మార్కెట్‌ విలువలో మాయ

ABN , First Publish Date - 2022-07-05T05:08:59+05:30 IST

సంతనూతలపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. అక్కడి అధికారులు, సిబ్బంది డాక్యుమెంట్‌ రైటర్‌లతో కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. మార్కెట్‌ విలువలో మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ఒక సర్వే నెంబర్‌లో ఉన్న భూమిని మరో సర్వేనెంబర్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ప్రతిగా భారీగా అక్రమార్జనకు పాల్పడుతున్నారు.

మార్కెట్‌ విలువలో మాయ
సంతనూతలపాడు సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం

సంతనూతలపాడు సబ్‌ రిజిస్ట్రార్‌

కార్యాలయంలో చేతివాటం

ఒక సర్వే నంబర్‌లో ఉన్న

భూమికి మరో నంబర్‌ వేసి రిజిస్ట్రేషన్‌

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

జేబులు నింపుకుంటున్న అధికారులు, సిబ్బంది

చక్రంతిప్పుతున్న డాక్యుమెంట్‌ రైటర్లు 

ఒంగోలు (క్రైం), జూలై 4 : సంతనూతలపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. అక్కడి అధికారులు, సిబ్బంది డాక్యుమెంట్‌ రైటర్‌లతో కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. మార్కెట్‌ విలువలో మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ఒక సర్వే నెంబర్‌లో ఉన్న భూమిని మరో సర్వేనెంబర్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ప్రతిగా భారీగా అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల పెత్తనం అధికమైంది. రికార్డులను సైతం వారే రాస్తుండటం విస్తుగొలుపుతోంది. మూడు నెలల క్రితం స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ కమిషనర్‌ కార్యాలయం తనిఖీకి వచ్చిన సమయంలో ముందుగా అప్రమత్తమై జాగ్రత్తపడ్డారు. 

సంతనూతలపాడు మండలం జిల్లాకేంద్రమైన ఒంగోలుకు సమీపంలో ఉంటుంది. ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. భూముల క్రయవిక్రయాలు అధికంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి అధికారులు, సిబ్బంది సరికొత్త అవినీతికి తెరతీశారు.  ప్రభుత్వానికి ఆదాయం వచ్చే స్టాంపు డ్యూటీ విషయంలో మాయాజాలం చేసి మార్కెట్‌ విలువ తగ్గించి కొనుగోలుదారులకు లబ్ధి చేకూరుస్తున్నారు. అందుకోసం వారితో బేరాలు మాట్లాడుకొని భారీ మొత్తాలు తీసుకుంటున్నారు. 


మచ్చుకు కొన్ని ఉదాహరణలు ఇవీ.. 

 పేర్నమిట్ట పరిధిలోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ ఉన్న సర్వేనెంబరు 93లో మార్కెట్‌ విలువ చదరపు గజం ఐదువేలు ఉండగా ముత్తరాసిపాలెం డోరు నెంబర్‌ వేసి చదరపు గజం రూ.2500కు రిజిస్ట్రేషన్‌ చేశారు.

పేర్నమిట్ట రాజీవ్‌ నగర్‌లో మార్కెట్‌ విలువ చదరపు గజం రూ.3వేలు ఉంది. అక్కడ ఒక స్థలాన్ని సంతనూతలపాడు క్రిస్టియన్‌పాలెం డోర్‌ నెంబరు వేసి చదరపు గజం రూ.2500 చూపి రిజిస్ట్రేషన్‌ చేశారు. 

ఎండ్లూరులో రూ.37 లక్షలు ఉన్న పొలం ను రూ 22లక్షలు విలువ కింద రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇలా అనేక డాక్యుమెంట్లు ఎక్కువ విలువ ఉన్న తక్కువ విలువకు రిజిస్ట్రేషన్లు చేసి విక్రయదారుల వద్ద అందినకాడికి దండుకుంటున్నారు. 


డాక్యుమెంట్‌ రైటర్లదే హవా

సంతనూతలపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్‌ రైటర్ల హవా నడుస్తోంది. వీరు అధికారులు, సిబ్బందితో కలిసిపోయి దోపిడీకి పాల్పడుతున్నారు. మార్కెట్‌ విలువ తగ్గించి చేయస్తామంటూ విక్రయదారులు వద్ద అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారు. తద్వారా విక్రయదారుల తాత్కాలికంగా లబ్ధి పొందినా తరువాత ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు కట్టాల్సిందే. అయితే కేవలం అప్పటికప్పుడు ఫీజు తగ్గుతుందని ఆనందపడిపోతున్నారు. అంతేకాకుండా ప్రతి డాక్యుమెంట్‌కు  ఫీజ్‌ టూ ఫీజ్‌ అంటూ  భారీగా వసూలు చేసి అందులో కొంత సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ముట్టచెప్పి మిగిలిన మొత్తాన్ని జేబుల్లో వేసుకుంటున్నారు. 


రిజిస్ట్రేషన్‌లు సక్రమంగా జరుగుతున్నాయి

అబ్దుల్‌ షరీఫ్‌, సబ్‌ రిజిస్ట్రార్‌, సంతనూతలపాడు

రిజిస్ట్రేషన్లు అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. కార్యాలయంలో ఎక్కడా ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేదు.. మార్కెట్‌ విలువ తగ్గించి రిజిస్ట్రేషన్లు చేశామన్నది అవాస్తవం. ఎక్కడా అవినీతి, అక్రమాలు జరగడం లేదు.

 

Updated Date - 2022-07-05T05:08:59+05:30 IST