మరోసారి అధ్యక్ష బరిలో ట్రంప్.. ఈ నెల 28న ప్రకటన?

ABN , First Publish Date - 2021-02-23T16:51:20+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 ఎన్నికల్లో మరోసారి అధ్యక్ష బరిలో నిలవనున్నట్టు తెలుస్తోంది.

మరోసారి అధ్యక్ష బరిలో ట్రంప్.. ఈ నెల 28న ప్రకటన?

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 ఎన్నికల్లో మరోసారి అధ్యక్ష బరిలో నిలవనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 28న ఆయన బహిరంగ ప్రకటన చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 28న జరిగే కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్(సీపీఏసీ) వార్షిక సమావేశంలో ట్రంప్ పాల్గొననున్నారు. 2024 ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష నామినీ తానేనంటూ ట్రంప్ ఈ సమావేశంలో ప్రకటించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునే సమయంలోనే ట్రంప్ మరోమారు అధ్యక్షుడిగా పోటీ చేయనున్నట్టు పరోక్షంగా సూచనలిచ్చారు. అమెరికన్ల కోసం తాను పోరాడుతూనే ఉంటానంటూ అధ్యక్షుడిగా బాధ్యతల నుంచి తప్పుకునే రోజు ఆయన చెప్పారు. 


వైట్‌హౌస్‌ను వీడిన తరువాత ట్రంప్ బయట ఎక్కడా కనిపించలేదు. ఇటీవల సెనెట్‌లో అభిశంసన విచారణ నుంచి నిర్దోషిగా తేలిన తర్వాత ట్రంప్ మాట్లాడుతూ.. త్వరలోనే కార్యాచరణతో ప్రజల ముందుకు వస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. రిపబ్లిక్ పార్టీలో ట్రంప్ పలుకుబడిని తగ్గించేందుకు ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికి ట్రంప్‌కు రిపబ్లికన్ పార్టీలో మెజారిటీ సభ్యుల నుంచి గట్టి మద్దతు ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. రిపబ్లికన్ పార్టీలో 54 శాతం మంది ట్రంప్ మరోమారు అధ్యక్ష బరిలో నిలవాలని కోరుకుంటున్నట్టు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.   

Updated Date - 2021-02-23T16:51:20+05:30 IST