ప్యాడ్‌ఉమన్‌

ABN , First Publish Date - 2021-05-12T05:30:14+05:30 IST

‘‘ఎప్పుడూ మన కోసం మనమే కాకుండా... చుట్టూ ఉన్నవారి గురించి కూడా ఆలోచించాలి. దీన్ని ప్రతిఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా భావించాలి’’ అంటారు శ్రీనగర్‌కు చెందిన 28 ఏళ్ల ఇర్ఫానా జర్గార్‌...

ప్యాడ్‌ఉమన్‌

‘‘ఎప్పుడూ మన కోసం మనమే కాకుండా... చుట్టూ ఉన్నవారి గురించి కూడా ఆలోచించాలి. దీన్ని ప్రతిఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా భావించాలి’’ అంటారు శ్రీనగర్‌కు చెందిన 28 ఏళ్ల ఇర్ఫానా జర్గార్‌. ఋతుక్రమ సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను గమనించిన ఆమె... ఉచితంగా శానిటరీ కిట్స్‌ అందిస్తున్నారు. తను సంపాదించే కొద్దిమొత్తంలోనే సగం ఈ కార్యక్రమానికి కేటాయిస్తున్నారు... 


కశ్మీర్‌ లోయలో ఇర్ఫానా జర్గార్‌ పేరు బాగా పరిచయం. కారణం... ఆమె రోజూ శ్రీనగర్‌, కశ్మీర్‌ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతుంటారు. అక్కడి పబ్లిక్‌ టాయ్‌లెట్స్‌, బస్టాండ్స్‌ తదితర ప్రదేశాల్లో శానిటరీ నేప్కిన్స్‌ అందుబాటులో ఉంచుతారు. రుతుక్రమ సమయంలో సరైన శానిటరీ నేప్కిన్స్‌ లేక ఆడవాళ్లు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో ఇర్ఫానాకు బాగా అనుభవం. దానికి ఎవరినో నిందించకుండా... ఇంకెవరో వచ్చి ఏదో చేయాలనుకోకుండా తను చేయగలిగింది చేద్దామనుకున్నారు. ఆ క్రమంలోనే ‘ఎవా సేఫ్టీ కిట్‌’ పేరుతో ఒక క్యాంపెయిన్‌ చేపట్టారు. ఋతుక్రమ సమయంలో మహిళలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే దీని ఉద్దేశం. 

ఇర్ఫానా అందించే శానిటరీ కిట్‌లో నేప్కిన్స్‌, అవసరమైన మెడిసిన్స్‌, హ్యాండ్‌వాష్‌ ఉంటాయి. ఈ కిట్‌ కోసం ఎలాంటి ఫీజూ వసూలు చెయ్యరు. మహిళల కోసం ఏదోఒకటి చేయాలని పరితపించే ఇర్ఫానా... ఈ క్యాంపెయిన్‌ను తన తండ్రి గులామ్‌ హసన్‌ జర్గార్‌కు అంకితమిచ్చారు. 


చిరుద్యోగం... అందులోనే కొంచెం... 

‘‘2014లో మా నాన్న గుండెపోటుతో చనిపోయారు. ఆయన జ్ఞాపకంగా నలుగురికీ ఉపయోగపడే ఒక మంచి పని చేయాలనుకున్నాను. అందులో భాగంగానే ఇలా ఉచితంగా శానిటరీ కిట్స్‌ పంపిణీ చేస్తున్నాను. దీని కోసం నేను ఎలాంటి స్వచ్ఛంద సంస్థనూ నెలకొల్పలేదు. ప్రభుత్వం సాయమూ కోరలేదు. ‘శ్రీనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌’ (ఎస్‌ఎంసీ)లో నేను ఓ చిరుద్యోగిని. కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్నా. వచ్చేదాంట్లోనే నెల నెలా కొంత మొత్తాన్ని కిట్ల పంపిణీకి వెచ్చిస్తున్నాను’’ అంటారు ఇర్ఫానా. ముఖ్యంగా నాణ్యమైన శానిటరీ నేప్కిన్స్‌ కొనుక్కొనే శక్తిలేని వారిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆమె. జీతంలో సగ భాగం ఇందు కోసం ఖర్చు చేస్తున్నారు. తన చుట్టుపక్కల ఉన్న అభాగ్యులైన యువతుల వద్దకు వెళ్లి కిట్స్‌ ఇస్తున్నారు. 


కరోనా సమయంలోనూ... 

రోజూ తన ఉద్యోగంతో పాటు శానిటరీ కిట్లు పంచడానికి కూడా కొంత సమయం కేటాయిస్తారు ఇర్ఫానా. ఆఖరికి కరోనా వల్ల దేశమంతా లాక్‌డౌన్‌ నడుస్తున్నా తన కార్యక్రమాన్ని ఆపలేదు. ఎన్ని అడ్డంకులు, ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. శానిటరీ కిట్ల కోసం తనను సంప్రతించే వారిలో భర్తకు దూరంగా ఉంటున్నవారు, భర్తను కోల్పోయినవారు, అంగవైకల్యం గల మహిళలే ఎక్కువగా ఉంటారంటారు ఇర్ఫానా. 

‘‘కరోనా వల్ల వాళ్ల ఆర్థిక ఇబ్బందులు రెట్టింపయ్యాయి. లాక్‌డౌన్‌తో ఉపాధినీ కోల్పోయారు. అలాంటి మహిళలందరూ కిట్ల కోసం మా ఇంటికి వచ్చేవారు’’ అంటున్న ఆమె విపత్కర కాలంలో డోర్‌ డెలివరీ కూడా ప్రారంభించారు. గత ఏడాది కాలంలో పది వేలకు పైగా శానిటరీ కిట్లు పంపిణీ చేసిన ఇర్ఫానా... అటు కుటుంబాన్ని చూసుకొంటూనే ఇటు సేవా కార్యక్రమాన్నీ కొనసాగిస్తున్నారు.


Updated Date - 2021-05-12T05:30:14+05:30 IST