న్యాయవిద్య పూర్తి చేశారు. తరువాత కొన్నేళ్ల పాటు వివిధ న్యాయ సంస్థల్లో పనిచేశారు. లండన్‌కు వెళ్లి మాస్టర్స్‌ డిగ్రీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 2017లో మెటర్నిటీ లీవ్‌తో ఇంటికే పరిమితమైన రుక్మిణి జీవితం అనుకోకుండా మరోవైపు మళ్లాల్సి వచ్చింది. తల్లిగా మారబోతున్న తను పిల్లల కోసం ఆరోగ్యకరమైన  స్నాక్స్‌ను అందించే వ్యాపారాన్ని అందించాలనే ఆలోచన అనుకోకుండా తట్టింది. కొడుకు ఆరవ్‌ పుట్టిన తరువాత తన ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు. ‘‘చాలా మంది పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురి కావడం చూశాను. నా కొడుకు విషయంలో అలా జరగకూడదని నిర్ణయించుకున్నాను. ఇమ్యునిటీ పెరగడానికి సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడంపై దృష్టి పెట్టాను’’ అని అంటారు రుక్మిణి. ఈ క్రమంలో ఆమె ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నారు. చాలా కంపెనీలు హెల్తీ ప్రోడక్ట్స్‌ పేరుతో అప్పటికే మార్కెట్లో ఉన్నాయి. కానీ అవన్నీ షుగర్‌, రిఫైన్డ్‌ ఫ్లోర్‌తో తయారుచేస్తున్నాయని రుక్మిణి గమనించారు. ‘‘నా కొడుకు అవసరమైన హెల్తీ ప్రోడక్ట్‌ కోసం చాలా తిరిగాను. కానీ ఎక్కడా దొరకలేదు. అప్పుడే ‘ది గ్రోయింగ్‌ జిరాఫీ’ ప్రారంభించాను. తల్లులందరూ వాళ్ల పిల్లలు మంచి ఎత్తు పెరగాలని కోరుకుంటారు. అందుకే నా ఉత్పత్తులకు జిరాఫీ పేరును, బొమ్మను పెట్టాను’’ అని తన వ్యాపార ప్రయాణాన్ని పంచుకుంటారు రుక్మిణి. 




ఎన్నో సవాళ్లు...

వ్యాపారమైతే ప్రారంభించాక గానీ అందులో ఉండే ఇబ్బందులు ఏంటో రుక్మిణికి తెలిసి రాలేదు. ఇంట్లోనే బీట్‌రూట్‌ ఇడ్లీ లాంటివి తయారుచేసి ఆన్‌లైన్‌ ఆర్డర్‌పై అందించాలని అనుకున్నారు. కానీ ఒక్క ఆర్డర్‌ కూడా రాలేదు. అయితే తొందరలోనే రుక్మిణి రియలైజ్‌ అయ్యారు. తను కోరుకున్న సెగ్మెంట్‌ అది కాదని తెలుసుకున్నారు. తరువాత కుకీస్‌ తయారీ మొదలుపెట్టారు. ‘‘హెల్తీ కుకీస్‌ ఎలా తయారుచేయాలో తెలుసుకున్నాను. అదే సమయంలో పిల్లలు ఇష్టపడేలా రుచిగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్చుకున్నాను. రెండు లక్షల రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించాను. స్నేహితుల నుంచి, సోషల్‌ మీడియా నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటూ మార్పులు చేశాను. ముఖ్యంగా మదర్స్‌ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ మార్కెట్లో మా బ్రాండ్‌ విలువ పెరగడానికి ఎంతో దోహదపడింది. వాళ్ల పిల్లలకు ఏదైతే కావాలని కోరుకున్నారో అది సరిగ్గా అందించగలిగాను’’ అని తన వ్యాపారసూత్రాన్ని చెబుతారు రుక్మిణి. గత ఏడాది డిసెంబర్‌లో మరో రెండు కుకీస్‌, హెల్త్‌బార్‌ల తయారీని ప్రారంభించారామె. అనుకోకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారినా ఈ జర్నీ బాగుందని అంటారు రుక్మిణి. ఆమె తయారుచేస్తున్న కుకీ్‌సలలో రాగి కుకీస్‌, కాకో పీనట్‌ బటర్‌ బార్స్‌కు మంచి డిమాండ్‌ ఉంది. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌ పుష్కలంగా లభించే ఈ స్నాక్స్‌ పిల్లలకు మంచి పోషకాహారం. అందుకే త్వరగా తల్లుల అభిమానాన్ని చూరగొని, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు రుక్మిణి.

Updated Date - 2021-04-21T05:30:00+05:30 IST