ఎలా ఎత్తేశారు?

Jun 23 2021 @ 02:30AM

జగన్‌పై కేసుల ‘క్లోజ్‌’పై హైకోర్టు నజర్‌

అనంత, గుంటూరుల్లో 11 కేసుల్ని నిబంధనలు పాటించకుండానే ఎత్తేశారని ఫిర్యాదులు

గత ఏడాది కొవిడ్‌ టైంలో గప్‌చు్‌పగా మూసివేత

దిగువ కోర్టుల నిర్ణయంపై హైకోర్టు కమిటీ విచారణ

అనంతలో 5, గుంటూరులో 6 కేసులపై నివేదిక

సుమోటోగా స్వీకరించిన కోర్టు... నేడు విచారణ


ఒక నాయకుడు ముఖ్యమంత్రి కాగానే... అంతకుముందున్న కేసులన్నీ ‘క్లోజ్‌’ అవుతాయా? కానే కావు! దీనికీ ఒక పద్ధతి ఉంది. నిబంధనలున్నాయి. ఎడాపెడా కేసుల ఎత్తివేత కుదరదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు చెప్పింది. కానీ... ఒక ముఖ్యమంత్రి తనపై ఉన్న కేసులను తానే ఎత్తివేయించుకున్న అరుదైన సందర్భమిది! ఆ ముఖ్యమంత్రి... వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి. 


జగన్‌పై నమోదైన 11 కేసులను గత ఏడాది కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఎత్తివేశారు. వీటిలో ఆరు గుంటూరు జిల్లాలో, ఐదు అనంతపురం జిల్లాలో నమోదయ్యాయి. పోలీసులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లతోపాటు దిగువ కోర్టులు హడావుడిగా... ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టుకు ఫిర్యాదులు అందాయి. దీనిపైనే హైకోర్టు కమిటీ విచారణ జరిపింది.


సెక్షన్‌ 321 ప్రకారం కోర్టు అనుమతి మేరకు నిందితుడిపై ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకోవచ్చు. అయితే... కేసు వివరాలను, వాస్తవాలను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సొంతంగా పరిశీలించాలి. బయటి వ్యక్తులు/శక్తుల ప్రభావానికి లోనుకాకూడదు. రాష్ట్ర ప్రభుత్వ ‘ఆదేశాల’ మేరకు నడుచుకోకూడదు. కేసుల ఉపసంహరణ విషయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ‘పోస్ట్‌ బాక్స్‌’లాగా వ్యవహరించకూడదు.  కోర్టు అధికారిగా కూడా ఉండే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఈ విషయంలో న్యాయబద్ధంగా వ్యవహరించాలి!

- సుప్రీంకోర్టు (శేవ్‌ నందన్‌ పాశ్వాన్‌ వర్సెస్‌ బిహార్‌ కేసులో)


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ముఖ్యమంత్రి జగన్‌పై అనంతపురం, గుంటూరు జిల్లాల్లో నమోదైన 11 కేసులను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తివేశారు. ఇప్పుడు ఈ అంశం హైకోర్టు పరిశీలనకు వచ్చింది. ఆ పదకొండు కేసుల ఎత్తివేత నిబంధనల ప్రకారమే జరిగిందా? ఇందులో లోటుపాట్లు ఉన్నాయా? అనే విషయాన్ని హైకోర్టు తేల్చనుంది. ఒకవేళ... కేసుల ఎత్తివేత వ్యవహారాన్ని పునఃసమీక్షించాలని న్యాయస్థానం భావిస్తే... అది పెద్ద సంచలనమే అవుతుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.


అసలేం జరిగింది?: అవినీతి, అక్రమాస్తుల కేసులు కాకుండా... జగన్‌పై రాష్ట్రవ్యాప్తంగా అనేక కేసులు నమోదయ్యాయి. ఉదాహరణకు... విపక్షంలో ఉండగా కృష్ణా జిల్లా నందిగామలో రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్‌ అప్పట్లో పోలీసు ఆంక్షలను ఉల్లంఘించారు. ఆస్పత్రిలోకి దూసుకెళ్లి... డాక్టర్ల చేతిలోని పత్రాలను లాక్కున్నారు. అప్పటి కలెక్టర్‌ అహ్మద్‌బాబును దుర్భాషలాడినట్లు జగన్‌పై కేసు నమోదైంది. జగన్‌ ముఖ్యమంత్రి కాగానే... ఆ కేసును ఎత్తివేశారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సామినేని ఉదయభానులతోసహా దాదాపు అన్ని జిల్లాల్లో అనేక మంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసులను ఉపసంహరింపచేశారు.


ఇందులో కొన్నింటిని జీవోలు జారీ చేసి ‘క్లోజ్‌’ చేయగా... మరికొన్నింటిని స్థానిక పోలీసు అధికారులే (ఎస్‌హెచ్‌వో) మూసివేశారు. జగన్‌పై నమోదైన పలు కేసుల్లో దిగువ కోర్టులు కేసు మెరిట్‌ను పరిశీలించకుండా, సరైన విధివిధానాలను పాటించకుండా ‘క్లోజ్‌’ చేసినట్లు హైకోర్టుకు ఫిర్యాదులు వచ్చాయి. ఇలా దిగువ కోర్టులపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించడానికి హైకోర్టులో ఒక ఉన్నతస్థాయి కమిటీ ఉంటుంది. జగన్‌పై ఎడాపెడా కేసులు ఎత్తివేశారంటూ అందిన ఫిర్యాదులను ఈ కమిటీ క్షుణ్నంగా పరిశీలించి... హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. బుధవారం ఇది ధర్మాసనం ముందుకు రానుంది. కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఈ  వ్యవహారాన్ని విచారణకు స్వీకరిచండంపై బుధవారం హైకోర్టు నిర్ణ యం తీసుకునే అవకాశముంది. జగన్‌పై అనంతపురం, గుంటూరు జిల్లాల్లో నమోదైన పదకొండు కేసుల ఎత్తివేత గురించి హైకోర్టు కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. ఈ 11 కేసుల్లో తొలి ప్రతివాదిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రెండో ప్రతివాదిగా ఎస్‌హెచ్‌వోని చేర్చారు. మూడో ప్రతివాదిగా ఒక్కో కేసులో ఒక్కొక్కరు(ఫిర్యాదుదారులు) ఉన్నారు. అన్ని కేసుల్లోనూ నాలుగో ప్రతివాదిగా జగన్‌ పేరే ఉంది.


ఎడాపెడా ఎత్తేశారు...: కేసుల ఎత్తివేత, ప్రాసిక్యూషన్‌ ఉపసంహరణ ఇష్టానుసారం చేయడం కుదరదు. మరీ ముఖ్యంగా ఒక కేసు ఎత్తివేసేటప్పుడు ఫిర్యాదుదారుడి అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అయితే, గత ఏడాది దేశమంతా కొవిడ్‌ లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు.. ఫిర్యాదుదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా కేసులు ఎత్తివేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో అత్యవసరమైన కేసులు మాత్రమే విచారణకు చేపట్టాలని హైకోర్టు కూడా దిగువ కోర్టులను ఆదేశించింది. కానీ, అత్యవసరం కాకున్నా నిబంధనలు పాటించకుండా ఈ కేసులు ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు ఫిర్యాదులు అందాయి. న్యాయస్థానం ఈ కేసుల పునర్విచారణకు ఆదేశిస్తే... ప్రభుత్వం ఏకపక్షంగా, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా ఎత్తివేసిన మరిన్ని కేసుల వ్యవహారం కూడా తెరమీదకు వచ్చే అవకాశం ఉంది.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.