మార్మోగిన ‘జనగణమన’

ABN , First Publish Date - 2022-08-17T06:55:19+05:30 IST

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సామూహిక ‘జనగణమన’ జిల్లాలో మార్మోగింది. జిల్లా వ్యాప్తంగా వాడవాడలా జనగణమన గీతాన్ని ఉదయం 11.30 గంటలకు నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, ప్రజ లు ఎక్కడికక్కడ నిర్దిష్ట సమయానికి జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటారు.

మార్మోగిన ‘జనగణమన’

ప్రధాన కూడళ్లలో సామూహిక ‘జనగణమన’   

జిల్లా వ్యాప్తంగా జాతీయ గీతాలాపన

ప్రత్యేక ఆకర్షణగా ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు   

నేడు రక్తదాన శిబిరాలు, ఫ్రీడం కప్‌ క్రీడాపోటీలు

సామూహిక జాతీయ గీతాలాపన చరిత్రాత్మకం: కలెక్టర్‌


నిజామాబాద్‌ అర్బన్‌/న్యూస్‌ నెట్‌వర్క్‌, ఆగస్టు 16: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సామూహిక ‘జనగణమన’ జిల్లాలో మార్మోగింది. జిల్లా వ్యాప్తంగా వాడవాడలా జనగణమన గీతాన్ని ఉదయం 11.30 గంటలకు నిర్వహించారు. అధికారులు,  ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత,  ప్రజ లు ఎక్కడికక్కడ నిర్దిష్ట సమయానికి జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటారు. నివాస ప్రాంతాలు మొదలుకొని ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార వాణిజ్యసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు, ప్రధాన కూడళ్లు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, తదితర ప్రదేశాల్లో సామూహిక గీతాలాపన చేసి రికార్డు సృష్టించారు. జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, ఏసీపీ వెంకటేశ్వర్‌ తదితరులు నగరంలోని నెహ్రూపార్కు చౌరస్తాలో వందలాది మంది విద్యార్థులు, స్థానికులు, వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్నవారు గీతాలాపనలో పాల్గొన్నారు. ఓల్డ్‌ ఎల్‌ఐసీ చౌరస్తా వద్ద జరిగిన జాతీయ గీతాలాపనలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, టీఎన్‌జీవో నాయకులు పాల్గొన్నారు. కంఠేశ్వర్‌ బైపాస్‌ వద్ద జరిగిన జాతీయ గీతాలాపనలో ‘నుడా’ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, పూలాంగ్‌ వద్ద జోయాలుక్కాస్‌ షోరూం వద్ద జరిగిన గీతాలాపనలో డీఈవో దుర్గాప్రసాద్‌ జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. పూలాంగ్‌ వద్ద, కాకతీయ విద్యాసంస్థల్లో జరిగిన జాతీయ గీతాలాపనలో    పెద్ద సంఖ్యలో విద్యార్థులు   పాల్గొన్నారు. వినాయక్‌నగర్‌ రాజీవ్‌గాంధీ విగ్రహం, ఆర్‌ఆర్‌ చౌరస్తా, శివాజీచౌక్‌ వద్ద జరిగిన జాతీయ గీతాలాపనలో టౌన్‌ సీఐ కృష్ణ, 1వ టౌన్‌ ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు, 3వ టౌన్‌ ఎస్సై సాయినాథ్‌, తదితరులు పాల్గొన్నారు. ప్రతిచోట ‘వందేమాతరం.. భారత్‌మాతాకీ జై..’ వంటి నినాదాలతో ప్రధాన కూడళ్లన్నీ మార్మోగాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా నెహ్రూ పార్కు వద్ద జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజలంతా ఒకే సమయంలో జాతీయ గీతాలాపనలో పాల్గొనడం చరిత్రాత్మకమని స్వతంత్ర భారతదేశంలో బహుశా ఇదివరకు ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకల్లో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని వారి భాగస్వామ్యంతో జిల్లా ముందంజలో ఉందన్నారు. ఈ నెల  21వ తేదీ వరకు జరిగే మిగిలిన కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాలన్నారు. బుధవారం చేపట్టనున్న రక్తదాన శిబిరం, ఫ్రీడం కప్‌ క్రీడాపోటీల్లో పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. అలాగే ఇందల్‌వాయి టోల్‌ప్లాజా వద్ద ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు ఎమ్మెల్సీ వీజీగౌడ్‌, బోధన్‌లో ఎమ్మెల్యే షకీల్‌తోపాటు అధికారాలు, ప్రజాప్రతినిధులు జాతీయ గీతాన్ని ఆలపించారు. 

Updated Date - 2022-08-17T06:55:19+05:30 IST