ఓటీటీ ప్లాట్‌ఫాంలో రికార్డులను తిరగరాసిన The Kashmir Files

Published: Fri, 20 May 2022 18:17:57 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఓటీటీ ప్లాట్‌ఫాంలో రికార్డులను తిరగరాసిన The Kashmir Files

కశ్మీర్ పండిట్‌లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ద కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్స్‌లో కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ చిత్రానికీ వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri ) దర్శకత్వం వహించాడు. కరోనా అనంతరం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద  రూ. 250కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం మే 13నుంచి ‘జీ-5’ (ZEE5) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. డిజిటల్ ప్లాట్‌ఫాంలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఈ చిత్రం రికార్డులను తిరగరాస్తుంది. 


‘ద కశ్మీర్ ఫైల్స్’ ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన మొదటి వీకెండ్‌లోనే 6మిలియన్స్‌కు పైగా వ్యూస్, 220మిలియన్స్‌కు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ లభించాయని ‘జీ-5’ తెలిపింది. మొదటి వారంలో ఈ చిత్రానికీ 9మిలియన్స్‌కు పైగా వ్యూస్, 300మిలియన్స్‌కు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ లభించాయని ఆ సంస్థ పేర్కొంది. ‘జీ-5’ డిజిటల్ ప్లాట్‌ఫాంలో గతంలో ఉన్న రికార్డులన్నింటిని ఈ చిత్రం తిరగరాసింది. ‘జీ-5’ ప్లాట్‌ఫాం ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, హిందీతో పాటు ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో విడుదల చేసింది. ఇండియన్ సైన్ భాషలో విడుదలైన మొదటి బాలీవుడ్ మూవీ ఇదే. ‘ది కశ్మీర్ ఫైల్స్’లో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమాకు అద్భుతమైన స్పందన రావడంతో ‘జీ-5’ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీశ్ కల్రా మీడియాతో మాట్లాడాడు. ‘‘మా ఓటీటీ ప్లాట్‌ఫాంలో ‘ది కశ్మీర్ ఫైల్స్‌కు’ వచ్చిన స్పందన చూసి చాలా సంతోషమేసింది. చరిత్రలో చోటు చేసుకున్న అనేక ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల నుంచి ఈ మూవీకి మంచి ఆదరణ లభించింది. ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ సినిమాను చూడాలనుకున్నాం. అందుకే తెలుగు, తమిళ్, కన్నడ, ఇండియన్ సైన్ భాషల్లో విడుదల చేశాం. ఈ చిత్రం ఇచ్చిన ప్రోత్సహంతో  ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్ చేయడానికీ ప్రయత్నిస్తాం’’ అని మనీశ్ చెప్పాడు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International