రాజు కక్షకు రాజ్యం బలి!

ABN , First Publish Date - 2020-02-23T06:10:05+05:30 IST

‘‘మాముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలన ఎవరి ఊహకు అందని విధంగా సాగుతోంది’’ అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఈ మధ్య మురిపెంగా చెప్పుకొచ్చారు. నిజమే.. కన్నబాబుకు మాత్రమే కాదు వైసీపీకి ఓట్లు వేసినవారి ఊహలకు సైతం...

రాజు కక్షకు రాజ్యం బలి!

గతంలో ప్రభుత్వాల ద్వారా అసైన్డ్‌ భూములు పొందినవారి నుంచి ఇప్పుడు బలవంతంగా ఆ భూములను ఇళ్ల పట్టాల కోసమని గుంజుకుంటున్నారు. ఈ విషయంలో జరుగుతున్న తప్పులను సరిచేసుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్లు అందరికీ ఒక మెసేజ్‌ పెట్టారు. ‘‘ఇళ్ల స్థలాల అంశంపై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. మీరంతా వెంటనే విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేసి ఎవరి భూములను తీసుకున్నారని పత్రికలలో రాశారో వారిని మీ పక్కన కూర్చోబెట్టుకుని తమ నుంచి భూములు గుంజుకోలేదని చెప్పించండి. అదంతా వీడియో తీసి వెంటనే నాకు పంపించండి’’ అని కలెక్టర్లకు ఇచ్చిన మెసేజ్‌లో ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆదేశించారు. అయినా ప్రవీణ్‌ ప్రకాశ్‌ కోరుకున్నట్టుగా ఏ జిల్లా కలెక్టర్‌ కూడా బాధితులను పిలిపించి వారితో తమ భూములు బలవంతంగా తీసుకోలేదని చెప్పించలేకపోయారు.


ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పట్టరాని కోపం ఉంది. ఈ ఇరువురి మధ్య రాజకీయ వైరం కాస్తా వ్యక్తిగత కక్ష స్థాయికి చేరింది. చంద్రబాబును ఎలాగైనా కేసులలో ఇరికించాలనీ, దోషిగా చట్టం ముందు నిలబెట్టాలనీ జగన్మోహన్‌రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో ముందు వెనుకా ఆలోచించకుండా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన చర్యల వల్ల రాష్ట్ర భవిష్యత్‌ ఏమవుతుందా? అని జగన్మోహన్‌రెడ్డి ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. పగతో రగిలిపోయేవారు విచక్షణ కోల్పోతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది ఇదే! చంద్రబాబు నిజంగా తప్పు చేసి ఉంటే ఆయనపై చర్యలు తీసుకోవద్దని ఎవరూ అనరు. అడ్డుకోలేరు కూడా! అంతేగానీ.. రంధ్రాన్వేషణ జరుపుతూ పోవడం వల్ల రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణం ఏర్పడుతుంది. ఇంకో మూడు నెలలు పోతే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకుంటుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదు.


‘‘మాముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలన ఎవరి ఊహకు అందని విధంగా సాగుతోంది’’ అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఈ మధ్య మురిపెంగా చెప్పుకొచ్చారు. నిజమే.. కన్నబాబుకు మాత్రమే కాదు వైసీపీకి ఓట్లు వేసినవారి ఊహలకు సైతం అందని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పాలన సాగుతోంది. రాష్ట్రాన్ని ఏమి చేయబోతున్నారో కూడా తెలియని విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి. ప్రభుత్వంపై ఇంటా–బయటా విమర్శలు వస్తున్నా ముఖ్యమంత్రి చెవికి ఎక్కడం లేదు. విచక్షణారహితంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకోవడం కూడా జగన్మోహన్‌రెడ్డికే చెల్లుతుంది. చంద్రబాబు అయిదేళ్ల పాలనపై గంపగుత్తగా విచారణకు సిట్‌ ఏర్పాటుచేయడం జగన్మోహన్‌రెడ్డి మనోపైత్యానికి అద్దంపడుతోంది. గత ప్రభుత్వాలలో అవకతవకలు జరిగి ఉంటే నిర్దుష్టమైన అంశాలపై విచారణ జరిపించడం ఏ ప్రభుత్వానికైనా సహజం. అందుకు విరుద్ధంగా గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలపై విచారణ చేయాలనుకోవడం, అందుకు పది మంది పోలీస్‌ అధికారులతో సిట్‌ ఏర్పాటు చేయడాన్ని ఇప్పుడే చూస్తున్నాం.


సిట్‌ సభ్యులుగా నియమితులైన వారిలో ముగ్గురు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లు కావడం, సిట్‌ను పోలీస్‌స్టేషన్‌గా పరిగణించడం ఒక వింత నిర్ణయం. అంటే గత ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి బాధ్యులైన అధికారులు కూడా ఏ స్థాయివారైనా సిట్‌ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందేనన్న మాట. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టార్గెట్‌గా ప్రభుత్వం వ్యవహరిస్తున్నందున ఆయనను సిట్‌ అధికారులు ఏ విషయంలోనైనా పిలిపించి విచారించవచ్చు. ఇలా ఒక ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలపై టోకుగా విచారణ జరిపించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుంది. ఇలాంటి విచారణలు అంతిమంగా రాజకీయ వివాదంలో చిక్కుకుంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బలహీనవర్గాల గృహ నిర్మాణ పథకంపై విచారణ జరిపిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పట్లో హడావుడి చేశారు. చివరకు లాభం లేదనుకుని విచారణను అటకెక్కించారు. ఎందుకంటే సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ పథకాలను అమలుచేయాలనుకున్న రాజశేఖర్‌రెడ్డి.. తాను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇళ్ల నిర్మాణ పథకం అమలులో ఉదారంగా వ్యవహరించడం వల్ల అనేక అవకతవకలు జరిగాయి. అనర్హులు లబ్ధి పొందారు.


ఒక్కొక్కరు రెండు, మూడు ఇళ్లకు బిల్లులు తీసుకుని భవనాలు నిర్మించుకున్నారు. ఈ నేపథ్యంలో విచారణ జరిగితే వేలు, లక్షల్లో ఉన్న లబ్ధిదారులపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. విచారణను మధ్యలోనే ముగించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రభావం కూడా రాష్ట్ర భవిష్యత్తుపై తీవ్రంగా ఉంటుంది.


జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవ్వడమే కాకుండా వివాదాస్పదం కూడా అయ్యాయి. ఫలితంగా ఆయా దేశాలకు భారత ప్రభుత్వం సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లింది. సౌర విద్యుత్‌కు సంబంధించిన ఒప్పందాలను పునఃసమీక్షించాలన్న నిర్ణయం ఇప్పటికే వివాదాస్పదమైంది. కేంద్ర ప్రభుత్వం కల్పించుకుని‘‘అలా చేయడం మంచిది కాదు’’ అని చెప్పినా.. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చెవికి ఎక్కించుకోలేదు. హైకోర్టు పలుమార్లు చీవాట్లు పెట్టినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటిపైనా సిట్‌తో విచారణ జరిపించాలనుకోవడం దుస్సాహసమే అవుతుంది. ఇలా ఒక ప్రభుత్వ నిర్ణయాలన్నింటిపై మరో ప్రభుత్వం గంపగుత్తగా విచారణ జరిపించడం వల్ల అరాచకం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడటానికి కూడా పెట్టుబడిదారులు ఇష్టపడరు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ప్రయివేట్‌ పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా రావాలి. అలా జరగనప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి తయారవుతుంది. రాష్ట్ర ఆదాయం క్రమంగా పడిపోతుంది.


రాజకీయ వైరంతో తీసుకునే నిర్ణయాలు రాష్ట్రానికి కీడు చేస్తాయి. తమిళనాడులో కరుణానిధి, జయలలిత జీవించి ఉన్నప్పుడు వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఒకరినొకరు జైలులో పెట్టించారు. అయినా రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ తిరగదోడలేదు. రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు మధ్య కూడా రాజకీయ వైరం ఉండేది. అయినప్పటికీ చంద్రబాబుపై ప్రత్యేకమైన అంశాల వరకే రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపించారే గానీ, ఇలా గంపగుత్తగా విచారణ చేయించలేదు. అలా చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో రాజశేఖర్‌రెడ్డికి తెలుసు కనుక అలాంటి పిచ్చి పనులు చేయలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి రాష్ట్ర పాలకులపై కేసీఆర్‌ ఎన్నో విమర్శలు, ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన వాటి జోలికి పోకుండా తనకంటూ కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు వెళ్లారు. ఈ కారణంగానే ఇవ్వాళ హైదరాబాద్‌ మహానగరం పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఇటువంటి వాతావరణం లేకుండా పోయింది. రాజధాని అమరావతి వికేంద్రీకరణ పేరిట జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర భవిష్యత్‌ అగమ్యగోచరంగా తయారైంది. ప్రస్తుత నిర్ణయంతో ‘‘ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టనేల.. కష్టాలు కొనితెచ్చుకోనేల?’’ అని పెట్టుబడిదారులు భావించకుండా ఎలా ఉండగలరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై జగన్‌ అండ్‌ కో పలు ఆరోపణలు చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతోంది.

ఒక్కటంటే ఒక్క ఆరోపణపై కూడా ఆధారాలు సేకరించలేకపోయారు. రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్నది జగన్‌ అండ్‌ కో చేసిన ప్రధాన ఆరోపణ! ఇప్పటివరకు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు చంద్రబాబు పాల్పడ్డారని రుజువు చేయలేకపోయారు. తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నవారు రాజధానిలో భూములు ఎలా కొనగలరని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న కూడా చట్టం ముందు నిలబడదు. అనర్హులకు కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే ఇబ్బడిముబ్బడిగా తెల్ల రేషన్‌కార్డులు మంజూరు చేశారు. ఇలా జరిగినందుకు శిక్షించాల్సి వస్తే అధికారులే బలవుతారు. రాజకీయ నాయకులను దోషులుగా నిలబెట్టడం అంత సులువు కాదు. ఎందుకంటే అధికారికంగా ఫైళ్లపై సంతకాలు చేసేది అధికారులే! ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పట్టరాని కోపం ఉంది. ఈ ఇరువురి మధ్య రాజకీయ వైరం కాస్తా వ్యక్తిగత కక్ష స్థాయికి చేరింది. చంద్రబాబును ఎలాగైనా కేసులలో ఇరికించాలనీ, దోషిగా చట్టం ముందు నిలబెట్టాలనీ పట్టుదలతో జగన్మోహన్‌రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో ముందు వెనుకా ఆలోచించకుండా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన చర్యల వల్ల రాష్ట్ర భవిష్యత్‌ ఏమవుతుందా? అని జగన్మోహన్‌రెడ్డి ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. పగతో రగిలిపోయేవారు విచక్షణ కోల్పోతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది ఇదే! చంద్రబాబు నిజంగా తప్పు చేసి ఉంటే ఆయనపై చర్యలు తీసుకోవద్దని ఎవరూ అనరు. అడ్డుకోలేరు కూడా! అంతేగానీ.. రంధ్రాన్వేషణ జరుపుతూ పోవడం వల్ల రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణం ఏర్పడుతుంది.


ఇంకో మూడు నెలలు పోతే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకుంటుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదు. ప్రభుత్వ వాలకం చూస్తూ ఉంటే పెట్టుబడిదారులను ప్రోత్సహించే ఆలోచన కూడా లేనట్టుగా ఉంది. చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ఫినిష్‌ చేయడంపైనే జగన్‌ అండ్‌ కో దృష్టి సారించింది. తెలుగుదేశం లేదా చంద్రబాబునాయుడు లేకపోతే తన అధికారానికి తిరుగుండదని జగన్మోహన్‌రెడ్డి భావిస్తుంటే పప్పులో కాలు వేసినట్టే! చంద్రబాబు కాకుంటే మరొకరు పుట్టుకు వస్తారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ లేకుండా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా లక్ష్యంగా పెట్టుకుని కొంతవరకు విజయం సాధించారు. అయితే మాత్రం ఏమైంది.. కాంగ్రెస్‌ బలహీనపడిన రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు మళ్లీ పుంజుకున్నాయి. అంతేగానీ బీజేపీకి తిరుగులేదు అని భావించలేని పరిస్థితి ఉంది కదా! ఆంధ్రప్రదేశ్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ‘‘జగన్మోహన్‌రెడ్డికి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు గానీ, దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల ఆలోచన చేశారు’’ అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆశ్చర్యం వ్యక్తంచేశారు. పాపం రాజాకు జగన్‌ గురించి తెలియదనుకుంటా! ఆయన ఎవరి సలహాలూ స్వీకరించరనీ, తనకు తోచిన నిర్ణయాలు తీసుకుంటారనీ రాజాకు స్థానిక సీపీఐ నాయకులు కూడా చెప్పినట్టు లేదు. చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని ప్రజలను నమ్మించే లక్ష్యంతో జగన్‌ అండ్‌ కో ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేసింది. ఉదాహరణకు వెలిగొండ ప్రాజెక్ట్‌ ఒకటో టన్నెల్‌ పొడవు సుమారు 20 కిలోమీటర్లు కాగా ఇప్పటివరకు సుమారుగా 91 శాతం పనులు పూర్తిచేశారు. వాస్తవం ఇదికాగా.. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో 600 మీటర్లు మాత్రమే సొరంగాన్ని తొలిచారనీ, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కేవలం 8 నెలల్లోనే 1.4 కిలోమీటర్లు తవ్వారనీ ప్రచారం మొదలెట్టారు. ఇలాంటివి ఎన్నో! రెండు పార్టీల మధ్య నెలకొన్న రాజకీయ కక్షలకు తోడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్‌ ఆందోళనకరంగా మారింది. తాజాగా సిట్‌ ఏర్పాటుచేయడమే కాకుండా అది పోలీస్‌స్టేషన్‌గా పనిచేస్తుందనీ, సీఆర్‌పీసీ కింద కేసులు నమోదు చేస్తుందనీ ఉత్తర్వులు ఇవ్వడంపై జాతీయ స్థాయిలో స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాలి.


..కక్ష రాజకీయాలు తోడైతే ఇంతే!

రాష్ట్రం అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు.. తాను అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తనను మళ్లీ గెలిపిస్తాయని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బలంగా నమ్ముతున్నారు. అందుకే అప్పులు చేసి మరీ అడ్డగోలుగా పంచిపెడుతున్నారు. సంక్షేమం పేరిట విచక్షణారహితంగా ఉచిత పథకాలు ప్రవేశపెట్టడం వల్ల సమాజంలో నైతికత కూడా పోతుంది. దోమ మనల్ని కుట్టడానికి ముందు మత్తు మందు వంటిది ఎక్కిస్తుంది. ఆ తర్వాత కసి తీరా కుడుతుంది. ఫలితంగా మనకు మలేరియా రావొచ్చు. డెంగ్యూ రావొచ్చు. లేదంటే మరేదైనా ప్రమాదకరమైన వ్యాధి సోకవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు కూడా దోమకాటును తలపిస్తున్నాయి. సంక్షేమం అనే మత్తులో జనాన్ని ముంచుతూ కరెంట్‌ చార్జీలు, బస్సు చార్జీలు, పెట్రోల్‌–డీజిల్‌ ధరలు పెంచేశారు. మరోవైపు గతంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను నిలిపివేశారు. గతంలో అమలుచేసిన ‘చంద్రన్న బీమా’ పథకం పేరు మార్చారే గానీ అమలుచేయడం లేదు. అన్న క్యాంటీన్లను మూసివేశారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు నిలిపివేశారు. ఫీజుల చెల్లింపు పథకం అమలులో ఉందో లేదో తెలియదు. రేషన్‌ కార్డులను ఏరిపారేస్తున్నారు. పెన్షన్లను తొలగిస్తున్నారు.


ఇలా వేల కోట్ల రూపాయలతో అమలుచేసిన సంక్షేమ పథకాలను నిలిపివేసి, ‘అమ్మఒడి అమలు చేస్తున్నాముగా’.. అని అంటున్నారు. ఈ పథకం వల్ల పేదల పిల్లలకు మెరుగైన విద్య లభిస్తుందా? అంటే ఆచరణలో అదీ కనిపించడం లేదు. సంక్రాంతి పండుగకు ముందు లబ్ధిదారులకు 15 వేల వంతున బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఆ డబ్బు వచ్చిపడటంతో అప్పుడే విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’.. సినిమాలు ఆంధ్రాలో ఆశించిన దానికంటే ఎక్కువ విజయవంతం అయ్యాయని ఒక బడా నిర్మాత వివరించారు. అంతేకాదు.. జనం దగ్గర డబ్బు ఉందని గ్రహించిన వస్త్ర దుకాణాలవారు పండగ సందర్భంగా ఇచ్చే డిస్కౌంట్లను ఎత్తేశారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే! జగనన్న ప్రభుత్వం తమకు 15 వేల రూపాయలు ఇచ్చిందని సంబరపడుతున్న జనం తాము కోల్పోతున్నది ఏమిటో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో ఉపాధి దొరకడం లేదు. ఫలితంగా ఒక్కొక్కరు నెలకు ఏడెనిమిది వేలు నష్టపోతున్నారు. సంవత్సరానికి లెక్క కడితే ఒక్కో కుటుంబం లక్ష రూపాయలకుపైగా కూలి డబ్బు కోల్పోతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక దళితుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ప్రభుత్వం నుంచి అందిన 15 వేలతో పోల్చితే మేం కోల్పోతున్నది ఎన్నో రెట్లు ఎక్కువ’’ అని వాపోయాడు. పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది. గతంలో ప్రభుత్వాల ద్వారా అసైన్డ్‌ భూములు పొందినవారి నుంచి ఇప్పుడు బలవంతంగా ఆ భూములను ఇళ్ల పట్టాల కోసమని గుంజుకుంటున్నారు. ఈ విషయంలో జరుగుతున్న తప్పులను సరిచేసుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్లు అందరికీ ఒక మెసేజ్‌ పెట్టారు. ‘‘ఇళ్ల స్థలాల అంశంపై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. మీరంతా వెంటనే విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేసి ఎవరి భూములను తీసుకున్నారని పత్రికలలో రాశారో వారిని మీ పక్కన కూర్చోబెట్టుకుని తమ నుంచి భూములు గుంజుకోలేదని చెప్పించండి. అదంతా వీడియో తీసి వెంటనే నాకు పంపించండి’’ అని కలెక్టర్లకు ఇచ్చిన మెసేజ్‌లో ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆదేశించారు. అయినా ప్రవీణ్‌ ప్రకాశ్‌ కోరుకున్నట్టుగా ఏ జిల్లా కలెక్టర్‌ కూడా బాధితులను పిలిపించి వారితో తమ భూములు బలవంతంగా తీసుకోలేదని చెప్పించలేకపోయారు. జగన్మోహన్‌రెడ్డిలాంటి ముఖ్యమంత్రికి ప్రవీణ్‌ ప్రకాశ్‌ వంటి అధికారి తోడైతే పరిస్థితి ఎలా ఉంటుందో.. ఏపీలో ఇప్పుడు అలాగే ఉంది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని 67 రోజులుగా ఆందోళన చేస్తున్న వందలాది మంది రైతులపై కేసులు పెడుతున్నారు. ప్రజాప్రతినిధులను, అధికారులను అడ్డగించి నిరసన తెలపడం ఎప్పటినుంచో ఉంది. కానీ గత ప్రభుత్వాలు ఇలా వందలమందిపై మూకుమ్మడిగా కేసులు పెట్టలేదు. ఆ మధ్య రాజధానిలో పర్యటించిన చంద్రబాబును అడ్డుకున్నవారిని ‘‘నిరసన తెలపడం తప్పు కాదు’’ అని వెనకేసుకొచ్చిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఇప్పుడు రైతులపై కేసులు పెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారో తెలియదు. ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్నవారిపై కూడా కేసులు పెట్టారు. తనను అడ్డగించడంపై ఆగ్రహించిన రోజా.. ‘‘13 జిల్లాల ప్రజలు పన్నులు కడుతున్నారు. అలాంటప్పుడు అభివృద్ధిని ఒకేచోట ఎలా కేంద్రీకరిస్తాం’’ అని సెలవిచ్చారు. అమరావతి నిర్మాణానికి ప్రభుత్వ వనరుల నుంచి డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. రైతులు ఉచితంగా ఇచ్చిన భూములను అమ్మి నిధులు సమకూర్చుకోవచ్చు అన్న సంగతి ఆమెకు తెలియనిది కాదు. చంద్రబాబు ఉండకూడదు.. ఆయన మొదలుపెట్టిన అమరావతి ఉండకూడదు అని వైసీపీ నాయకులు పైనుంచి కిందిస్థాయి వరకు లక్ష్యంగా పెట్టుకున్నందున అసత్యాలే సత్యాలుగా ప్రచారం అవుతున్నాయి. ఓటుబ్యాంకు రాజకీయాలకు కక్ష రాజకీయాలు తోడైతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. నిజాలు వినడానికి, చూడటానికి ఇష్టపడని వైసీపీ నాయకులు.. గాంధీగారి మూడు కోతులలో రెండు కోతులనే నమ్ముతున్నారు. అసత్యాలు ప్రచారం చేయడానికి నోరు కావాలి కనుక మూడో కోతిని మాత్రం పట్టించుకోవడం లేదు. గాంధీగారి కోతులకు అర్థం కూడా మార్చారు. చెడు చూడవద్దు.. వినవద్దు అని గాంధీజీ చెబితే మంచి చూడం, మంచి వినం అన్నట్లుగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. చెడు మాట్లాడవద్దు అని చెబితే అసత్యాలనే సత్యాలుగా ప్రచారం చేస్తాం అంటున్నవారిని ఎవరు మాత్రం ఏమి మార్చగలరు?






ఆర్కే


యూట్యూబ్‌లో 
‘కొత్త పలుకు’ కోసం
QR Code
scan
చేయండి


Updated Date - 2020-02-23T06:10:05+05:30 IST