వైసీపీ నేతల చేతివాటం!

Jun 23 2021 @ 00:22AM
దళితుల వద్ద నుంచి లేఅవుట్‌ల కోసం ప్రభుత్వం తీసుకున్న అసైన్డుభూమి

దళిత రైతులను మోసం చేసిన చోటా నాయకులు

అసైన్డ్‌ భూమి పరిహారం నుంచి రూ.18 లక్షలు నొక్కేసిన వైనం

ఇద్దరిని పావులుగా వాడుకున్నట్టు ప్రచారం

ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు

న్యాయం చేయాలని పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు


కశింకోట/మునగపాక, జూన్‌ 22:


వారంతా దళితులు...ప్రభుత్వం ఇచ్చిన భూమిని అనాదిగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల వారి భూములను పేదలకు ఇళ్ల స్థలాల కోసం రెవెన్యూ అధికారులు సేకరించారు. ఎకరాకు రూ.25 లక్షల మేర నష్టపరిహారంగా నిర్ణయించారు. దళితులకు భారీ మొత్తంలో డబ్బులు వస్తుండడంతో..వీరిపై అధికార పార్టీకి చెందిన చోటా నాయకుల కన్నుపడింది. అదే గ్రామానికి చెందిన ఇద్దరు దళితులను పావులుగా వాడుకున్నారు. పరిహారం చెక్కులను బ్యాంకులో వేయడానికి ఖాతాలు తెరిపించే సమయంలో ఓచర్‌ ఫారాలపై రైతులతో వేలిముద్రలు వేయించుకున్నారు. ఆనక ఆయా రైతుల ఖాతాల నుంచి రూ.18 లక్షలు సదరు ఇద్దరు దళితుల ఖాతాల్లోకి బదలాయించారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ అనకాపల్లి ఆర్డీవో, కశింకోట తహసీల్దారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన బాధిత దళిత రైతులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


కశింకోట మండలం తేగాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 103లో మునగపాక మండలం గంటవానిపాలెం గ్రామానికి చెందిన కొర్రాయి మాణిక్యం, మోసా రాజులమ్మ, మోసా అప్పన్న, గారా అప్పనర్స, కంఠం నాగ అప్పారావు, బంగారి రాజులకు 60 సెంట్ల చొప్పున అసైన్డు భూమి ఉంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ భూములు సేకరిస్తున్నట్టు రెవెన్యూ అఽధికారులు చెప్పడంతో దళితులు సరేనన్నారు. దీంతో అధికారులు భూములను సేకరించి, ప్రభుత్వం నిర్ణయించిన ఎకరాకు రూ.25 లక్షల ధర ప్రకారం ఒక్కొక్క లబ్ధిదారునికి రూ.15 లక్షల చొప్పున పరిహారాన్ని చెక్కుల రూపంలో ఈ ఏడాది జనవరిలో అందజేశారు. విషయం తెలుసుకున్న కశింకోట మండలానికి చెందిన ఇద్దరు అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. గంటావానిపాలేనికి చెందిన ఇద్దరు దళితులను పావులుగా మార్చుకున్నారు.  లబ్ధిదారులతో అనకాపల్లిలోని డీసీసీబీలో ఖాతాలు తెరిపించి, దానిలో చెక్కులు డిపాజిట్‌ చేయించాలని, ఆ సమయంలో ఖాళీ ఓచర్లపై సంతకాలు తీసుకోవాలని చెప్పారు. కథ మొత్తం వారు చెప్పినట్టే నడిచింది. ప్రభుత్వం మంజూరు చేసిన నష్టపరిహారం సొమ్ము జనవరి 25వ తేదీన ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యింది. మరో మూడు రోజుల్లో (28వ తేదీన) వారి ఖాతాల నుంచి మూడేసి లక్షల రూపాయల చొప్పున మొత్తం 18 లక్షల రూపాయలు గంటవానిపాలెం గ్రామానికి చెందిన భీమునిపల్లి సన్యాసిరావు, కొర్రాయి రాము బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అయ్యింది. బ్యాంకు ఖాతా తెరిచే సమయంలో పై ఇద్దరు తమతో ఏదో కాగితాలపై వేలిముద్రలు వేయించారని, చదువు రాకపోవడంతో జరిగిన మోసాన్ని గుర్తించలేకపోయామని బాధితులు ఇప్పుడు వాపోతున్నారు. పైగా జనవరిలో బ్యాంకు ఖాతాలు తెరవగా, నెల క్రితం వరకు తమకు బ్యాంకు ఖాతా పాసు పుస్తకాలు ఇవ్వలేదని చెప్పారు. ఇటీవల బ్యాంకుకు వెళ్లి పాసు పుస్తకం అప్‌డేట్‌ చేయించగా తమ ఖాతాల్లో నుంచి మూడు లక్షల రూపాయల చొప్పున వేరే వాళ్ల ఖాతాలకు (భీమునిపల్లి సన్యాసిరావు, కొర్రాయి రాము) మళ్లినట్టు తెలిసిందన్నారు. దీనిపై సన్యాసిరావు, రాములను నిలదీసి, డబ్బులు అడగ్గా రేపు, మాపు అంటూ తిప్పుతున్నారని వాపోయారు. దీంతో న్యాయం కోసం పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. 


రూ.3 లక్షలు వాళ్లే నొక్కేశారు

కొర్రాయి మాణిక్యం, గంటవానిపాలెం


నాకు తేగాడ సర్వే నంబరు 103లో 60 సెంట్ల భూమి ఉంది. ఇళ్ల స్థలాల కోసం సేకరిస్తున్నామని రెవెన్యూ అధికారులు చెప్పడంతో అంగీకరించాను. 60 సెంట్లకు రూ.15 లక్షలు వస్తుందని చెప్పి చెక్కు అందజేశారు. అనకాపల్లి బ్యాంకులో ఖాతా తెరిచి, చెక్కు డిపాజిట్‌ చేశాను. ఇటీవల బ్యాంకుకు వెళ్లి ఖాతాలో డబ్బుల గురించి ఆరా తీస్తే రూ.12 లక్షలే ఉన్నాయి. మాతో బ్యాంకు ఖాతాలు తెరిపించిన వారే ఈ రూ.3 లక్షలు తీసుకున్నట్టు తెలిసింది. ఇదేమిటని నిలదీస్తే సరైన సమాధానం చెప్పడం లేదు. దీంతో రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశాం.


ఓచర్లపై వేలిముద్రలు వేయించుకుని మోసం చేశారు

మోసా రాజులమ్మ, గంటవానిపాలెం


బ్యాంకులో ఖాతా తెరవడానికి దరఖాస్తుపై వేలిముద్రలు వేసేటప్పుడు ఓచర్లపైనా  వేలిముద్రలు వేయించుకున్నారు. బ్యాంకు పాసు పుస్తకాలు వారిదగ్గరే(దళారులు) ఉంచుకున్నారు. ఇటీవల పుస్తకాలు ఇవ్వడంతో వాటిల్లో రూ.12 లక్షలే వున్నట్టు తెలుసుకుని విస్తుపోయాం. ఆ రోజు మాతో ఓచర్లపై వేలిముద్రలు వేయించుకున్నది మోసం చేయడానికే అని ఇప్పుడు తెలిసింది. అధికారులు న్యాయం చేయాలి.


నోటీసులు ఇచ్చాం, పోలీసులకు ఫిర్యాదు చేశాం

బత్తుల సుధాకర్‌, తహసీల్దార్‌, కశింకోట


ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూమికి సంబంధించి పరిహారం పూర్తిస్థాయిలో అందలేదంటూ మునగపాక మండలం గంటవానిపాలెం గ్రామానికి చెందిన ఆరుగురు దళితులు మాకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాం. దళితుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులను ఇతర ఖాతాలకు మళ్లించిన వారికి నోటీసులు జారీ చేశాం.. వారిపై కశింకోట పోలీసుస్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాం. బాధితులకు న్యాయం చేస్తాం.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.