కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2021-04-18T05:45:21+05:30 IST

కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌ రెడ్డి అన్నారు.

కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేయాలి
నేర సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీపీ వీబీ కమలాసన్‌ రెడ్డి


- పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌ రెడ్డి

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 17: కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌ రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కేసుల్లో సత్వరమే స్పందిస్తూ విచారణ జరిపి నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కేంద్రంలో శనివారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ఎఫ్‌ఎస్‌ఎల్‌, ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌, ఇతర కేంద్రాల్లో పెండింగ్‌లో ఉన్న నివేదికలను వెంటనే తెప్పించుకుని సంబంధిత కేసుల చార్జీషీటును న్యాయస్థానాల్లో దాఖలు చేయాలన్నారు. చార్జిషీట్లు దాఖలు చేసిన కేసుల్లో సీసీ నెంబర్లను తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రమాదానికి కారణమైన సదరు వాహనం డ్రైవర్‌ మద్యం సేవించి ఉన్నాడో లేదో తెలుసుకునేందుకు సమీప ఆసుపత్రుల్లో రక్తనమూనాలను సేకరించాలన్నారు. ప్రమాదాల సందర్భంగా పోలీస్‌స్టేషన్లకు తరలించిన వాహనాలను వారం రోజుల్లో సంబంధిత వాహనదారులకు అందజేయాలన్నారు. స్టేషన్లలో వాహనాలు పేరుకుపోవడం వల్ల స్థలం వృథా అవుతోందని తెలిపారు. పెండింగ్‌ వారెంట్ల అమలుకు కొనసాగిస్తున్న ఆపరేషన్‌ తలాష్‌ సత్ఫలితాలను ఇస్తోందని, వారెంట్ల అమలు బృందాలకు చెందిన పోలీసులు నూతానోత్సాహంతో పనిచేస్తున్నారని అభినందించారు.  ఎక్కువ వారెంట్లను అమలు చేస్తున్న బృందాలకు నగదు రివార్డులను అందజేస్తామన్నారు. పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలని, ప్రతినెల జరిగే హిస్టరీ షీటర్ల మేళాలకు గైర్హాజరు అవుతున్న వారి వివరాలను సేకరించి సంబంధిత తహసీల్దార్‌ల ఎదుట బైండోవర్‌ చేయించాలని ఆదేశించారు. పాత నేరస్థులు ఇతర ప్రాంతాల్లో ఉపాధి కోసం జీవనాన్ని కొనసాగిస్తున్నట్లయితే సంబంధిత పోలీస్‌స్టేషన్లకు సదరు హిస్టరీ షీట్లను బదిలీ చేయాలని తెలిపారు. పాత నేరస్థులు సత్ప్రవర్తనతో మెదిలినట్లయితే వారిపై ఉన్న కేసులను తొలగిస్తామని ప్రకటించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారులు వారి పోలీస్‌స్టేషన్లు, సర్కిళ్ల ప్రాంతాల్లోని గ్రామాల్లో పర్యటించాలన్నారు. పోలీస్‌స్టేషన్ల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని, వారంలో ఒక రోజు అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు శ్రమదానం చేసి  ఆవరణను అలంకారప్రాయంగా తీర్చిదిద్దాలని చెప్పారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ ఆవరణ ఆహ్లాదకరంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవడంతోపాటు పోలీస్‌ స్టేషన్లకు వచ్చే ప్రజలకు కనీస వసతులు కల్పించాలని తెలిపారు. ఇటీవల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను టెక్‌డామ్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. వివిధ పోలీస్‌ స్టేషన్లకు చెందిన వాహనాలను నెలవారీగా నిర్వహించే తనిఖీలను ఎంటీవో విభాగం ఆర్‌ఐ జానీమియా చేపట్టారు. ఈ సందర్భంగా కొవిడ్‌వ్యాప్తి నియంత్రణ చర్యలు, డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు.  సమావేశంలో అడిషనల్‌ డీసీపీ(ఎల్‌అండ్‌వో) ఎస్‌ శ్రీనివాస్‌, ఏసీపీలు పి అశోక్‌, జె విజయసారధి, సుందరగిరి శ్రీనివాసరావు, కె శ్రీనివాస్‌, తుల శ్రీనివాసరావు, ఆర్‌ ప్రకాష్‌, విజయ్‌కుమార్‌, అడ్మినిస్ర్టేటివ్‌ అధికారి ఉమేశ్‌ కుమార్‌, ఎస్‌బీఐ వి శ్రీనివాస్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-18T05:45:21+05:30 IST