Congress' President Elections: కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీలో ఉన్నది వీరే?

ABN , First Publish Date - 2022-08-21T18:43:42+05:30 IST

కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలను మరోసారి చేపట్టడానికి

Congress' President Elections: కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీలో ఉన్నది వీరే?

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలను మరోసారి చేపట్టడానికి రాహుల్ గాంధీ విముఖత వ్యక్తం చేస్తుండటంతో ఆ పార్టీకి గాంధీయేతర అధ్యక్షుడు రాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతానికి ఆ పదవిని ఎవరు అలంకరించబోతున్నారో స్పష్టత రాలేదు. ఆ పార్టీ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ గాంధీని ఒప్పించేందుకు అనేకమంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 


కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్న నేతల్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (71) ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. షెడ్యూలు ప్రకారం ఈ పదవికి నామినేషన్ల ప్రక్రియ ఆదివారం (ఆగస్టు 21) నుంచి ప్రారంభం కావలసి ఉంది. కానీ పార్టీలో అనిశ్చితి తాండవిస్తోంది. దీనిపై ఆ పార్టీ అధికారికంగా స్పందించడం లేదు. 


అశోక్ గెహ్లాట్‌తోపాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 


షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరిగితే సెప్టెంబరు 20న ఫలితాలు వెలువడతాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం వచ్చే వారం జరుగుతుంది. ఆ పార్టీ  సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ఓటర్ల జాబితాను సమర్పిస్తారు. సీడబ్ల్యూసీ సభ్యులను, కాంగ్రెస్ అధ్యక్షుడిని ఈ ఓటర్లు ఎన్నుకుంటారు. 


ఈ ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ గత ఏడాది ప్రారంభమైంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో దాదాపు 14,000 మంది పీసీసీ డెలిగేట్లు పాల్గొంటారు. 


గాంధీ కుటుంబ నేపథ్యం లేని సీతారాం కేసరి 1996 నుంచి 1998 వరకు కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేశారు. ఆయన తర్వాత సోనియా గాంధీ ఆ పార్టీ పగ్గాలను చేపట్టారు. ప్రస్తుతం ఆమె తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనారోగ్య కారణాలతో ఆమె ఆ పదవిలో కొనసాగేందుకు ఇష్టపడటం లేదు. 


Updated Date - 2022-08-21T18:43:42+05:30 IST