నేలవాలిన రైతుల ఆశలు

ABN , First Publish Date - 2022-05-05T04:46:05+05:30 IST

మంగళవారం రాత్రి తెల్లవారుజాము వరకు జిల్లాలోని పలుచోట్ల కురిసిన వర్షంతో పంటలు నేలవాలాయి. గాలివాన బీభత్సం సృష్టించింది.

నేలవాలిన రైతుల ఆశలు

- జిల్లాలో పలుచోట్ల నేలకూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు
- చింతలమానేపల్లిలో ఇళ్లు ధ్వంసం
- చేతికొచ్చే దశలోనే నేలకొరిగిన వరిపంట
- నష్టం అంచనాలో వ్యవసాయాధికారులు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)
మంగళవారం రాత్రి తెల్లవారుజాము వరకు జిల్లాలోని పలుచోట్ల కురిసిన వర్షంతో పంటలు నేలవాలాయి. గాలివాన బీభత్సం సృష్టించింది. వేగంగా వీచిన గాలులకు తోడు వర్షం కురియడంతో కోతకు వచ్చిన వరి నేలవాలి గింజ రాలింది. రైతుల తీవ్రంగా నష్టపోయారు. పలుచోట్ల గాలి తీవ్రతకు భారీ వృక్షాలు నేలకూలాయి. మరోవైపు గాలుల తీవ్రతకు విద్యుత్‌ స్తంభాలు కిందపడటంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు ఐదు గంటల పాటు విద్యుత్‌సరఫరా నిలిచిపోయింది. తిర్యాణి, రెబ్బెన, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, దహెగాం, చింతలమానేపల్లి ప్రాంతాల్లో వర్షం తీవ్రతతో నష్టం వాటిల్లింది. తిర్యాణి మండలంలో కురిసిన భారీ వర్షానికి వరిపంట నేల వాలింది. మండలంలోని తిర్యాణి, తలండి, చెలిమెల, కన్నెపల్లి, గంభీరావుపేట గ్రామాల్లో వరిసాగు చేసిన రైతుల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు వ్యవసాయశాఖ అధికారులుపేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికా రులు పంటనష్టం అంచనా వేసేందుకు ఇంకా అధికారులు రంగంలోకి  దిగలేదు. ప్రభుత్వ ఆదేశాల కోసం వేచి చూస్తున్నట్టు చెబుతున్నారు. మరోవైపు బెజ్జూరు మండలంలోను దాదాపు రెండువందల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. పెంచికల్‌ పేట మండలంలోని గుంట్లపేట, లోడ్‌ పల్లి గ్రామాల్లో కూరగాయల పంటలు చాలా దెబ్బతిన్నాయి. మండలంలో పలు గ్రామాల్లో చెట్లు విరిగి పడడంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిర్పూరు(టి) మండలం లోనూ పంటనష్టం పెద్దగా లేకపోయినా విద్యుత్‌ సరఫరాకు ఆటంకాలు ఏర్ప డ్డాయి. దహెగాం మండలంలో కోత దశలో ఉన్న వరిపంట ఈదురు గాలు లకు నేలవాలడంతో వడ్లునేల రాలాయి. విద్యుత్‌ స్తంభాలు పడిపోవటంతో సర ఫరాకు అంతరాయం ఏర్పడింది. చింత లమానేపల్లి మండలంలో ఈదురుగాలు లతోకూడిన వర్షంకురియటంతో మండ లకేంద్రం నుంచి కర్జెవెల్లికి వెళ్లే ప్రధాన రహదారితో పాటు రవీంద్రనగర్‌ ప్రాంతాల్లో పలు చోట్ల చెట్లు నేలకూలి రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. చింతల మానేపల్లి గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. ఆడెపల్లి, కర్జెల్లి, బాబా పూర్‌ గ్రామాల్లో పలువురి ఇండ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోవటంతో రాత్రంతా ఇబ్బందిపడ్డారు. దానికి తోడు విద్యుత్‌ సరఫరా నిలిచి పోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగజ్‌ నగర్‌ మండలంలో ఈదురు గాలులు భీభత్సం సృష్టించాయి. గాలుల తీవ్రతతో విద్యుత్‌ సరఫరా ప్రధానలైన్లు సాంకేతిక సమస్య తలెత్తడంతో విద్యుత్‌ సరఫరా జరుగక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రెబ్బెన మండలంలోనూ వడగళ్ల వానకు చెట్లు విరిగి పడ్డాయి. దాంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి నుంచి ఉదయం ఏడు గంటల వరకు కూడా విద్యుత్‌ సరఫరా పునరుద్దరించ లేకపో యారు. ఇప్పటికీ మరమ్మతులు కొనసాగుతున్నట్టు చెబుతున్నారు. కాగా ఎక్కడ కూడా ప్రాణనష్టం సంభవించలేదు.

Read more