ఘనంగా ప్రారంభమైన కుప్పం గంగజాతర

ABN , First Publish Date - 2022-05-19T06:34:07+05:30 IST

ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాలు బుధవారంనాడు గణపతి ఉత్సవంతో ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలోని ముత్తుమారెమ్మలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు జరిపారు.

ఘనంగా ప్రారంభమైన కుప్పం గంగజాతర
గంగమ్మ అమ్మవారికి పుష్పమాల సేవ

కుప్పం, మే 18:  ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాలు బుధవారంనాడు గణపతి ఉత్సవంతో ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలోని ముత్తుమారెమ్మలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు జరిపారు. అలాగే గంగమ్మ ఆలయంలో శిరస్సు లేని గంగమ్మ సశేష శరీరాన్ని కూడా ప్రత్యేకంగా అలంకరించారు. ఆమె ముందు చిన్నపాటి విగ్రహానికి పూజలు చేశారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రాత్రి గణపతి విగ్ర హాన్ని పట్టణంలో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో బారులుతీరి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మంజునాథ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో ఎమ్మెల్సీ భరత్‌, రెస్కో చైర్మన్‌ సెంథిల్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌తోపాటు పలువురు పట్టణ ప్రముఖులు, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, ప్రతిజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.  ఈనెల 19వ తేదీన ఊరేగింపు, 20న ముత్తుమారెమ్మకు శేషవాహన సేవ,  అన్నదానం, 21న సింహావాహన సేవ, 22న అశ్వవాహన సేవ నిర్వహిస్తారు. 23న ముత్తుమారెమ్మకు తెర తొలగించి పూజారాధన చేస్తారు. ఆ రోజు సాయంత్రం అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. 24న గంగమాంబ శిరస్సు ఊరేగింపు, 25వ తేదీన అమ్మవారి దివ్యరూప దర్శనం ఉంటాయి. అదేరోజు రాత్రి గంగమ్మ అమ్మవారు జలావాసం చేస్తారు.



జాతర నిర్వహణపై డీఎస్పీ సమీక్ష


జాతర ప్రశాంతంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని పలమనేరు డీఎస్పీ గంగయ్య కోరారు. బుధవారం ఆయన  రెవెన్యూ, మున్సిపల్‌, తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. గంగమ్మ ఆలయాన్ని, జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ... ఈనెల 25వ తేదీ వరకు జరిగే జాతరకు రాష్ట్రంనుంచే కాక, పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలనుంచి భక్తులు  తరలివవచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే రెవెన్యూ, మున్సిపల్‌ తదితర శాఖల  సిబ్బంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు.  జాతరకు తరలివచ్చే మహిళా భక్తులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరించారు.  ఆలయంలో ప్రత్యేక క్యూలు, తగినన్ని సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని జాతర నిర్వాహకులకు సూచించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే స్వాగత ఆర్చీలు, విద్యుద్దీప కటౌట్లు పటిష్ఠంగా ఉండాలన్నారు. విద్యుద్ఘాతాలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రెస్కో అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో రెస్కో చైర్మన్‌ జీఎస్‌.సెంథిల్‌కుమార్‌, గంగమ్మ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ కేఏ.మంజునాథ్‌,  తహసీల్దారు సురేశ్‌బాబు,  అర్బన్‌ సీఐ శ్రీధర్‌, మున్సిపల్‌ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది  పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T06:34:07+05:30 IST