భయం.. భయం

ABN , First Publish Date - 2022-01-24T04:30:12+05:30 IST

జిల్లాలో కరోనా మళ్లీ ఉగ్రరూపం దాల్చింది.

భయం.. భయం
చేవెళ్లలోని అంగన్‌వాడీ కేంద్రం

  • కరోనాతో అంగన్‌వాడీ కేంద్రాలకు పొంచిఉన్న ముప్పు 
  • స్కూళ్లు, కాలేజీలు మూసేసినా కొనసాగుతున్న కేంద్రాలు
  • సెంటర్లకు చిన్నారులను పంపేందుకు తల్లిదండ్రుల ససేమిరా 
  • పెరుగుతున్న వైరస్‌తో మొదలైన భయం


జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు : 1,600

7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు : 67,104

3-6 సంవత్సరాల పిల్లలు : 33,432

గర్భిణులు, బాలింతలు : 29,801


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, జనవరి23 : జిల్లాలో కరోనా మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. సెకండ్‌వేవ్‌ నుంచి పిల్లలు ఎలాగోలా బయటపడ్డాం అనుకునేలోపే థర్డ్‌వేవ్‌ రానేవచ్చింది. దీంతో ఇప్పటికే విద్యాసంస్థలు ఈనెల 31వరకు మూసివేశారు. కానీ అంగన్‌వాడీ కేంద్రాలు మాత్రం జిల్లాలో కొనసాగుతున్నాయి. చాపకింద నీరులా మహమ్మారి విజృంభిస్తుండటంతో చిన్నారులను కేంద్రాలకు పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. పైస్థాయి అధికారులు మాత్రం వీటిని కొనసాగించాల్సిందేనంటున్నారు. నిత్యం సూపర్‌వైజర్లు ఏదో ఒక కేంద్రాన్ని సందర్శించి పిల్లలు, తల్లులు, గర్భిణుల సంఖ్య తక్కువగా కనిపిస్తే... ఏమైంది? ఎందుకు రాలేదు? మీరు ఏమి చేస్తున్నారనే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పిల్లలు రాకుంటే... మీరు ఇంటింటికీ వెళ్లి తీసుకురావాలని ఆదేశిస్తున్నారు. దీంతో అంగన్‌వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి పిల్లలను పంపాలని ప్రాదేయపడుతున్నా ఎవరూ పంపించడం లేదు.

జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్‌పరిధిలో 7 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల కింద 1600 అంగన్‌వాఈ సెంటర్లు ఉన్నారు. ఇందులో 1,370 మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. 220 మినీ అంగన్‌వాడీ కేందాల్రు కొనసాగుతున్నాయి. ఈ సెం టర్లలో (6నెలల నుంచి 6 సంవత్సరాలు) పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు అనుబంధ పోషక ఆహారం అందిస్తున్నారు. వ్యాధి నిరోధక టీకాలు, రెఫరల్‌ సర్వీసు, ఆహార ఆరోగ్యవిద్య, పూర్వ ప్రాథమిక విద్య తదితర సేవలు అందిసున్నారు. ప్రతినెలా బాలామృతం, ఉదయం 10 గంటలకు ప్రతిరోజూ గుడ్డు, మధ్యాహ్నం 12 గంటలకు అన్నం, కూరగాయలు, పప్పు అందిస్తున్నారు. సాయంత్రం 3 గంటలకు ఉడికించిన శనగలు, న్యూట్రిన్‌ మురుకులు ఇస్తున్నారు. గర్భిణులకు, బాలింతలకు అన్నం, ఆకుకూరలతో పప్పు, కూరగాయల సాంబార్‌, ఒక పూట సంపూర్ణ భోజనం అందిస్తున్నారు. అందరితోపాటు తమ పిల్లలను పంపిస్తే వైరస్‌ అంటుకుంటుందేమో నని తల్లిదండ్రులు భయపడుతున్నారు. 


ఇరుకు గదుల్లో...

జిల్లాలో ఉన్న 1600 అంగన్‌వాడీ కేంద్రాల్లో 689 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. 324 సెంటర్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిధిలోని భవనాల్లో 455 కొనసాగుతున్నాయి. అద్దెలేని భవనాలు 132ఉన్నాయి. అద్దెభవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలు ఇరుకుగా ఉన్నాయి. పిల్లలు, తల్లులు, గర్భిణులు కూర్చుని భోజన చేసేందుకు స్థలం సరిపోవడం లేదు. కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటించటం కష్టంగా మారుతుంది. దీంతో వైరస్‌ అంటుకునే ప్రమాదం ఎక్కువగా ఉంది. 


తగ్గుతున్న పిల్లలు

కొవిడ్‌ వైరస్‌ కోరలు చాచడంతో... అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు నో అంటున్నారు. దీంతో కేంద్రాలకు వచ్చేవారి పిల్లలు, తల్లులు, గర్భిణుల సంఖ్య తగ్గుతుంది. 


కేంద్రాలకు పిల్లలను పంపించడం లేదు

థర్డ్‌వేవ్‌లో కరోనా విజృంభిస్తుండటంతో చిన్నా రులను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించడానికి ఇష్టపడటం లేదు. పిల్లలను పంపించడానికి భయపడుతున్నారు. మా పిల్లలకు ఏమైనా అయితే.. మీరు బాధ్యత వహిస్తారా అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు నచ్చజెప్పి పిల్లలను కేంద్రాలకు తీసుకువచ్చి విద్యాబుద్దులు నేర్పిస్తున్నాము.

- ఉమ, అంగన్‌వాడీ టీచర్‌, చేవెళ్ల


కరోనాతో భయం వేస్తుంది

కరోనాతో స్కూళ్లు, కాలేజీలు బంద్‌ చేశారు. కానీ అంగన్‌వాడీ సెంటర్లు బంద్‌ చేయలేదు. కరోనా ఎప్పుడు ఎవరికి సోకుతుందో భయం వేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మా పిల్లలను కేంద్రానికి పంపివ్వాలంటున్నారు.. ఏమైనా అయితే ఎవరు బాధ్యులు?. లాక్‌డౌన్‌లో ఇచ్చిన మాదిరిగా ఇంటింటికీ రేషన్‌ సరుకులు పంపిస్తే బాగుంటుంది.

- ఆసియా, చేవెళ్ల 


ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనసాగిస్తున్నాం

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలను కొనసాగిస్తున్నాం. కరోనా టైంలో పిల్లలు, గర్భిణులు బాలింతలకు పౌష్టికాహారం అందివ్వాలనే ఉద్దేశంతో కేంద్రాలు యథావిధిగా రన్‌ అవుతున్నాయి. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా కేంద్రాలు కొనసాగుతున్నాయి. 

- మోతి, జిల్లా శిశుసంక్షేమశాఖ అధికారి 


పిల్లలకు వైరస్‌ సోకే ప్రమాదముంది

చిన్న పిల్లలకు కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. జిల్లాలో ఇప్పటివరకు కాలేజీలు, స్కూళ్లు మూసివేశారు. కానీ అంగన్‌వాడీ సెంటర్లు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్రశిశుసంక్షేమశాఖ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చాం. వెంటనే అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేయాలి. పిల్లలు, తల్లులు, గర్భిణులకు లాక్‌డౌన్‌లో ఇచ్చిన మాదిరిగానే ఇంటికి పౌష్టికాహారం అందించాలి. 

- జి. కవిత, అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి


కరోనా వైరస్‌ విజృంభణ 

జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. సంక్రాంతి తర్వాత నుంచి పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మహమ్మారి కమ్మేస్తున్నా.. ప్రజల్లో నిర్లక్ష్యం వీడటం లేదు. మాస్కులు ధరించకపోవడం... భౌతికదూరం పాటించపోవడంతో వైరస్‌ బారిన పడుతున్నారు. జిల్లాలో కేవలం ఆరు రోజుల్లో 7,233 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీలో 3,610 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నాన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 3,623 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈనెల 22వ తేదిన అత్యధికంగా 1,607 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈనెల 23న ఆదివారం సెలువు దినం కావడంతో పరీక్షల సంఖ్య తగ్గింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా తగ్గింది. ఆదివారం 581 పాజిటివ్‌లు వచ్చాయి. ఇందులో జీహెచ్‌ఎంసీలో 294 పాజిటివ్‌లు, నాన్‌ జీహెచ్‌ఎంసీలో 287 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


చురుగ్గా ఇంటింటి ఫీవర్‌ సర్వే

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యఆరోగ్యశాఖ ఇంటింటి జ్వరం సర్వే చేపట్టింది. ఈనెల 21న ప్రారంభమైన ఈ సర్వే జిల్లాలో చురుగ్గా సాగుతుంది. వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారికి సూచనలు సలహాలిస్తున్నారు. హోమ్‌ ఐసోలేషన్‌ కిట్టు అందజేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి ఎప్పటికప్పుడు సర్వే వివరాలను తెలుసుకుంటున్నారు. సర్వే తీరును ఆమె పరిశీలిస్తున్నారు. గ్రామాల్లో పర్యటించి వైద్య సిబ్బందికి సూచనలిస్తున్నారు. ఇప్పటివరకు 58,632 ఇళ్లను సర్వే చేశారు. 1965 మందికి జ్వరం లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వారికి హోంఐసోలేషన్‌ కిట్లు అందజేశారు. ఇంటింటి సర్వేలో భాగంగా ఆదివారం 588 ఓపీ కేసులు వచ్చాయి. 259 మందికి జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించి వారికి మందులు అందజేశారు.


కరోనా కేసుల వివరాలు

తేది జీహెచ్‌ఎంసీ నాన్‌ జీహెచ్‌ఎంసీ మొత్తం కేసులు

18 591 594 1,185

19 470 446 916

20 747 775 1,522

21 701 721 1,422

22 807 800 1,607

23 294 287 581

మొత్తం 3,610 3,623 7,233



Updated Date - 2022-01-24T04:30:12+05:30 IST