జూనియర్‌ ఆర్టిస్టుల ఆకలి కేకలు

ABN , First Publish Date - 2020-07-06T10:00:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో సినీ రంగాన్ని ప్రోత్సహించాలని భావిస్తోంది. సినీ ప్రముఖులు కూడా ఇక్కడ స్టూడియోలు ..

జూనియర్‌ ఆర్టిస్టుల  ఆకలి కేకలు

సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఉపాధి కరవు

విశాఖ జిల్లాలో మూడు వేల మంది వరకూ

ఉన్నట్టు చెబుతున్న అసోసియేషన్లు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో సినీ రంగాన్ని ప్రోత్సహించాలని భావిస్తోంది. సినీ ప్రముఖులు కూడా ఇక్కడ స్టూడియోలు నిర్మించాలని యోచిస్తున్నారు. ఈ రంగాన్ని నమ్ముకొని విశాఖపట్నంలో రెండు వేల మంది పైచిలుకు ఉపాధి పొందుతున్నారు. కరోనా కారణంగా మూడు నెలల నుంచి షూటింగ్‌లన్నీ నిలిచిపోవడంతో వారంతా ఆకలితో అలమటించిపోతున్నారు. ఇతర పనులు కూడా ఏమీ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


ఎక్కడో ఓ చోట షూటింగ్‌

సాధారణంగా విశాఖపట్నం జిల్లాలో ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట సినిమా, సీరియల్‌ షూటింగ్‌లు జరుగుతుంటాయి. తెలుగుతో పాటు ఒడియా, బెంగాలీ, తమిళ దర్శకులు కూడా ఇక్కడ షూటింగ్‌లు చేస్తుంటారు. సినిమా రంగంలో 24 క్రాఫ్టులు వుండగా అందులో పది రంగాలకు చెందినవారు విశాఖలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా జూనియర్‌ ఆర్టిస్టులు రెండు వేల మంది వరకు ఉన్నారు. అలాగే డ్యాన్సర్లు, డైలాగ్‌ ఆర్టిస్టులు, ప్రొడక్షన్‌ మేనేజర్లు, ఏజెంట్లు, లైట్‌ బాయ్స్‌, సెట్‌ ఆర్టిస్ట్‌లు...ఇలా అంతా కలిసి మూడు వేల మంది వరకు ఉంటారు.


ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లో ఎక్కడ సినిమా షూటింగ్‌ జరిగినా వీరంతా వెళ్లి పనిచేస్తున్నారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. సెట్‌లోనే ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం పెడతారు. కొన్ని సంస్థలు సాయంత్రం స్నాక్స్‌ కూడా ఇస్తాయి. జూనియర్‌ ఆర్టిస్టులకు రోజుకు రూ.300 నుంచి రూ.350 వరకు ఇస్తారు. రానుపోను చార్జీలకు మరో రూ.75 ఇస్తారు. సినిమా బడ్జెట్‌, హీరోను బట్టి ఈ రెమ్యునరేషన్స్‌ ఉంటాయి. అయితే కరోనాతో గత మూడు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు.


ఆదుకుంటున్న చిరంజీవి, అమితాబ్‌ బృందాలు

కరోనా నేపథ్యంలో సినిమా రంగంలో పనిచేసే కుటుంబాలను ఆదుకోవడానికి చిరంజీవి సారథ్యంలో ఏర్పాటైన కమిటీ ఇప్పటికి రెండుసార్లు విశాఖపట్నంలో  జూనియర్‌ ఆర్టిస్టులకు వేయి రూపాయల చొప్పున కూపన్లు అందజేసింది. అలాగే అమితాబ్‌బచ్చన్‌ కూడా మనిషికి రూ.1,500 చొప్పున కూపన్లు పంపించారు. మరోసారి చిరంజీవి కమిటీ నుంచి లారీలో సరకులు వస్తున్నాయని, వాటిని పంపిణీ చేస్తారని ఓ ఏజెంట్‌ తెలిపారు.


షూటింగ్‌లకు అనుమతి ఇస్తేనే బతుకు .. కె.సూరిబాబు, కార్యదర్శి, తెలుగు సినీ, టీవీ ఫిల్మ్‌ ఫెడరేషన్‌, విశాఖపట్నం

షూటింగ్‌లు ఆపేయడం వల్ల అందరికీ ఉపాధి పోయింది. కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటామని సినీ పెద్దలు చెబుతున్నందున ప్రభుత్వం త్వరగా అనుమతులు ఇస్తే...ఈ రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి లభిస్తుంది. అదే అంతా కోరుకుంటున్నాము.

Updated Date - 2020-07-06T10:00:37+05:30 IST