టీచర్ ఇచ్చిన లెటర్‌ను తల్లికి ఇచ్చి చదవమన్నాడు.. ఆమె కన్నీరు పెట్టుకుంది.. కొన్నాళ్లకు అదే లెటర్ చూసి నిర్ఘాంతపోయాడు.. ఎడిసన్ జీవితంలో అద్భుత ఘటన!

ABN , First Publish Date - 2021-12-14T17:23:23+05:30 IST

అవి ప్రముఖ ఆవిష్కర్త థామస్ అల్వా ఎడిసన్..

టీచర్ ఇచ్చిన లెటర్‌ను తల్లికి ఇచ్చి చదవమన్నాడు.. ఆమె కన్నీరు పెట్టుకుంది.. కొన్నాళ్లకు అదే లెటర్ చూసి నిర్ఘాంతపోయాడు.. ఎడిసన్ జీవితంలో అద్భుత ఘటన!

అవి ప్రముఖ ఆవిష్కర్త థామస్ అల్వా ఎడిసన్ పాఠశాలలో చదువుకుంటున్న రోజులు.. ఒక రోజు ఎడిసన్ స్కూలు నుంచి వస్తూ తనతో పాటు ఒక లెటర్ తీసుకువచ్చాడు. దానిని తన తల్లికి ఇచ్చి.. ఇది స్కూలులో తనకు ఇచ్చారని, దానిలో ఏముందో గట్టిగా చదవి వినిపించమన్నాడు. తల్లి ఆ లెటర్‌ను తెరిచి, చదవడం ప్రారంభించింది. ఆ లెటర్ చదువుతున్న ఆమెకు కళ్లు చమర్చాయి. ఆమె తన కుమారుడు థామస్‌ను దగ్గరకు తీసుకుంది. వెంటనే థామస్.. ‘అమ్మా ఇందులో ఏమి రాసివుంది?’ అని అడిగాడు. ఆమె ఆ లెటర్‌ను బిగ్గరగా చదవడం ప్రారంభించింది... ‘మీ కుమారుడు జీనియస్ అని, థామస్ అద్భుతమైన తెలివితేటలు కలిగిన వాడని, అయితే తాము ఇటువంటి కుర్రాడికి తమ స్కూలులో చదువు చెప్పలేమని, దానికి కారణం ఇక్కడ సరైన ఉపాధ్యాయులు లేకపోవడమేనని వారు తెలిపారు. అందుకే థామస్‌కు ఇంటిలోనే చదువు చెప్పాలని సలహా ఇచ్చారని అమె థామస్‌కు తెలిపింది.






ఆ రోజు నుంచి థామస్‌కు ఆమె తల్లి ఇంటిలోనే చదువు చెప్పసాగింది. థామస్ కూడా చదువుపై అమితమైన శ్రద్ధ కనబరిచేవాడు. తరువాతి కాలంలో థామస్ ఎడిసన్ ప్రపంచంలోనే గొప్ప ఆవిష్కర్తగా మారారు. బల్బును కనిపెట్టి 1093లో దానికి పేటెంట్ పొందారు. తరువాత విజయవంతమైన బిజినెస్ మ్యాన్‌గా మారారు. థామస్ విజయపరంపర కొనసాగిస్తున్న సమయంలోనే అతని తల్లి కన్నుమూసింది. ఒకరోజు థామస్ తన ఇంటిని శుభ్రపరుస్తుండగా ఒక లెటర్ కనిపించింది. అది తాను పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో ఉపాధ్యాయులు తనకు ఇచ్చిన లెటర్. దానిలో ఇలా ఉంది.. ‘మీ కుమారుడు థామస్ మానసికంగా చాలా బలహీనుడు. ఇలాంటి కుర్రాడికి మా స్కూలులో చదువు చెప్పలేం. దయచేసి మీ అబ్బాయికి మీ ఇంటిలోనే చదువు నేర్పండి’ అనివుంది. ఈ లెటర్ చదవగానే థామస్ కళ్లు చమర్చాయి. 


అప్పుడు థామస్‌కు.. ఆరోజు తన తల్లి ఎంతో గొప్పకార్యం చేసిందని, ఫలితంగా తనకు ఎంతో ఉపకారం జరిగిందని అనిపించింది. ఆ లెటర్‌లో ఉన్నది ఉన్నట్లు తన తల్లి చదివివుంటే.. తాను ఇన్ని ఆవిష్కరణలు చేసే అవకాశమే ఉండేదికాదని అనుకుంటూ.. థామస్ తన తల్లికి మనసులోనే కృతజ్ఞతలు తెలిపారు. థామస్ జీవితంలోని ఈ ఘటన ద్వారా మనం ఒక అమూల్యమైన విషయాన్ని తెలుసుకోవచ్చు. సాధారణంగా చాలామంది ఎదుటివాటి లోపాలను చూసి వారిని కించపరిచి, వారిలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటారు. ఇలా చేయడం వలన వారు మరింత కుంగిపోతారు. దీనికి బదులు లోపాలున్నవారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేయడం వలన మనమూ మంచిపని చేసినవారమవుతాం.

Updated Date - 2021-12-14T17:23:23+05:30 IST