Advertisement

మనం మరచిపోయిన మానవత్వం

Jan 22 2021 @ 04:27AM

మానవత్వమే సహజన్యాయం. రాజ్యాంగన్యాయం కంటే సహజన్యాయం గొప్పది. మరి మన ప్రభువులు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు మానవతను పూర్తిగా మరిచిపోయారా? మంచితనమే మానవత్వం. పాలకులు మనుషుల వలే వ్యవహరించాలని భారత రాజ్యాంగం అవ్యక్తంగా ఆశిస్తున్నది. కరోనా కాలంలో తమ ఊళ్లకు కాలినడకన బయలుదేరిన వలస కార్మికులను ఆదుకునేందుకు కొన్ని హైకోర్టులు ప్రయత్నించినప్పటికీ సుప్రీంకోర్టు కొన్ని నెలల పాటు పట్టించుకోలేదు. ఇది మానవతకు వ్యతిరేకమని న్యాయకోవిదులు విమర్శించారు. జాతి హితులు ఒక వినతిపత్రం ఇచ్చిన తరువాతే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసి మానవతా విలువలను రక్షించే ప్రయత్నం చేసింది. 


రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడన్న పాత సామెత ఈనాటి అమానుషానికి సరిపోతుందో లేదో?! ఢిల్లీ చలి అనుభవించిన వారే ఆ రైతుల కష్టాలు అర్థం చేసుకోగలుగుతారు. డిసెంబర్, జనవరి నెలల్లో ఉత్తరాది చలిని భరించడం కష్టం. తలుపులు అన్నీ మూసేసి ఇంట్లో కూర్చున్నా హీటర్లు ఉండాల్సిందే. మరి రక్తం గడ్డ కట్టే చలిలో నవంబర్ నుంచి ఇప్పటి వరకు యాభై రోజులుగా రైతులు బహిరంగంగా చలిగాడ్పులను ఎదుర్కొంటున్నారు. పాలకులు, అధికారులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇళ్ళల్లోనే ఉండి వేడియంత్రాలు వాడుకుంటూ కూడా గజగజ వణుకుతున్నారు. హిమాలయ పర్వతాలకు సుదూరంగా ఉన్న రాష్ట్రాలలోని ప్రజలకు ఈ భరింపరాని చలి విషయం అర్థం కాదు. అయినా రైతులు వేలాదిగా రోడ్ల మీదకు వచ్చి అక్కడే రోజుల తరబడి రాత్రింబగళ్లు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. తమ న్యాయబద్ధమైన ప్రయోజనాలను కాలరాచివేసే చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తుంటే వారి మీద నీటి ఫిరంగులను వాడుతూ విపరీత జలధారలను విసిరే వారు మనుషులేనా? రాజ్యాంగ న్యాయ సూక్ష్మాలను తరువాత చూద్దాం. ‘మేము రైతుల సమస్యలు వింటాం, మీరు వారి మీద నీటి ఫిరంగులు వాడకండి’ అని ఒక్క న్యాయమూర్తి అయినా ఆదేశించారా? మన అన్నదాతలను ఈ విధంగా చంపుకోవడం హైందవ ధర్మమా? లేక మనం అనుసరించే సంస్కృతీ సంప్రదాయమా? రైతుచట్టాలను అన్యాయంగా సమర్థించే మేధావులు కూడా ఈ మాత్రం మానవత్వం చూపకపోవడం దారుణం కాదా? ఆ నీటిఫిరంగి వెనుక ఉన్నవాడు ఒక కట్టు బానిస. జీతం కోసం పనిచేసే ఒక యంత్రం. ఫిరంగి ఎంతో అతనూ అంతే. అతని వెనుక ఉన్న ఉన్నతాధికారులు, వారిని ఆదేశించే రాజకీయ, రాజ్యాంగ పదవుల్లో ఉన్న పెద్దలు మనం అంతా మనుషులమేనా? మానవత్వం అంటే మనకు తెలుసా? మూడు కొత్త వ్యవసాయచట్టాలను రద్దు చేస్తే ఈ దేశానికి, ఈ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమిటి? కార్పొరేట్ వ్యవసాయ వాణిజ్యం నిలిచిపోయి దేశం నష్టపోతుందా? రైతులకు స్వేచ్ఛ ఇస్తున్నామని కదా మీ వాదం; తమకు ఆ స్వేచ్ఛ లేకపోయినా ఫరవాలేదని రైతులే అంటున్నారు కదా. వారి మాటను ఎందుకు ఆలకించరు?


ఇన్నాళ్లూ చిన్నకారు, సన్నకారు రైతులు పండించిన ధాన్యాలను కనీస మద్దతు ధరకు అమ్మడానికి సహాయం చేస్తున్న చట్టాలు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ధాన్యాలను తరలించి కృత్రిమ కరువు సృష్టించి చీకటిబజారు వ్యవహారాలతో వినియోగదారులకు అధిక ధరలకు అమ్మి లాభాలు చేసుకునే అవినీతి వ్యాపారాన్ని అరికట్టే చట్టాలు చెల్లకుండా కేంద్రం కొత్త శాసనాలను తీసుకువచ్చింది. దేశానికి ధాన్యాగారాల వంటి పంజాబ్, హరియాణాలలో రైతులకు చాలా రక్షణలు ఉండేవి. అవన్నీ ఇప్పుడు ఉండవు. ఆ రాష్ట్రాల చట్టాలు చెల్లబోవు. ఇప్పటి నుంచి ఏ సరుకులైనా ఏ ధాన్యాలనైనా ఎక్కడికైనా తరలించే స్వేచ్ఛ ఉంది. చీకటిబజారు కూడా ఇప్పుడు స్వేచ్ఛలో భాగం. వినియోగదారులకు ఏ ధరకైనా సరే కొనుక్కునే లేదా అసలు కొనకుండా ఉండే స్వేచ్ఛను ఈ చట్టాలు ప్రసాదిస్తున్నాయి. 


కేంద్రప్రభుత్వం ఆర్డినెన్సులను జారీ చేసిన నాటి నుంచే ఆ రైతు వ్యతిరేక చట్టాల అమలు మొదలైంది. అనేకానేక వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. అవి చట్టాలుగా మారిన వెంటనే, నోటిఫై చేసి అత్యంత వేగంగా అమలు కొనసాగించారు. వెంటనే వర్తకులు వ్యవసాయ ఉత్పత్తులను కొనడానికి వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లకుండా స్వేచ్ఛగా కొనుక్కుంటున్నారు. ఎన్నో మార్కెట్లలో వర్తకులు మూడు శాతం శిస్తు కట్టడం మానేశారు. మార్కెట్ కమిటీల ఉద్యోగులు నిరుద్యోగులైపోయారు. వ్యవసాయదారులకు సాయం చేసే వ్యవసాయ మార్కెట్లు ఉంటాయని, వాటిని రద్దు చేయలేదని ప్రభువులు ప్రకటిస్తున్నారు. ఇవి వాస్తవాలేనా? వాటిని రద్దు చేయని మాట నిజమే అయితే వర్తకులు, రైతుల మధ్య ఒప్పందాలకు, వ్యవసాయ మార్కెట్ కమిటీల కోసం రాష్ట్రాలు చేసిన చట్టాలకు మధ్య వైరుధ్యం ఉంటే ఆ చట్టాలు పనికిరావని, ఒప్పందాలు మాత్రమే పనిచేస్తాయని కొత్త సాగుచట్టాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. మరి ఇది రాష్ట్ర చట్టాలను నిర్వీర్యం చేయడమే కాదూ? 


మన రాజ్యాంగం గురించి రాష్ట్రపతికి, మన కేంద్ర న్యాయశాఖ మంత్రికి, వారికి సహాయపడే రాజ్యాంగ నిపుణులకు తెలిసినంతగా రైతులకు తెలియదు. అయితే వర్తకులతో ఒప్పందాలు చేసుకునే స్వేచ్ఛను తమకు ఇచ్చారని రైతులకు అర్థం అయింది. అన్నదాతలను వ్యవసాయ మార్కెట్ నుంచి కార్పొరేట్ మార్కెట్‌లోకి తోసివేస్తున్నారని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు కల్పించిన మద్దతు ఏర్పాట్లు ఇక లభించవని, రాష్ట్రాలు చేసిన మద్దతు చట్టాలు చెల్లవని, రాష్ట్రప్రభుత్వాలు సహాయం చేయదలచుకున్నా చేయలేకపోవచ్చని రైతులకు అర్థమయింది. ఆర్థిక నిపుణులకు, కార్పొరేట్ల ద్వారానే ప్రగతి వస్తుందని నమ్మే కొందరు మేధావులకు, కొన్ని రాజకీయ పార్టీలకు మాత్రం ఈ వాస్తవం అవగతం కాలేదు. ఇకముందు కూడా అర్థం కాకపోవచ్చు. అర్థం చేసుకున్న రైతులు తమ ప్రాణాలు పణంగా పెట్టి రక్తం గడ్డ కట్టే చలిలో పోరాడుతున్నారు. నీళ్ల ఫిరంగులను ఎదుర్కొంటున్నారు. 


ఇక మిగిలింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు కూడా రైతులను రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు? రోడ్ల మీదికి వచ్చి నిరసన వ్యక్తం చేసే హక్కు పేరుతో ఇతరుల రాకపోకలను నిరోధించే అధికారం రైతులకు లేదని రాజ్యాంగం తెలిసిన కొందరు న్యాయవాదులు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) ఒకటి వేశారు. రైతులను రోడ్ల మీదనుంచి ఖాళీ చేయించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేయమని ఆ న్యాయనిపుణులు, వారి వెనుక ఉన్న కొన్ని శక్తులు ఆ ప్రజాహిత వ్యాజ్యంలో కోరారు. రైతుల మీద నీటి ఫిరంగులు ప్రయోగించవద్దని ప్రజాహిత వ్యాజ్యం వేసే వారెవరూ లేరు. అధికార పార్టీల్లో కూర్చుని పదవులు అనుభవిస్తున్న రాజ్యాంగ నిపుణులు అయినా కనీసం రైతుల మీద నీటి ఫిరంగులు ప్రయోగించకండి అని చెప్పడానికి సైతం భయపడుతున్నారు. 


ఇటీవల మహారాష్ట్ర హైకోర్టులో మన తెలుగుకవి వరవరరావు బెయిల్ పిటిషన్ విచారణ దశలో, ఎన్‌ఐఎను ఉద్దేశించి, ‘మీ కేసులు సరే, వరవరరావుగారి వయసు గుర్తు పెట్టుకోండి. మనమంతా మనుషులం కదా’ అని గౌరవనీయ న్యాయమూర్తులు అన్నారు. మానవత్వం లేని చట్టాల మధ్య ఇటువంటి మానవత్వపు మెరుపులు అప్పుడప్పుడు కనిపిస్తే మనం ఇంకా మనుషులమధ్యే ఉన్నామనిపిస్తుంది. ఎన్‌ఐఎకు మానవత్వం ఉందో లేదో ఎవరు చెప్పాలి? 


‘ఆందోళన చేసే రైతులలో వయోవృద్ధులు, పిల్లలు, మహిళలు ఇంటికి వెళ్లాలి. ప్రధాన న్యాయమూర్తి వారు ఇళ్లకు వెళ్లాలని కోరుకుంటున్నారని ఆ ఆందోళనకారులకు చెప్పండి. మీకు మామీద నమ్మకం ఉన్నా లేకపోయినా సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాలో మా బాధ్యత మేము నిర్వహిస్తాం’ అని ఈ నెల 11న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ బాబ్డే అన్నారు. ఇలా మానవతాపూర్వకమైన మాటలు జడ్జీలు తప్పనిసరిగా మాట్లాడాలని రాజ్యాంగంలో ఉండదు. న్యాయమూర్తులు మానవులై మానవతతో మెలగాలని నియమాలు రాసుకోలేదు. ఎందుకంటే న్యాయమూర్తులు మానవులే కనుక మనుషులకు ఉండే మానవత్వం ఉంటుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు, ఉండాలని ఆశించారు. 


కేంద్రప్రభుత్వం రైతుల ఆందోళన విషయంలో వ్యవహరించిన తీరు పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి నిరాశానిస్పృహలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు పట్ల ప్రజల నిరాశానిస్పృహలనే ఆయన ప్రతిధ్వనించారు. అది వినగానే చట్టాల ఇనుప చట్రాలలో కూడా ఎక్కడో మానవత్వం చిగురించిందనిపించింది. యాభైరోజులకు పైగా అన్నదాతలు పొలాలు హలాలూ వదిలి, ఇంటిల్లిపాదితో కలిసి వచ్చి రోడ్ల మీద వండుకుని తింటూ సమ్మె చేస్తున్నా ఉపేక్షిస్తున్న పాలకులు ఆ చట్టాలను వెనక్కి తీసుకోవడంలో పంతాలూ పట్టింపులు చూపుతున్నారు! ఇప్పటికే దాదాపు 30 మందికి పైగా రైతులు చనిపోయారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. న్యాయం కోసం పోరాడుతున్న రైతులలో ఖలిస్తానీయులు ఉన్నారని మాట్లాడడమేమిటి? మనకు మానవత్వం ఉందా? మనం మనుషులమేనా?

మాడభూషి శ్రీధర్

(కేంద్ర సమాచార మాజీ కమిషనర్)

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.