హిజాబ్ వివాదం : రాజ్యంపై తిరుగుబాటు

Published: Fri, 23 Sep 2022 01:42:13 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హిజాబ్ వివాదం :  రాజ్యంపై తిరుగుబాటు

మైసూర్ యూనివర్శిటీలో నేను కొన్నాళ్ళు ఏంఏ సోషియాలజీ చదివాను. మొదటి సంవత్సరం వైవాకు కూడ అటెండ్ అయ్యాను. వైవా సందర్భంగా ‘అహమ్మద్ మొహిద్దీన్ ఖాన్ యజ్దానీ’ అని నన్ను పిలిచి ప్రొఫెసర్ ఒక ప్రశ్న వేశారు. ‘ప్రపంచ ఆధునీకరణకు ముస్లిం దేశాల్ని భారమితిగా ఎందుకు పరిగణిస్తారు? అనేది ఆ ప్రశ్న. దానిని విని నేను కొంత కంగారుపడ్డాను. మొదటిది; నేను అప్పటికే ‘డానీ’ అనే పిలుపుకు అలవాటు పడిపోయాను. రెండోది; నేను ముస్లిం కాబట్టి ముస్లింలకు సంబంధించిన ప్రశ్న వేశారని కొంచెం ఇబ్బందిగానూ ఫీల్ అయ్యాను. మూడోది; అప్పటికి ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. దాన్ని సిలబస్‌లోనూ ఎక్కడా చెప్పలేదు.


బిక్కముఖం వేసుకుని నిలబడడం కన్నా, మరో ప్రశ్నలో అదృష్టాన్ని పరిశీలించుకుందామని ‘పాస్‌’ అన్నాను. వారు మరో ప్రశ్న వేశారు. ‘ఊరేగింపులు, ఉత్సవాల్లో మనుషులు తమ శక్తికి మించిన ఉత్సాహంతో పాల్గొంటారు. ఎందుకు?’ అని అడిగారు. అది ఎమిలీ డర్ఖేమ్ ‘సంఘీభావం’కు సంబంధించిన ప్రశ్న అని అర్థం అయిపోయింది. మార్క్స్ తరువాత నాకు ఇష్టమైన సమాజశాస్త్రజ్ఞుడు డర్ఖేమ్. పైగా జీవితంలోనూ, విద్యాలయంలోనూ నాకు ఇష్టమైన అంశం సంఘీభావం. నా శక్తి మేరకు సాలిడారిటీని వివరించాను. పాస్ మార్కులు వచ్చాయి. వైవా అయిపోయాక కూడ ఆ మొదటి ప్రశ్న మీద నా ఆసక్తి తగ్గలేదు. ఆ ప్రొఫెసర్ ఛాంబరుకు వెళ్ళి నాకు జ్ఞానబోధ చేయమని అడిగాను. నేను చూపించిన ఆసక్తికి ఆయన చాలా సంతోషించారు. ఆ ప్రశ్నకు చాలా సుదీర్ఘమయిన వివరణ ఇచ్చారు.


‘‘ఏ దేశంలో అయినా ఏదైనా మతాచారంగానీ, సంస్కృతిగానీ మారాలంటే సాధారణంగా అనేక సంవత్సరాలు పడుతుంది. దశాబ్దాలు గడిచిపోతాయి. కొన్నిసార్లు శతాబ్దాలూ పట్టవచ్చు. కానీ పశ్చిమాసియా దేశాలు అందుకు భిన్నం. ఉదాహరణకు ఇరాన్‌ను చూడు. అక్కడ రాత్రికి రాత్రి సర్వం మారిపోతుంది. ఒకడు అధికారానికి రాగానే పశ్చిమ దేశాల సంస్కృతిని అలవర్చుకోవాలని ప్రకటిస్తాడు. అంటే ‘ఆధునికత’ అన్నమాట. అంతే.. రాత్రికి రాత్రి అక్కడ అంతా మారిపోతుంది. బార్లు, పబ్బులు, క్లబ్బులు, జీన్స్, టీ షర్ట్స్, బీచ్ పార్టీలు, పేకాట క్లబ్బులు, కేసినోలు అన్నీ వచ్చేస్తాయి. ఇంకో పదేళ్లకు దీనికి వ్యతిరేకంగా మళ్ళీ ఇంకొకడు అధికారానికి వస్తాడు. తూర్పు దేశాల సంస్కృతిని పరిరక్షించాలంటాడు. అంటే ‘ఛాందసం’ అన్నమాట. వెంటనే పైన చెప్పినవన్నీ పోతాయి. మతాచారాలు మరింత ఛాందస రూపంలో అమలవడం మొదలవుతుంది. ఇది తూర్పు దేశాల సంస్కృతి అన్నమాట. అందుచేత ప్రపంచంలో తూర్పుగాలి వీస్తున్నదో, పశ్చిమగాలి వీస్తున్నదో తెలుసుకోవాలంటే పశ్చిమాసియా దేశాలను, మరీ ముఖ్యంగా ఇరాన్ పరిణామాలను అధ్యయనం చేయాలి’’ అన్నారు. ఇప్పుడు ఇరాన్‌లో మహిళలు సాగిస్తున్న హిజాబ్ వ్యతిరేక నిరసన ప్రదర్శనల గురించి వింటున్నపుడు ఆనాటి మా ప్రొఫెసర్ మాటలు గుర్తుకొచ్చాయి. అయితే, ఆనాడు నాకు రాని సందేహాలు అనేకం ఇప్పుడు వస్తున్నాయి.


ప్రపంచమతాలన్నీ ఆసియా ఖండంలోనే పుట్టాయన్నది మనం ఈ సందర్భంగా గుర్తు పెట్టుకోవాలి. ‘దేశాధినేత ఆదేశాల మేరకు మతాలు పుట్టవు. ప్రజల్లో బలంగా ఉండే మతభావనలనే దేశాధినేతలు క్రోడీకరించి ఒక మతంగా మారుస్తారు’ అని ఓ సందర్భంలో ఫ్రెడరిక్ ఏంగిల్స్ అన్నాడు. అంచేత, ఇరాన్‌లో పశ్చిమగాలులు వీస్తున్నప్పుడు దేశాధినేత హిజాబ్ తీసేయమని ఆదేశించగానే ఇరాన్ మహిళలందరూ హిజాబ్‌లు తీసేశారా? తీయరు. కొందరయినా దాన్ని ప్రతిఘటించి ఉంటారు. ప్రతిఘటించారు కూడా. ఎందుకంటే రాజ్యానికీ ప్రజలకు మధ్య నిరంతరం ఒక వైరం ఉంటుంది. హిజాబ్ ఒక మాధ్యమం మాత్రమే అసలు సంగతి రాజ్యం. రాజ్యం మీద నిరసన.


కేన్సర్ ట్రీట్‌మెంటు కారణంగా జుట్టు ఊడిపోయిన వారికి సంఘీభావం తెలుపడానికి కొందరు తమ జుట్టును తీసేస్తారు. ఇది సంఘీభావం. దాన్ని తిరగేస్తే నిరసన. ఇప్పుడు ఇరాన్‌లో తూర్పుగాలులు వీస్తున్నాయి. దేశాధినేత హిజాబ్‌ను ధరించి తీరాలంటున్నారు. రాజ్యాన్ని ప్రశ్నించేవాళ్ళు టోకెన్ ప్రొటెస్ట్‌గా అయినా నడిరోడ్డు మీద నిలబడి హిజాబ్ తీసేస్తారు. పొడుగాటి జుట్టును విరబోసుకుంటూ నడివీధుల్లో తిరుగుతారు. ఇప్పుడు ఇరాన్ మహిళలు ఆ పనే చేస్తున్నారు.


ఇది పైకి మతవ్యవహారంగా కనిపిస్తున్నప్పటికీ సారాంశంలో ఇది రాజ్యం మీద తిరుగుబాటు. కర్ణాటకలో హిజాబ్ వివాదం మొదలయ్యాక ‘ఇది ఇస్లాం ధార్మిక మతాచారాల్లో ప్రాథమికమైనదా?’ అనే ప్రశ్నను సుప్రీంకోర్టు లేవనెత్తింది. హిజాబ్ ఇస్లాంలో ప్రాథమికమైనదా? ద్వితీయమైనదా? అలంకారప్రాయమైనదా? అనేవి కావు ప్రశ్నలు. ఎబివిపి సభ్యులు వచ్చి హిజాబ్ తీసేయమంటే ముస్లిం మహిళలు తిరస్కరించారు. వాళ్ళు ఎబివిపిలో రాజ్యాన్నీ, అధికారాన్నీ చూశారు. రాజ్యాన్నీ, అధికారాన్నీ ధిక్కరించాలనుకున్నారు. ఇది లీగల్ సమస్య కాదు; ఇది ఆత్మగౌరవ సమస్య. ఇది సుప్రీంకోర్టుకు ఎప్పటికి అర్థం కావాలి?


ముస్లిం మహిళలు రోడ్లెక్కడమూ, ధర్నాలు, నిరసనలు చేయడం ఇస్లాం ధర్మంలో ప్రాథమికమా? ద్వితీయమా? అనేవి అర్థం లేని చర్చలు. అధికారాన్ని ప్రశ్నించాలనుకున్నప్పుడు షాహీన్ బాగ్ ముస్లిం మహిళలు రోడ్డు మీదికి వచ్చారు. దేశ రాజధానికి వచ్చే ప్రధాన రహదారిని దిగ్బంధం చేశారు. వాళ్ళు ప్రభుత్వ భక్తుల్నే కాక, ముస్లిం ఛాందసుల్ని కూడ పక్కనపెట్టారు.

అహమ్మద్ మొహిద్దీన్ ఖాన్ యజ్దానీ (డానీ)

ముస్లిం థింకర్స్ ఫోరం కన్వీనర్

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.