రాజు కల!

ABN , First Publish Date - 2021-02-18T06:29:26+05:30 IST

ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు విచారంగా ఉన్నాడు. అది చూసిన తెనాలి రామకృష్ణ ‘ఏం జరిగింది? మహారాజా!’ అని అడిగాడు. అప్పుడు రాజు ‘‘ఒక కల నన్ను ఇబ్బంది పెడుతోంది’’ అన్నాడు.

రాజు కల!

ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు విచారంగా ఉన్నాడు. అది చూసిన తెనాలి రామకృష్ణ ‘ఏం జరిగింది? మహారాజా!’ అని అడిగాడు. అప్పుడు రాజు ‘‘ఒక కల నన్ను ఇబ్బంది పెడుతోంది’’ అన్నాడు. ‘‘ఏంటా కల?’’ అని కుతుహులంగా అడిగాడు రామకృష్ణ. ‘‘మేఘాలలో ఒక అందమైన కోట తేలియాడుతోంది. విలువైన రాళ్లతో నిర్మించిన ఆ కోటలో, ఆకర్షణీయమైన తోటలు ఉన్నాయి. అంతలోనే కల చెదిరిపోయింది. ఆ కలను మరిచిపోలేకపోతున్నాను’’ అంటూ తనకు వచ్చిన కల గురించి వివరించాడు రాజు. అలాంటి కలల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని రామకృష్ణ చెప్పబోతుండగా, మరో మంత్రి చాతుర్‌ పండిట్‌ కలగజేసుకుంటూ అలాంటి కలలను నిజం చేసుకోవాలని అన్నాడు. మరో కోట నిర్మాణం చేపడితే అందినకాడికి డబ్బులు నొక్కేయవచ్చని చాతుర్‌ పండిట్‌ ఆలోచన. ఆయన ఆలోచనను రామకృష్ణ పసిగట్టాడు.  చాతుర్‌ ఆలోచనకు ఎలాగైనా బ్రేక్‌ వేయాలని అనుకున్నాడు మనసులో.


మరుసటి రోజు న్యాయం చేయమని కోరుతూ ఒక ముసలి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయల సభకు వచ్చాడు. ‘‘నీ సమస్య ఏంటో చెప్పు. నీకు తప్పక న్యాయం చేస్తాను’’ అని వాగ్దానం చేశాడు రాజు. ‘‘నేనొక వ్యాపారిని. వారం రోజుల క్రితం దొంగలు నా ఇంట్లో దూరి, నా కుటుంబసభ్యులను చంపి ధనమంతా దోచుకెళ్లిపోయారు’’ అని చెప్పాడు వృద్ధుడు. ‘‘వాళ్లెవరో తెలుసా? వాళ్లను గుర్తుపట్టగలవా?’’ అని అడిగాడు రాజు. ‘‘నిన్న నాకు మరో కల వచ్చింది. అందులో విజయనగర సామ్రాజ్యాధీశులైన మీరు, మంత్రి చాతుర్‌ పండిట్‌, నా కుటుంబసభ్యులను చంపి, ధనం దోచుకెళ్లినట్టు కనిపించింది’’ అన్నాడు వృద్ధుడు. దాంతో రోజుకు బాగా కోపం వచ్చింది. ‘‘కలలో వచ్చింది నిజమై పోతుందా?’’ అని ప్రశ్నించాడు. ‘‘మీకు వచ్చిన కల గురించి మీరూ ఆలోచిస్తున్నారు కదా?’’ అని తిరిగి ప్రశ్నించాడు వృద్ధుడు. ఆ సమాధానం విన్న రాజు వచ్చింది తెనాలి రామకృష్ణుడు అని గుర్తుపట్టాడు.

Updated Date - 2021-02-18T06:29:26+05:30 IST