తుఫాను ముప్పు తప్పేది తీర పరిరక్షణతోనే!

ABN , First Publish Date - 2021-01-07T06:18:55+05:30 IST

గతఏడాది నవంబరు చివరి వారంలో వచ్చిన నివర్ తుఫాను రైతాంగాన్ని ముంచేసింది. లక్షలాది ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి....

తుఫాను ముప్పు తప్పేది తీర పరిరక్షణతోనే!

సాంకేతిక పరిజ్ఞానం విపత్తుల తీవ్రతను తెలుసుకోవడానికేగాని, ఇంకా వాటిని పూర్తిగా నివారించే స్థాయికి ఎదగలేదు. విపత్తుల వల్ల కలిగే ముప్పును తగ్గించే అవకాశాలను ప్రకృతి సహజసిద్ధంగానే ఏర్పాటుచేసింది. దురదృష్టవశాత్తు ఆ సహజ రక్షణ కవచాలు మానవ జోక్యంతో నాశనమవుతున్నాయి. విలయాన్ని అడ్డుకోవడం సాధ్యం కానప్పుడు, కనీసం ముప్పును కాచుకునే సహజ వ్యవస్థలనైనా పెంపొందించుకోవడం ధర్మం. ఆ పనిచేయకపోగా, ఉన్నవాటిని నాశనం చేసుకుంటున్నాం. తీర ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడే మడ అడవులు, సరుగుడు చెట్లు, కొండలమీద పెరిగిన దట్టమైన వృక్షాలు క్రమంగా అంతరించిపోతున్నాయి.


గతఏడాది నవంబరు చివరి వారంలో వచ్చిన నివర్ తుఫాను రైతాంగాన్ని ముంచేసింది. లక్షలాది ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. 19 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిని దాదాపు 9 లక్షలమంది రైతులు నష్టపోయారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం వివిధ రంగాలకు రూ.5,324కోట్ల మేర నష్టం చేకూరినట్లు అంచనా. ప్రతీ ఏటా రాష్ట్రంలో ఇదే పరిస్థితి. హుదూద్, తిత్లీ, పెథాయ్, ఇప్పుడు నివర్... ఇలా వరుస ప్రకృతి వైపరీత్యాలతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతోంది. ఆంధ్రప్రదేశ్‍లో ప్రకృతి వైపరీత్యాలకు ప్రకృతి ప్రకోపంతో పాటు మానవ తప్పిదాలు కూడా కారణమవుతున్నాయి. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపైనే కాకుండా, విధాన నిర్ణయాలు, రాజకీయ సుస్థిరత, సాధారణ జనజీవనంపైనా పడుతోంది. ఐక్యరాజ్య సమితి విపత్తు నష్ట నివారణ కార్యాలయం విడుదల చేసిన నివేదిక ప్రకారం - వివిధ ఉత్పాతాల కారణంగా భారతదేశం ఏటా రూ.65 వేల కోట్ల మేరకు ఆర్థికంగా నష్టపోతోంది. అందులో కేవలం తుఫాన్ల వల్ల ఏటా రూ.4 వేల కోట్ల పైచిలుకు నష్టం సంభవిస్తోంది. 


జనజీవితాల్ని అతలాకుతలం చేస్తున్న ఈ తుఫాన్లని ముందే పసిగట్టి తగిన విధంగా హెచ్చరిస్తున్న మన సాంకేతిక అభివృద్ధిని అభినందించాల్సిందే. జాతీయ విపత్తుల నివారణ సంస్థ ద్వారా మనం అప్రమత్తం కాగలుగుతున్నాం. సైనిక సిబ్బందిని, అధికార సిబ్బందిని తగువిధంగా మోహరించి తుఫాన్ల ప్రమాదాన్ని ఎదుర్కోవడం ఎలాగో నేర్చుకుంటున్నాం. అందుకు అనుగుణంగానే ప్రజలను సైతం మానసికంగా సన్నద్ధం చేస్తున్నాం. ముందే ప్రమాద హెచ్చరికలు ప్రజలందరికీ చేరవేయడం వలన మూడు, నాలుగు రోజులకు సరిపడా ఆహార పదార్థాలు చాలా కుటుంబాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటువంటి జాగ్రత్తల ద్వారానే ఉపద్రవాలలో ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోగలుగుతున్నాం. 


అయితే సాంకేతిక పరిజ్ఞానం విపత్తుల తీవ్రతను తెలుసుకోవడానికేగాని, ఇంకా వాటిని పూర్తిగా నివారించే స్థాయికి ఎదగలేదు. విపత్తుల వల్ల కలిగే ముప్పును తగ్గించే అవకాశాలను ప్రకృతి సహజసిద్ధంగానే ఏర్పాటుచేసింది. దురదృష్టవశాత్తు ఆ సహజ రక్షణ కవచాలు మానవ జోక్యంతో నాశనమవుతున్నాయి. విలయాన్ని అడ్డుకోవడం సాధ్యం కానప్పుడు, కనీసం ముప్పును కాచుకునే సహజ వ్యవస్థలనైనా పెంపొందించుకోవడం ధర్మం. ఆ పనిచేయకపోగా, ఉన్నవాటిని నాశనం చేసుకుంటున్నాం. తీర ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడే మడ అడవులు, సరుగుడు చెట్లు, కొండలమీద పెరిగిన దట్టమైన వృక్షాలు క్రమంగా అంతరించిపోతున్నాయి. తుఫాన్ల సమయంలో అలల ఉధృతికి తీరంలోని ఇసుక కోతలకు గురికాకుండా మడచెట్ల వేర్లు బలమైన వలలుగా పనిచేస్తుంటాయి. రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రంలో 54 వేల హెక్టార్ల మడ అడవులు విస్తరించి ఉండేవి. ఇప్పుడు వాటిలో చాలావరకు నాశనమైపోయాయి. ప్రభుత్వ వ్యవస్థల నిర్లక్ష్యం మడ అడవుల విస్తీర్ణం తగ్గిపోవడానికి ముఖ్య కారణమని ఎం.ఎస్. స్వామినాథన్ నేతృత్వంలోని ఫౌండేషన్ గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. కృష్ణా, గోదావరి నదుల్లో మంచినీటి ప్రవాహం తగ్గిపోవడం, మరోవైపు నదీజలాల్లోకి ఎగువ ప్రాంతాల్లోంచి తరలివచ్చే ఒండ్రు మట్టి తగ్గిపోవడం అడవుల కోతకు దారితీసింది. నదీ పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటైన భారీ రసాయన పరిశ్రమల వ్యర్థాలు సముద్రంలో కలవడం వల్ల జలాల్లో మార్పులు వచ్చాయి. సముద్రంలోని ఓడల నుంచి వెలువడే చమురు వ్యర్థాలు, చమురు వెలికితీత కార్యక్రమాలు, పంట పొలాలనుంచి విడుదలయ్యే రసాయనాలు సైతం తీరంలో సహజ రక్షణ కవచాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. తూర్పుగోదావరి, గుంటూరు డెల్టా పరిధిలో చాలావరకు అడవులు కబ్జాలకు గురై తరిగిపోతున్నాయి. పర్యావరణాన్ని దారుణంగా దెబ్బకొడుతున్న ఈ ప్రయత్నాలను తక్షణం అడ్డుకోకపోతే- తుఫానులు, పెనుగాలులు ప్రతీసారి రాష్ట్రంలోని తీరప్రాంతాలను అతలాకుతలం చేస్తూనే ఉంటాయి. తీరం నుండి 500 మీటర్ల వరకూ బోర్ వెల్స్ వేయరాదని సి.ఆర్.జెడ్ చట్టం చెపుతోంది. దాన్ని పట్టించుకోకుండా తీరం వెంబడి బోర్‌లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్నారు.


ప్రపంచవ్యాప్తంగా తుఫాన్లలో బంగాళాఖాతంలో తలెత్తేవి 7 శాతం. సంఖ్యాపరంగా ఇవి తక్కువే అయినా నష్టం మాత్రం భారీగా ఉంటోంది. కోస్తా జిల్లాల్లో మురుగు, వరద నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం రెట్టింపవుతోంది. చాలాసార్లు కాలువలు, చెరువుల గట్లు తెగిపోవడం వల్లే ఎక్కువమంది మృతి చెందిన సందర్భాలు ఉన్నాయి. 1977 నాటి దివిసీమ తుఫాను తరువాత విశాఖపట్నం-కోస్తా తీరం వెంట 146 తుఫాను రక్షణ కేంద్రాలను నిర్మించారు. అయితే అవి సరైన నిర్వహణలేక శిథిలమైపోయాయి. వీటిని పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దానితో పాటు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి విపత్తు నిర్వహణ అథారిటీలను కూడా పునరుద్ధరించడం అవసరం. తుఫాన్ల తీవ్రతను తట్టుకుని నిలబడాలంటే- తీరప్రాంతవ్యాప్తంగా గ్రీన్ బెల్ట్ ఏర్పాటుచేయాలి. తీరం వెంబడి మడ అడవులు, సరుగుడు చెట్లు, జీడిమామిడి తోటలు పెంచాలి. ఉప్పుగాలులను తట్టుకునే వనాలను తీరంలో పెంచాలి. వీటితో పాటు తీరప్రాంత జీవావరణాన్ని దెబ్బతీసే విధంగా కట్టడాలు నిర్మించకుండా, స్వార్థ అవసరాల పేరిట మానవ జోక్యం పెరగకుండా చర్యలు తీసుకోవాలి. తీరప్రాంత నియంత్రణ కోసం రూపొందించిన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సి.ఆర్.జెడ్) నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. తీరరక్షణకు అవసరమైన సహజ వనరులను విస్తారంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం, పౌర సంఘాలు నడుంబిగించాల్సిన సమయం ఆసన్నమైంది. 

కూసంపూడి శ్రీనివాస్

అధికార ప్రతినిధి, జనసేన పార్టీ

Updated Date - 2021-01-07T06:18:55+05:30 IST