‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-03-21T20:34:53+05:30 IST

‘ద కశ్మీర్ ఫైల్స్’ ఈ సినిమా ప్రధాని మోదీ మొదలుకొని, రైట్ వింగ్ భావజాలం ఉన్న ప్రతి ఒక్కరు ప్రసంశలు కురిపిస్తున్నారు.

‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: ‘ద కశ్మీర్ ఫైల్స్’ ఈ సినిమాపై ప్రధాని మోదీ మొదలుకొని, రైట్ వింగ్ భావజాలం ఉన్న ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. వామపక్ష పార్టీలు, దళిత సంఘాల నేతలు, ప్రజాస్వామిక వాదులు ఈ సినిమాపై విమర్శలు సంధిస్తున్నారు. ఇలా ఈ సినిమాపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. ఈ సినిమా ఎంత వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందో అంతే స్థాయిలో ఆ చిత్ర దర్శకుడు వివేక్ అగ్రిహోత్రిపై కూడా వివాదాలున్నాయి. ఈ సినిమా కశ్మీర్‌లో హిందూ పండిట్‌ల ఊచకోత ప్రధాన అంశంగా తెరకెక్కింది. ఆనాటి సంగతులను కళ్లకు కట్టినట్లు చూపించారని కొందరు అంటుంటే.. మరి కొందరు సినిమాలోని సన్నివేశాలు కల్పితాలని కొట్టిపారేస్తున్నారు. బీజేపీ పాలిత కొన్ని రాష్ట్రాల్లో కశ్మీర్ ఫైల్స్ సినిమాకు వినోదపు పన్ను మినహాయించారు. వినోదపు పన్ను రద్దు చేయడం కూడా మరో వివాదమైంది. సామాజిక ఇతి వృత్తాలే ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాలకు పన్నులు తగ్గించమని కోరినా మెట్టు దిగని ప్రభుత్వాలు.. కశ్మీర్ ఫైల్స్ సినిమాకు అడగకుండానే వినోదపు పన్ను తగ్గించారని, ఇలా చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని కొందరు ప్రశ్నింస్తున్నారు. సో.. ఏది ఏమైనా ప్రశంసలు, విమర్శలు మధ్య కశ్మీర్ ఫైల్స్ సినిమా దిగ్విజయంగా పదర్శించబడుతోంది. 


కేంద్రంపై యుద్ధానికి ‘సై’ అంటున్న సీఎం కేసీఆర్.. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే.. కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని తెరపైకి తెచ్చారని తప్పుబట్టారు. కశ్మీర్‌లో హిందూ పండిట్‌లను చంపినప్పుడు బీజేపీ అధికారంలో లేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు చర్చ జరగాల్సింది చిత్రాలపై కాదని, రైతు సమస్యలపై చర్చ జరగాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈనెల 25 నుంచి టీఆర్ఎస్ ‘రైతు పోరు’ పేరుతో ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలుపై ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడాలని ఆదేశించారు. తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం సాగాలన్నారు. రైతులు వేసే పంటలన్నింటికీ కేంద్రం గిట్టుబాటు ధర ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈనెల 24, 25 తేదీల్లో రైతు సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. లీగల్ సమస్యలు లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని చెప్పారు. 28న నేతలంతా యాదాద్రికి రావాలని కేసీఆర్ సూచించారు.


Updated Date - 2022-03-21T20:34:53+05:30 IST