తక్షణ కర్తవ్యం ‘ఉపా’ రద్దు

ABN , First Publish Date - 2022-07-06T06:16:26+05:30 IST

దేశద్రోహ చట్టం ఇటీవల చాలా చర్చనీయాంశమైంది. కానీ, దేశంలో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించే చట్టం అదొక్కటే కాదు...

తక్షణ కర్తవ్యం ‘ఉపా’ రద్దు

దేశద్రోహ చట్టం ఇటీవల చాలా చర్చనీయాంశమైంది. కానీ, దేశంలో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించే చట్టం అదొక్కటే కాదు. అంతకంటే ప్రమాదకరమైన అణచివేత చట్టాలు చాలా ఉన్నాయి. సామాన్య పౌరులకు సెడిషన్ కంటే చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం (ఉపా) చట్టమే అత్యంత ప్రమాదకరమైనది. పాలకులు విపరీతంగా ఆధారపడుతున్నదీ దీనిపైనే. గత ఏడేళ్ళ కాలంలో దేశంలో ఏటా సగటున 57 దేశద్రోహ కేసులు నమోదు కాగా, ఉపా కేసులు 985 నమోదయ్యాయి. ఉపా చట్టాన్ని అంత విస్తృతంగా వాడుతున్నారు.


ఉపా పేరు చరిత్రలో మొదటిసారి 1967లో నమోదైంది. అయితే అప్పటి ఉపాకీ, ఇప్పటి ఉపాకీ పొంతనే లేదు. అది మొదటి జనరేషన్ ఉపా అయితే, ఇది ఫోర్త్ జనరేషన్ ఉపా. 2004లో యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోటాను రద్దు చేసే పేరుతో, అందులో ఉన్న మొత్తం చాప్టర్లన్నీ తీసుకొచ్చి ఉపాలో కలిపి, ఇది పాత చట్టమే అన్నట్టు టాడా, పోటాలను మించిన కొత్త చట్టం చేశారు. అదనంగా, దానికి మరిన్ని కోరలు పెట్టారు. ఇప్పుడు ఉపా కేవలం వేర్పాటువాద చర్యల నిరోధకమే కాక ‘తీవ్రవాద’ చర్యల నిరోధక చట్టం కూడా. ఇది రద్దైన పోటా కంటే భయానకంగా తయారైంది. ఈ చట్టానికి సవరణల పేరుతో నిరంతరం కొత్త కోరలు తగిలిస్తూనే ఉన్నారు. రాజకీయ సంస్థలతో సంబంధం లేకుండా ‘తీవ్రవాద చర్య’లకు పాల్పడే బృందాలు కూడా ఉంటాయంటూ ‘టెర్రరిస్ట్ గ్యాంగ్’ అనే పదాన్ని కూడా ఉపా చట్టంలో చేర్చారు. 2019లో బీజేపీ ప్రభుత్వం ఇదే దారిలో విడి వ్యక్తులను కూడా టెర్రరిస్టులుగా ప్రకటించేటట్లు చట్టాన్ని మార్చింది. 2008లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అనే స్వతంత్ర సంస్థను సృష్టించటంతో అప్పటిదాకా స్టేట్ పోలీస్, స్థానిక కోర్టుల్లో సాగిన ‘తీవ్రవాద నేరాల’ విచారణ కేంద్రీయ ఎన్‌ఐఎ పరిధిలోకి వెళ్ళిపోయింది.


టాడా, పోటా లాగే ఉపా కూడా హింసాత్మక చర్యలకు పాల్పడ్డ వారినే కాక, సంస్థలను, ఆయా సంస్థల సభ్యులను, సంస్థల రాజకీయ కార్యకలాపాలను, వారికి సహాయపడే వారిని కూడా నేరస్థులుగా పరిగణిస్తుంది. ‘తీవ్రవాద చర్య’ అంటే నిర్వచించిన ఉపా, దాన్ని బట్టి ‘తీవ్రవాది’ అంటే ఎవరో, ‘తీవ్రవాదం’ అంటే ఏమిటో మీరే ఊహించుకోమని చెప్పింది. తీవ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం చేయటం, మద్దతివ్వటం, ఎదుగుదలకు సహాయపడటం లేదా ఏదో ఒక విధంగా సహాయపడటం వంటి ఏ విధంగానైనా వ్యాఖ్యానించటానికి అవకాశం ఉన్న పదజాలం కూడా ఉపా నేరాల జాబితాలో ఉంటుంది. ఇదంతా ఏదో ఒక మేరకు ‘తీవ్రవాద’ చర్యలకు పాల్పడితే లేదా సహాయపడితే న్యాయంగా బుక్ చేసే పద్ధతి. అటువంటివేవీ లేకపోయినా ‘పోలీసులు తలుచుకుంటే’ నమోదయ్యే కేసులే కొన్ని రాష్ట్రాల్లో నూటికి 90 శాతం ఉంటాయి.


పోలీసులు ఉపా అనుమానితులను వారెంట్ లేకుండా అదుపులోకి తీసుకోవచ్చు, 30 రోజుల వరకు తమ కస్టడీలోనే ఉంచుకోవచ్చు. మరో ఆరు నెలలు జుడీషియల్ కస్టడీలో ఉంచవచ్చు. జుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలో కూడా తిరిగి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోవచ్చు. ఆరు నెలల వరకూ ఛార్జిషీట్ దాఖలు చేయకపోయినా పరవాలేదు. ఉపాలో బెయిలు పొందే స్వేచ్ఛ దాదాపు రద్దయినట్లే ఉంటుంది. ఉపా కేసుల విచారణను సాధారణ కోర్టుల నుంచి స్పెషల్ కోర్టులకు మార్చారు. కేసుల్లో రహస్య సాక్షులు కూడా ఉంటారు. ఆ సాక్షులను ముద్దాయి తరపు వకీలు క్రాస్ ఎగ్జామిన్ కూడా చేయకూడదు. ముద్దాయి నేరం చేశాడని ప్రాసిక్యూషన్ ఋజువు చేయదు. ముద్దాయే తనపై మోపబడిన అభియోగం నిరాధారమైనదని కోర్టును నమ్మించగలగాలి. ఉపా కింద నేరం రుజువైతే, అంటే ముద్దాయి తాను నిరపరాధినని రుజువు చేసుకోలేకపోతే ఏడు సంవత్సరాల నుంచి జీవితకాలపు జైలు శిక్ష పడవచ్చు. ఆ నేరంలో హత్యలుంటే మరణ శిక్ష కూడా పడవచ్చు. 2014 నుంచి 2020 వరకు దేశంలో 6900 ఉపా కేసులు నమోదయ్యాయి. ఒక్కొక్క కేసులో పదులూ, వందల సంఖ్యలో నిందితులుంటారు. ఇదే కాలంలో 10,552 మందిని అరెస్టు చేశారు. అరెస్టు కాకుండా, ఏం జరుగుతుందో తెలియకుండా ఉండేవారు లక్షల్లో ఉంటారు. మొత్తం కేసుల్లో 71 శాతం మణిపూర్, జమ్మూకాశ్మీర్, అస్సాం రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి.


ఈ ఏడేళ్ల ఉపా కేసుల డేటాను పరిశీలిస్తే అరెస్టయిన వ్యక్తుల్లో ఏడాది లోపు బెయిల్ పొందిన వారు 30 శాతమే. 43 శాతం నిందితులు ఒకటి నుంచి మూడు సంవత్సరాలపాటూ, 25 శాతం మంది మూడు నుంచి పది సంవత్సరాల పాటూ బెయిల్ రాకుండా జైలులో ఉన్నారు. వందకు ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు 10 సంవత్సరాల పైన కేవలం బెయిలు రాని కారణంగా జైల్లో ఉన్నారు. అన్నేళ్లు జైల్లో బంధించి నువ్వు నిరపరాధివే పో అంటే, బతుకు జీవుడా అంటూ బయటకెళ్ళటం తప్ప చేయగలిగేది ఏం ఉండదు. ఈ ఏడేళ్ల కాలంలో కోర్టుల ద్వారా శిక్షలు పడింది 253 మందికే. మిగతా వాళ్ళు శిక్షకు మించిన జైలు జీవితం అనుభవించి ఇంటికైనా వెళ్ళిపోయారు లేదా ఇంకా జైళ్లలోనే మగ్గుతున్నారు.


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీసులు కూడా ఎటువంటి వస్తుగత ఆధారం లేకపోయినా చాలా నిర్లక్ష్యంగా, ‘తీవ్రవాద’ చర్యలనబడే వాటితో ఏమాత్రం సంబంధం లేని, కనీస నిర్వచనం పరిధిలోకి కూడా రాని, భాగస్వామ్య స్థాయితో సంబంధం లేకుండా వివిధ సంఘాల, సామాజిక కార్యకర్తల పేర్లను ఎవరో ఒక నిందితుడి ఒప్పుకోలు ప్రకటన పేరుతో ఉపా ఛార్జ్ షీట్లలో ఇరికించేస్తున్నారు. మతతత్వ భావంతో పాలన సాగే రాష్ట్రాల్లో అయితే, పోలీసులు కూడా అదే మతతత్వ దృష్టితో మైనారిటీ మతస్థులను ఇటువంటి తీవ్రవాద సంబంధిత కేసుల్లోకి తోస్తున్నారు. బాలగోపాల్ అన్నట్లు పాలకులు ‘తీవ్రవాద’ కార్యకలాపాలని పిలిచే వాటి వెనుక కూడా రాజకీయాలుంటాయి, పేరుకుపోయిన అసంతృప్తి ఉంటుంది. పాలకులు ముందు అది పరిష్కరించాలి. ఎంతో సులభంగా ఈ క్రూరమైన కేసుల్లోకి తోయబడే ప్రజలు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. ఆర్థిక, కుల, రాజకీయ పలుకుబడి లేని వాళ్ల పరిస్థితి ఇక చెప్పలేం. నేరమూ, విచారణ రెండూ లేకుండా అనధికారిక జైలు శిక్ష విధించే చట్టం ఇదొక్కటే. బాలగోపాల్ అన్నట్లు ఇటువంటి నిర్బంధ చట్టాలను పాలకులు హింసాత్మక చర్యలను నివారించటానికి కాక, ఆయా సంస్థల రాజకీయాలను, చట్టబద్ధ కార్యకలాపాలను, ప్రభుత్వాలపై పెరిగే అసమ్మతిని అదుపుచేయటానికి వాడుతున్నారు. అసలే ఇది అప్రజాస్వామిక చట్టం, ఆపైన దుర్వినియోగం కూడా. ఈ చట్టం నాగరిక, ప్రజాస్వామ్య సమాజంలో ఉండదగ్గ చట్టం కాదు.. కనుక రద్దు కావాల్సిందే.

డాక్టర్ ఎస్. తిరుపతయ్య

మానవ హక్కుల వేదిక

Updated Date - 2022-07-06T06:16:26+05:30 IST