నాయకులెక్కడ?

ABN , First Publish Date - 2021-05-16T05:08:40+05:30 IST

కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు ముఖం చాటేస్తున్నారు. మునిసిపల్‌, స్థానిక ఎన్నికల సమయంలో కరోనా కేసులు నమోదవుతున్నా.. ఇంటింటా తిరిగి తమను గెలిపించాలని అభ్యర్థించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రచారం చేయాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను సైతం ఉల్లంఘించారు. సభలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఎన్నికలు పూర్తికావడంతో ప్రస్తుతం ఎక్కడా నేతలు కానరావడం లేదు.

నాయకులెక్కడ?

- కరోనా వేళ.. కానరాని ప్రజాప్రతినిధులు!

- కొవిడ్‌ బాధితులను పట్టించుకోని వైనం

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి) 

కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు ముఖం చాటేస్తున్నారు. మునిసిపల్‌, స్థానిక ఎన్నికల సమయంలో కరోనా కేసులు నమోదవుతున్నా.. ఇంటింటా తిరిగి తమను గెలిపించాలని అభ్యర్థించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రచారం చేయాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను సైతం ఉల్లంఘించారు. సభలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఎన్నికలు పూర్తికావడంతో ప్రస్తుతం ఎక్కడా నేతలు కానరావడం లేదు. జిల్లాలో కరోనా బారిన పడి వందలాది మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. కొంతమంది బతుకుజీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇటువంటి కష్టకాలంలో తమను నాయకులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఆర్థిక సాయం విషయం పక్కనపెడితే.. కనీసం పరామర్శించే నాథుడు లేడని ఆవేదన చెందుతున్నారు.  స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులే తమను  ఆదుకుంటున్నారని పేర్కొంటున్నారు. 


ప్రజాసేవ ఇదేనా?

కరోనా వ్యాప్తి వేళ.. మేమున్నామంటూ పాలకులు భరోసా ఇవ్వాలి. బాధితులను పలుకరించి చేతనైన సాయం చేయాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు అంచనా వేసి, బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ బెడ్లు, ఆసుపత్రుల్లో చేర్చేందుకు తమ వంతు సహాయక చర్యలు చేపట్టాలి. కానీ జిల్లాలో నేతలెవరూ ఈ దిశగా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేలు  నియోజకవర్గాల్లో జాడ లేకుండా పోయారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు తెరవడం లేదు. ఫోన్‌లకు సైతం అందుబాటులో ఉండడం లేదు. దీంతో జిల్లాలో ఏ నియోజకవర్గంలో బాధితులకు బెడ్‌ కావాలన్నా కలెక్టర్‌ను సంప్రదించి ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం ఎమ్మెల్యే  ధర్మాన ప్రసాదరావు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీడియో విడుదల చేసి పనైపోయిందనిపిస్తున్నారు. ఆయన కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో లేరు. ఉద్దానం ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే కరోనా కారణంగా రెండు వారాలుగా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే కూడా కరోనా బారినపడి రెండు వారాలుగా ప్రజలకు అందుబాటులో లేరు. టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు..  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో తిరుపతి, విశాఖల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి గతేడాది కరోనా సమయంలో పత్తా లేకుండా పోయారు. ఢిల్లీలోనే ఉండిపోయారు. ఈ ఏడాది నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నా, సేవా కార్యక్రమాలు చేయడం లేదు.  పాలకొండ ఎమ్మెల్యే కళావతి ప్రజలకు చేసిన సేవలు ఏమీ లేవు. అప్పుడప్పుడు మండలాల్లో పర్యటించి వెళ్లిపోతున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు ఎమ్మెల్యేలే అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌లు. కానీ కరోనా వేళ స్థానిక వైద్య సిబ్బంది పనితీరు, వారి సేవలను ఏనాడూ వాకబు చేసిన సందర్భం లేదని పలువురు పెదవి విరుస్తున్నారు.


స్థానిక ప్రజాప్రతినిధులు అంతే...

స్థానిక ఎన్నికల్లో ఇటీవల గెలుపొందిన సర్పంచ్‌లు, మునిసిపల్‌ వార్డు కౌన్సిలర్‌లు కూడా ప్రజలకు చేసిందేమీ లేదు. ప్రజలతో పాటు తాముకూడా కరోనా బాధితులమంటూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. సర్పంచ్‌లు తాము ఏ పని చేయాలన్నా ఇంకా చెక్‌ పవర్‌ రాలేదంటూ సాకులు చెబుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ఫలితాలు రాలేదు కదా... మేమెందుకు ప్రజలకు సేవ చేయాలనే ధోరణిలో ఉండిపోతున్నారనే విమర్శలున్నాయి. 


 కనిపించని కౌన్సిలర్లు 

ఇచ్ఛాపురం : పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీలు, పాలకొండ నగర పంచాయతీలో కౌన్సిలర్లు కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. మార్చి పదోతేదీన ఎన్నికలు జరగ్గా, 18న పాలకవర్గాలు కొలువుదీరాయి. తాము గెలిస్తే మీ వెంటే ఉంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. గెలిచి రెండు నెలలు దాటుతున్నా  చైర్‌పర్సన్‌, వైఎస్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు ఇళ్లకే పరిమిత మయ్యారు. ఇచ్ఛాపురంలో 23, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో 31 మంది  కౌన్సిలర్లు గెలుపొందారు. వీరంతా ప్రజలు కొవిడ్‌తో భయాందోళన చెందుతున్నా కనీసం వార్డుల్లో పర్యటించి ఽఽధైర్యం చెప్పడంలేదని జనం వాపోతున్నారు. కొవిడ్‌ నివారణకు అనుసరించాల్సిన చర్యలు, వ్యాక్సిన్‌ విషయంలో తీసుకోవల్సిన వ్యూహం మీద కూడా కనీసం అవగాహన కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు తమకు అండగా నిలవాలని జిల్లావాసులు కోరుతున్నారు.   

Updated Date - 2021-05-16T05:08:40+05:30 IST