Shocking Incident: ఇలాంటి మనవరాళ్లు ఏ అవ్వకూ ఉండకూడదు.. 90 ఏళ్ల వృద్ధురాలిని కనికరం లేకుండా..

ABN , First Publish Date - 2022-05-07T21:18:14+05:30 IST

మానవత్వం మంటగలిసిందని మరోసారి రుజువు చేసిన ఘటన ఇది. బంధాలకు మనిషి ఏరకంగా తిలోదకాలు వదులుతున్నాడో, బంధాలను భారంగా భావిస్తూ వదిలించుకోవడానికి ఎంత కర్కశంగా మారుతున్నాడో..

Shocking Incident: ఇలాంటి మనవరాళ్లు ఏ అవ్వకూ ఉండకూడదు.. 90 ఏళ్ల వృద్ధురాలిని కనికరం లేకుండా..

తిరునల్వేలి: మానవత్వం మంటగలిసిందని మరోసారి రుజువు చేసిన ఘటన ఇది. బంధాలకు మనిషి ఏరకంగా తిలోదకాలు వదులుతున్నాడో, బంధాలను భారంగా భావిస్తూ వదిలించుకోవడానికి ఎంత కర్కశంగా మారుతున్నాడో చెప్పడానికి ఉదాహరణగా నిలిచిన ఘటన ఇది. ఇంతటి అమానుష ఘటన గురించి గతంలో చదివి ఉండరేమో. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలో వెలుగుచూసింది.



ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లై (తిరునల్వేలి) జిల్లా పెట్టై పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టై-పాలయపెట్టై లింక్ రోడ్‌లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు ఓ వృద్ధురాలి మృతదేహాన్ని గుర్తించారు. ఆ వృద్ధురాలి శరీరం అంతా మంటల్లో కాలిపోయింది. ఆమె వయసు 90 ఏళ్లకు పైగానే ఉండొచ్చని పోలీసులు భావించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణలో పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. ఆ వృద్ధురాలిని ఆమె మనవరాళ్లే పెట్రోల్ పోసి తగలబెట్టారని తెలిసి పోలీసులు నిర్ఘాంతపోయారు. ఆ వృద్ధురాలి పేరు సుబ్బమ్మల్(90). పాలయపెట్టై ప్రాంతానికి చెందిన మరియమ్మల్(30), ఆమె అక్క మేరీ(38) ఆ వృద్ధురాలి మనవరాళ్లు.



ఆ ముసలామెను చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉండటంతో ఇన్నాళ్లూ తిట్టుకుంటూ చూసుకున్నారు. ఇటీవల ఆ వృద్ధురాలి ఆరోగ్యం క్షీణించింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించడం ఖర్చు దండగనుకున్నారో ఏమో కానీ ఇక ఆమెను చూసుకోలేమని చేతులెత్తేసే స్థితికి అక్కాచెల్లెళ్లు దిగజారిపోయారు. ఆమె బతికి ఉంటే ముసలామెను సక్రమంగా చూసుకోవడం లేదని సమాజం నిందిస్తుందని భావించి ఓ దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి తగలబెట్టి చేతులు దులుపుకోవాలని భావించారు. అందుకు స్థానికంగా ఉన్న ఓ ఆటో డ్రైవర్ సాయం కోరారు. అతనికి డబ్బు ముట్టజెప్పడంతో ఆ ఆటో డ్రైవర్ కూడా ఆ అక్కాచెల్లెళ్లు చేసిన దారుణానికి సహకరించాడు. ఆటోలో ఆ వృద్ధురాలిని తీసుకెళ్లి పెట్రోల్ పోసి ఈ అక్కాచెల్లెళ్లు సజీవ దహనం చేశారు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు మరియమ్మల్‌, మేరీ, ఈ అక్కాచెల్లెలికి సహకరించిన ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.

Read more