Advertisement

కమ్మని కషాయాలు!

Nov 17 2020 @ 00:03AM

చలికాలంలోకి అడుగు పెట్టాం! చల్లని వాతావరణం అన్ని రకాల వైరస్‌లతో పాటు కరోనాకూ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో వేధించే మహమ్మారుల నుంచి తప్పించుకోవాలంటే శరీరానికి వేడిని అందించి, ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడే కషాయాలను తయారుచేసుకుని తాగుతూ ఉండాలి.


కషాయ నియమాలు

 1. శీతాకాలం వేధించే తాత్కాలిక సమస్యల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల దాకా వేటికైనా కషాయాలు వాడవచ్చు. 
 2. ఏ కషాయమైనా పరగడుపునే తీసుకోవాలనేది ఒక సూత్రం. అంటే, ఉదయం లేదా రాత్రి ఎప్పుడైనా భోజనానికి కనీసం అరగంట ముందు తీసుకోవాలి. 
 3. కషాయాల్లో కొన్ని  రెండు మూడు రోజులు లేదా వారం మాత్రమే వాడుకునేవి ఉంటాయి. మరికొన్ని ఇతర కషాయాలు దీర్ఘకాలం పాటు వాడుకునేవిగా ఉంటాయి. 
 4. దీర్ఘకాలం  పాటు వాడాల్సి ఉన్నప్పుడు వరుసగా 40 రోజులు తీసుకోవాలి. ఆ తర్వాత కూడా వాడాల్సి వస్తే, మధ్యలో ఓ 10 రోజుల పాటు మానేసి, ఆ తర్వాత మళ్లీ 40 రోజుల పాటు తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కాలం వాడాల్సి వచ్చినప్పుడు కూడా మధ్య మధ్యలో ఓ వారం 10 రోజులు వ్యవధి ఇవ్వాలి. మధ్య మఽధ్య అలా ఆపకపోతే, శరీరం ఆ మందులకు బాగా అలవాటుపడిపోయి, ప్రతిస్పందించడం మానేస్తుంది.
 5. కషాయాల్ని రెండు పూటలా తీసుకోవలసి ఉంటే రోజూ రెండుసార్లు తయారు చేసుకోవడం కష్టమే అవుతుంది. అలాంటి వారు, ఉదయమే రెండు పూటలకు సరిపడా తయారు చేసుకోవవచ్చు. ఉదయం అందులోంచి సగ భాగం తీసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగే యాలి. మిగతా సగభాగాన్ని ఆరేడు గంటల వ్యవధిలో అంటే సాయంత్రం తీసుకోవచ్చు. కాకపోతే, కషాయాన్ని గోరువెచ్చగా చేసుకుని తాగాలి. ఏ కషాయాన్నయినా చల్లగా ఎప్పుడూ తాగకూడదు. 
 6. 500 మి. లీ. నీళ్లు తీసుకుంటే, నాలుగు చెంచాల పొడి కలిపి సన్నని మంటపైన మరిగించాలి. కాస్త వెడల్పయిన పాత్రలో ఉడికిస్తూ, మూత తీసి ఉంచాలి. ఆ నీళ్లు నాలుగో వంతు మిగిలేదాకా మరిగించి మంట ఆపేసి, చల్లార్చి, పల్చని బట్టతో వడబోయాలి. సన్నని టీ- ఫిల్టర్‌తో వడబోయవచ్చు.


 

కుంకుమపువ్వు కషాయం!

చలికాలంలో రొంప, దగ్గులు దాడి చేయకుండా శరీరానికి రక్షణ కల్పించే కషాయం ఇది. ఊపిరితిత్తులను శుభ్రపరిచి, ఉబ్బసం, సైనస్‌ల నుంచి కూడా విముక్తి కల్పిస్తుంది. 


కావలసిన పదార్థాలు:

 1. కుంకుమ పువ్వు -  చిటికెడు
 2. యాలకులు - 4
 3. దాల్చినచెక్క పొడి - చిటికెడు
 4. దంచిన అల్లం - పావు చెంచా
 5. నీళ్లు - రెండు కప్పులు


తయారీ విధానం:

 1. నీళ్లలో పైన చెప్పిన దినుసులన్నీ వేసి మధ్యస్తమైన మంట మీద ఉడికించాలి. 
 2. 3 నిమిషాల తర్వాత పొయ్యి నుంచి దించి, చల్లార్చాలి.
 3. తీపి కోసం ఒక చెంచా తేనె కలుపుకొని తాగాలి.


పుదీనా కషాయం!

శ్వాసకోస వ్యవస్థను శుద్ధి చేసి, ఊపిరితిత్తుల్లో కఫం పేరుకోకుండా చేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచి గాలిలో వ్యాపించిన వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ప్రాణ, సత్వ గుణాలను మెరుగుపరిచి, భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. పిత్త దోషం కలిగిన వారు శీతాకాలంలో తప్పక తీసుకోవలసిన కషాయం ఇది.


కావలసిన పదార్థాలు: 

 1. పుదీనా ఆకులు - 6
 2. తులసి ఆకులు - 6
 3. నిమ్మగడ్డి - 4 పరకలు
 4. నీళ్లు - రెండు కప్పులు
 5. ఉప్పు లేదా తేనె - రుచికి సరిపడా


తయారీ విధానం:

 1. నీళ్లు వేడి చేయాలి.
 2. చిన్న మంట మీద నిమిషం పాటు వేడి చేసిన తర్వాత పుదీనా, తులసి, తరిగిన నిమ్మగడ్డి వేసి కలపాలి.
 3. ఉప్పు కలపాలి. లేదా కషాయం తయారైన తర్వాత తేనె కలపాలి.
 4. ఈ నీటిని వడగట్టి, తాగాలి.

తులసి కషాయం

కృష్ణ తులసి, విష్ణు తులసి... ఈ రెండింటిలో దేనితోనైనా కషాయం తయారుచేసుకుని తాగవచ్చు. దీనికి అల్లం, మిరియాలు జోడిస్తే శీతాకాలం వేధించే రుగ్మతలు దూరంగా ఉంటాయి.


కావలసిన పదార్థాలు:

 1. తులసి ఆకులు - గుప్పెడు
 2. అల్లం, అర అంగుళం ముక్క
 3. మిరియాలు - అర చెంచా
 4. నీళ్లు - ఒక కప్పు


తయారీ విధానం:

 1. తులసి ఆకులను శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి.
 2. అల్లం దంచి పెట్టుకోవాలి.
 3. బాండీలో మిరియాలను చిన్న మంట మీద వేగించాలి.
 4. బాండీలో నీళ్లు పోసి అల్లం వేసి వేడి చేయాలి.
 5. తులసి ఆకులు, మిరియాలు దంచుకోవాలి.
 6. ఈ దంచిన ముద్దను మరిగే నీటిలో వేసి కలపాలి.
 7. మూత ఉంచి, ముప్పావు వంతు వచ్చే వరకూ మరిగించాలి.
 8. చల్లారిన తర్వాత వడగట్టి తాగాలి.

శొంఠి కషాయం

శొంఠి ఊపిరితిత్తుల్లో పేరుకున్న కఫాన్ని బయటకు పంపిస్తుంది. శ్వాస అడ్డంకిని తొలగించి, జలుబు, దగ్గులు దరి చేరకుండా చేస్తుంది. 


కావలసిన పదార్థాలు:

 1. శొంఠి - రెండు అంగుళాల ముక్క
 2. మిరియాలు - 15
 3. తాటి బెల్లం - 4 చెంచాలు
 4. జీలకర్ర పొడి - చెంచా
 5. ధనియాలు - చెంచా
 6. తులసి ఆకులు - గుప్పెడు
 7. నీళ్లు - రెండు కప్పులు

తయారీ విధానం:

 1. శొంఠి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు మెత్తగా దంచుకోవాలి.
 2. ఈ మిశ్రమాన్ని, బెల్లంతో సహా నీళ్లలో కలిపి పొయ్యి మీద మరిగించాలి.
 3. మిశ్రమం మూడు వంతులకు తగ్గేవరకూ మరిగించి, చివర్లో తులసి ఆకులు వేయాలి.
 4. ఈ కషాయాన్ని వేడిగా ఉన్నప్పుడే సేవించాలి.
 5. పిల్లలకు ఇచ్చేటప్పుడు నీళ్లు కలిపి పల్చగా చేసి, తేనె కలిపి అందించాలి.

బియ్యం నీరు

అల్లం, మిరియాలు శరీరాన్ని వేడి చేసి కఫాన్ని కరిగించి, బయటకు వెళ్లగొడతాయి. రాతి ఉప్పు, సొంఠి వాత ప్రవాహాన్ని సమతుల్యం చేస్తుంది. 


కావలసిన పదార్థాలు:

 1. బియ్యం - 10 గ్రాములు
 2. నీళ్లు - 200 మి.గ్రా
 3. అల్లం తరుగు - పావు చెంచా
 4. నల్ల మిరియాలు - 5
 5. నువ్వుల నూనె - అర చెంచా
 6. సొంఠి - అర చెంచా
 7. రాతి ఉప్పు - అర చెంచా

తయారీ విధానం:

 1. బియ్యం కడిగి, నానబెట్టుకోవాలి.
 2. మిరియాలు దంచుకోవాలి.
 3. నువ్వుల నూనె వేడిచేసి, సొంఠి, అల్లం, మిరియాల పొడి వేసి రెండు నిమిషాలు వేయించాలి.
 4. నానబెట్టిన బియ్యాన్ని నీళ్లతో సహా వేయించిన మిశ్రమంలో పోయాలి.
 5. బియ్యం ఉడికేవరకూ కలిపి, చివర్లో రాతిఉప్పు కలిపి పొయ్యి నుంచి దించాలి.
 6. అలాగే రెండు నిమిషాలు పాత్రను కదపకుండా ఉంచాలి.
 7. ఈ నీటిని వడగట్టి తాగాలి.

కుంకుమపువ్వు

 1. యాంటీఆక్సిడెంట్‌
 2. కేన్సర్‌తో పోరాడే తత్వం
 3. నెలసరి నొప్పులు తగ్గించే గుణం
 4. అధిక బరువు తగ్గించే శక్తి


పుదీనా

 1. అజీర్తికి విరుగుడు
 2. మెదడు పనితీరు మెరుగు
 3. జలుబు నివారిణి
 4. నోటి దుర్వాసన తొలగించే గుణం


బియ్యం నీరు

 1. మలబద్ధకం తొలగించే తత్వం
 2. శరీర ఉష్ణోగ్రత స్థిరపరిచే శక్తి
 3. మనసు, శరీరాలకు సాంతన చేకూర్చే గుణం
 4. డీహైడ్రేషన్‌ అదుపు


శొంఠి

 1. వాంతులను అదుపుచేసే తత్వం
 2. చక్కెర స్థాయిని నిలకడగా ఉంచే గుణం
 3. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే శక్తి
 4. అజీర్తికి విరుగుడుతులసి

 1. యాంటీఆక్సిడెంట్‌
 2. ఆకలిని పెంచే గుణం
 3. పేగులు, మూత్రపిండాలకు రక్ష
 4. జలుబు, దగ్గులకు విరుగుడు

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
[email protected]dhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.