2025 కల్లా జోజిలా టన్నెల్‌ రెడీ!

Sep 28 2021 @ 00:02AM

  •  నిర్దేశిత గడువు కన్నా ఏడాది ముందే నిర్మాణం పూర్తి
  •  మేఘా ఇంజనీరింగ్‌ లక్ష్యం 
  •  ప్రాజెక్ట్‌ వ్యయం రూ.4,600 కోట్లు
  •  రక్షణ, ఆర్థికపరంగా వ్యూహాత్మక రహదారిపై నిర్మాణం


లేహ్‌-లద్దాఖ్‌ ప్రాంతాన్ని శ్రీనగర్‌తో కలిపే మార్గంలో మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (ఎంఈఐఎల్‌) నిర్మిస్తున్న జోజిలా టన్నెల్‌ను నిర్ణీత సమయం కంటే ఏడాది ముందుగానే నిర్మించాలని ఎంఈఐఎల్‌ భావిస్తోంది. 14.15 కిలోమీటర్ల నిడివితో నిర్మిస్తున్న ఈ టన్నెల్‌ పూర్తయితే.. దేశంలోనే అతి పొడవైన రోడ్‌ టన్నెల్‌ అవుతుంది. అంతే కాక ఆసియాలోనే అతి పొడవైన బై డైరెక్షనల్‌ సొరంగ మార్గం కూడా ఇదే అవుతుంది. రూ.4,600 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ టన్నెల్‌ మార్గంలో బ్రిడ్జ్‌లు కూడా నిర్మిస్తారు. వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల పనులు ఆగకుంటే నిర్ణీత సమయం కంటే ఏడాది ముందుగానే జోజిలా టన్నెల్‌ను పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది.


ముందుగా నిర్ణయించిన ప్రకారం జోజిలా సొరంగం నిర్మాణాన్ని 2026 నాటికి పూర్తి చేయాల్సి ఉందని నేషనల్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  గుర్జిత్‌ సింగ్‌ కాంబో తెలిపారు. 2020 అక్టోబరులో టన్నెల్‌ నిర్మాణాన్ని మేఘా ఇంజనీరింగ్‌ ప్రారంభించింది. ఇప్పటి వరకూ దాదాపు 7 శాతం నిర్మాణం పూర్తయిందన్నారు. 


హైదరాబాద్‌ కంపెనీల మద్దతు

జోజిలా సొరంగానికి సంబంధించిన అన్ని పనులు ప్రారంభమయ్యాయి. 300-400 మీటర్ల పనులను పూర్తి చేశాం. పనులు ఊపందుకుంటున్నాయని  మేఘా ఇంజనీరింగ్‌ డీజీఎం (ప్రాజెక్ట్స్‌) ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఇంజనీర్లతో సహా 1,500 మంది పని చేస్తున్నారని చెప్పారు. సొరంగం నిర్మాణంలో హైదరాబాద్‌కు చెందిన కంపెనీలు కూడా పాలుపంచుకుంటున్నాయని, సొరంగం నిర్మాణానికి అవసరమైన పైప్‌ రూపింగ్‌లు, రాక్‌ టూల్స్‌ వంటివి సరఫరా చేస్తున్నాయని అన్నారు. 


ప్రయాణ దూరం తగ్గుతుంది

జోజిలా సొరంగాన్ని పూర్తి చేస్తే శ్రీనగర్‌, లద్దాఖ్‌ల మధ్య రహదారి మార్గంలో ఏడాది మొత్తం వాహనాలు ప్రయాణించడానికి వీలుంటుంది. బల్తాల్‌, మీనామార్గ్‌ మధ్య దూరం 40 కిలోమీటర్ల నుంచి 13 కిలోమీటర్లకు తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా 1.5 గంటలు తగ్గుతుందని ప్రశాంత్‌ తెలిపారు.


 శ్రీనగర్‌, లేహ్‌-లద్దాఖ్‌ ప్రాంతం మధ్య ఉండే రహదారి రక్షణ, ఆర్థిక, వ్యూహాత్మకంగా కూడా కీలకమైంది. ఈ రహదారిలో చలి కాలం మంచు కురవడం వల్ల ఏడాది మొత్తం వాహనాలు తిరిగేందుకు వీలుండదు. కొన్ని నెలలు మాత్రమే ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మార్గాన్ని రెండు భాగాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకు మొత్తం రూ.6,900 కోట్లు ఖర్చు చేస్తుండగా.. రూ.4,600 కోట్లతో జోజిలా సొరంగ మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ రహదారి అభివృద్ధి పనులను  కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం సందర్శించి సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ ఈడీ కాంబో మాట్లాడారు. 


(సోనామార్గ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)టన్నెల్‌ విశేషాలు


   ఆసియాలోనే అతి పొడవైన సొరంగ మార్గం 

   2020 అక్టోబరులో కేంద్ర మంత్రి గడ్కరీ చేతుల మీదుగా పనులు ప్రారంభం 

   శ్రీనగర్‌-లద్దాఖ్‌ మధ్య ప్రస్తుత ప్రయాణ సమయం మూడున్నర గంటలు

   టన్నెల్‌ పూర్తయితే ప్రయాణ సమయం 15 నిమిషాలకు తగ్గుతుంది

   సొరంగ మార్గం అందుబాటులోకి వస్తే ఈ మార్గంలో ఏడాదంతా ప్రయాణించే అవకాశం

   అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో రవాణాకు ఉపయోగపడేలా సొరంగం నిర్మాణం


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.