రామకృష్ణుడి తెలివి!

ABN , First Publish Date - 2021-03-19T05:30:00+05:30 IST

ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో ఒక దొంగల ముఠా వరుస దొంగతనాలకు పాల్పడసాగింది. సైనికులు వారిని పట్టుకోలేకపోవడంతో కృష్ణదేవరాయలు కోపంగా ఉన్నారు

రామకృష్ణుడి తెలివి!

ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో ఒక దొంగల ముఠా వరుస దొంగతనాలకు పాల్పడసాగింది. సైనికులు వారిని పట్టుకోలేకపోవడంతో కృష్ణదేవరాయలు కోపంగా ఉన్నారు. దొంగలను పట్టుకోవడంలో ఆయన తెనాలి రామకృష్ణుడి సాయం కోరారు. ఇంటికి వచ్చాక రామకృష్ణుడు తన భార్యతో ‘మనవద్ద ధనం చాలా ఉందని అందరితో చెప్పు’ అన్నాడు. మరుసటి రోజు నుంచి ప్రజలందరూ రామకృష్ణుడి సంపద గురించి మాట్లాడుకోసాగారు. ఈ విషయం దొంగల చెవిన పడింది. వారి నాయకుడు ‘రామకృష్ణుడి మీద ఓ కన్నేసి ఉంచాలి’ అని వారితో చెప్పాడు. దొంగల్లో ఒకరు రామకృష్ణుడి ఇంటిలో పనిమనిషిగా చేరాడు. అతడు దొంగని తెలిసినా రామకృష్ణుడు ఏమీ తెలియనట్టే ఉన్నాడు. ఆ రోజు రాత్రి రామకృష్ణుడు భార్యతో ‘మన డబ్బును ఆ దొంగల ముఠా కంటపడకుండా దాచిపెట్టాలి’ అన్నాడు. ‘అయితే మన డబ్బుల పెట్టెను బావిలో పడేద్దాం. 


నీటి అడుగున భద్రంగా ఉంటుంది’ అంది అతడి భార్య. వెంటనే ఒక పెద్ద చెక్కపెట్టెలో ఇటుకలు వేసి, దానికి తాళం వేసి ఆ పెట్టెను లాక్కొచ్చి తమ ఇంటి ఆవరణలోని బావిలో పడేశారు. వారిని గమనిస్తున్న దొంగ వారి నాయకుడి దగ్గరకు వెళ్లి ‘రామకృష్ణుడు ధనం ఎక్కడ దాచాడో నాకు తెలుసు’ అంటాడు. మరునాడు రాత్రి బావి దగ్గరకు వచ్చిన దొంగలకు ఆ పెట్టెను పైకి ఎలా తీయాలో అర్థం కాలేదు. వారిలో ఒకడు ‘ముందుగా బావిలోని నీటిని తోడుదాం. అప్పుడు పెట్టెను బయటకు తేవడం సులువవుతుంది’ అనగానే అందరూ సరేనన్నారు. వారు తోడిన నీటిని రామకృష్ణుడు మొక్కలకు వెళ్లేలా చేయసాగాడు. కొద్దిసేపటికి ‘ఇక ఆపండి. అన్ని మొక్కలకు నీరు అందింది’ అని రామకృష్ణుడు అనగానే దొంగలకు అసలు విషయం అర్థమైంది. దొంగల ముఠా ఆటకట్టించిన రామకృష్ణుడిని కృష్ణదేవరాయలు కానుకలతో సన్మానించారు. 

Updated Date - 2021-03-19T05:30:00+05:30 IST